Sunday 4 December 2016

సుబ్రహ్మణ్యుని ఆరు దివ్య క్షేత్రాలు


సుబ్రహ్మణ్యుని  ఆరు దివ్య క్షేత్రాలు.

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రమణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యముంది. తండ్రికే జ్ఞానభోద చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖ స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.

తిరుచందూర్
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్‌లో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్‌లో కొలువై నిలిచారట. తిరుచందూర్‌లోని సుబ్రమణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.

కుంభకోణం
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.
పళని
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళనిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

తిరుత్తణి
తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.

పరిముదిర్‌చోళై
దట్టమైన అడవి ప్రాతంలో వెళసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.

తిరుపరన్‌కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్‌కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరు భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్‌కున్రమ్.