Friday 2 December 2016

" మణిద్వీప వర్ణన " పారాయణంతో సకల శుభాలు కలుగుతాయి



మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన పారాయణంతో
ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.
సకల శుభాలు కలుగుతాయి.
అమ్మవారి అనుగ్రహంతో
అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.

శ్రీ చక్ర బిందు రూపిణి
శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య
శ్రీ మహా త్రిపుర సుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే
పవిత్ర ప్రదేశమే  " మణి ద్వీపం."

14 లోకాల అనంతరం సర్వలోకంలో
ఆమె కొలువై ఉంటుంది.
యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది.
నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం
సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు.
మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై ఉంటారు.

దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది.

అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు
బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి.
అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.
మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.
వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు.
అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది.
పచ్చటి అరణ్యములతో,
వివిధ రకాల జంతువులు,
పక్షుల కిలకిలరావాలతో
ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

 ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు.
జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు.
ముక్తి మండపంలోమంత్రులతో చర్చలు నిర్వహిస్తారు.
వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం.
యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన
సంపద అక్కడ వుంటుంది.

మణిద్వీప వర్ణన :
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది.
దీనిని సర్వలోకమని కూడా అంటారు.
మణిద్వీపం 
కైలాసం,
వైకుంఠం,
గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా
అమృత సముద్రము విస్తరించి ఉంటుంది.
ఆ సముద్రంలో శీతల తరంగాలు,
రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు,
శంఖాలు అనేక వర్ణాలు గల
జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల
ఏడుయోజనాల వైశాల్యం గల
లోహమయ ప్రాకారం ఉంటుంది.
నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు.
ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు.
అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి.
అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది.
సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి.
అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు,
నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి.
అనేక జాతులు పక్షులు,
అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.
ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది.
అది చతురస్రాకారంగా ఉంటుంది.
అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి.
పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి.
తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా
సీసప్రాకారం ఉంటుంది.
సీస ప్రాకారాల మధ్య భాగంలో
సంతాన వాటిక ఉంది.
అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి.
అక్కడ లెక్కలేనన్ని
అమర సిద్ధగణాలు ఉంటాయి.
సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది.
సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో
హరిచందన తరువనాలు ఉన్నాయి.
ఈ ప్రదేశమంతా
నవపల్లవ తరు పంక్తులతో,
లేలేత తీగలతో,
పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది.
అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి.
ఆ ఇత్తడి ప్రాకారం దాటగా
పంచలోహమయ ప్రాకారం ఉంటుంది.
ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు,
చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు
సుగంధాలు వెదజల్లుతుంటాయి.
ఆ ప్రాకారం దాటి వెళ్ళగా
సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది.
రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య
కదంబవనం ఉంది.
ఆ చెట్ల నుండి కదంబ మద్యం
ధారగా ప్రవహిస్తుంటుంది.
దానిని పానము చేయడం వలన
ఆత్మానందం కలుగుతుంది.
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా
ఎర్రటి కుంకుమ వర్ణంగల
పుష్యరాగమణి ఉంటుంది.
సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య
వృక్షాలు,
వనాలు,
పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి.
ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు
ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు.
దానికి తూర్పుగా అమరావతీ నగరం
నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది.
అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై
దేవసేనతో కూడి ఉంటాడు.
దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు.
పశ్చిమదిశలో వరుణ దేవుడు
శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు.
ఉత్తరదిశలో కుబేరుడు తన
యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది.
ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ,
మాతలతోనూ,
వీరభద్రాదులతోనూ
యశోవతిలో భాసిల్లుతూంటాడు.
పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి
గోపుర ద్వారాలు
అసంఖ్యాక మండపాలు ఉన్నాయి.
వాటి మధ్య మహావీరులున్నారు.
చతుస్షష్టి కళలు ఉన్నాయి.

వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి.
అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు
మించి ఉన్నాయి.
ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా
గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది.
జపాకుసుమ సన్నిభంగా
కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది.
అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి.
అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి.
32లోకాలు ఉన్నాయి.
ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి.
వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు.
గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే
వజ్రాల ప్రాకారం ఉంటుంది.
అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.
వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా
వైడూర్య ప్రాకారం ఉంటుంది.
అక్కడ 8దిక్కులలో
బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు
సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు.
శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా
పిలువబడుతూ ఉంది.
ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది.
అక్కడ షోడశ శక్తులు ఉంటాయి.
ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి.
ఇంకా ముందుకు వెళ్ళగా
మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో
గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు.
నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి
విరాజిల్లూతు ఉంతారు.
వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు.
పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు.
ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు.
వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు.
ఇంకా ముందుకు వెళ్ళగా
పగడాల ప్రాకారం ఉంటుంది.
అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా
నవరత్న ప్రాకారం ఉంటుంది.
అక్కడ శ్రీదేవి యొక్క
మహావతారాలు,
పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట,అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి
మొదలైన దశ మహావిద్యలు
ప్రకాశిస్తూంటాయి.
నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ
చింతామణి గృహం ఉంటుంది.

మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై ఉంటారు.

14 లోకాల అనంతరం సర్వలోకంలో
ఆమె కొలువై ఉంటుంది.
యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా
ఈ లోకం ఉద్భవించింది.
నాలుగు వైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు.


శ్రీ దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన
వర్ణన వుంది.