Monday, 12 December 2016

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి //ఇదేనా ఆ మురళి మోహన మురళి


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/