Monday 15 July 2019

శాకంబరి దేవి ఉత్సవం


ఆకైనా, అలమైనా, కాయయినా, పండయినా వాటిలోని జవం, జీవం ఆమె చైతన్యమే...
అందుకే ఆ మూల ప్రకృతికి ప్రణమిల్లుతాం. ప్రణతులు అర్పిస్తాం.
పంటలు తొలిదశలో ఉన్న సమయంలో వివిధ కూరగాయలను సమర్పించి,
 వాటితో అలంకరించి అమ్మవారిని పూజించడం సంప్రదాయం.
ఆషాఢమాసంలో
శుక్లపక్ష పౌర్ణమిరోజు జరిగే
 "  శాకంబరీ ఉత్సవం. "
ఇహపర సందేశాలను అందిస్తుంది.
దుర్గాదేవి ఒక్కో రూపానిది ఒక్కో ప్రత్యేకత. ఆ స్వరూపాలన్నీ అమ్మకు అలంకరణలే కాదు,
అవన్నీ భక్తులు తనను వివిధ రూపాల్లో ఉపాసించేందుకు ఆమె సూచించిన మార్గాలు.
ఆ పరంపరలో శాకంబరీదేవిగా
ఆ జగజ్జనని శోభాయమాన ఆహార్యంతో అలరారుతుంది.
అఖండమైన శక్తితో ఆశీస్సులు అందిస్తుంది. దుర్గాసప్తశతిలోని
 ఆఖరి అధ్యాయమైన
 ‘మూర్తి రహస్యం’ ఆ లోకపావని రూపాన్ని అద్భుతంగా వర్ణించింది.
శాకంబరి దేవి నీలవర్ణ దేహంతో, మహావిద్యకు ప్రతీక అయిన రత్నమణిమయ కిరీటాన్ని ధరించి, తన బిడ్డలను దయాదృక్కులతో వీక్షిస్తూ కొలువై ఉంటుందని చెప్పింది.
ఈ శాకంబరి రూపంపై ధ్యానం చేయడం ఆధ్యాత్మికసాధనలో భాగం.
స్కాంద పురాణంలో, దేవీ భాగవతంలో శాకంబరీదేవి గురించి ఉంది.
అమ్మ వైభవాన్నే కాకుండా, ఉపాసనా విధానాలు కూడా వీటిలో విస్పష్టంగా ఉన్నాయి.

అసలీ తల్లి అవతరించడానికి కారణంగా చెప్పే కథ :

ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు.
దేవతలు సహా అందరూ వేద విజ్ఞానాన్ని మరచిపోవాలని, నిగమ జ్ఞానమంతా తనకే దక్కాలని వరాన్ని కోరుకున్నాడు.
అందరూ వేద విజ్ఞానాన్ని మర్చిపోవడంతో చాతుర్వర్ణాల వారు తమ విధులను విస్మరించారు.
వృత్తి నిపుణులు నైపుణ్యాలను మరచిపోయారు.
దీంతో పరిస్థితులు అస్తవ్యస్తమయ్యాయి. భూరక్షణ, వ్యాపారం, యజ్ఞయాగాదులు స్తంభించాయి.
ఎక్కడ చూసినా కరవు.
ప్రజలు ఆకలితో అలమటించారు.
అప్పుడు రుషులు సుమేరు పర్వత గుహల్లోకి వెళ్లి తపస్సు చేశారు.
దీంతో నీలవర్ణంతో, చతుర్భుజాలతో, ధనుర్భాణాలతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు.
తన బిడ్డల దుస్థితిని చూసి ఆమె తొమ్మిది రోజులపాటు కంటికీమింటికీ
 ఏకధారగా రోదించారు.
 ఆ కరుణామృతసాగరి కన్నీటికి ఈ భూమిపై నదులన్నీ నిండిపోయాయి.
 అంతేకాకుండా అశేష జనవాహిని ఆకలికేకల్ని విని ఆమె శాకంబరిగా మారిపోయింది.
పండ్లు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలుగా  అన్నిటినీ తన బిడ్డలకు పంచి తక్షణమే అందరి ఆకలి తీర్చింది.
కరవుకాటకాలను అంతం చేసింది.

ఆ తర్వాత దుర్గమాసురుణ్ణి సంహరించింది.  అమ్మను అనేక రకాల కూరగాయలు, ఆకులతో అలంకరించడం వెనక అంతరార్థం ప్రకృతిని అమ్మగా గ్రహించమని చెప్పడమే.

ఆషాఢ మాసం :

చంద్రమానం ప్రకారం
తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై ఫాల్గుణంతో ముగుస్తుంది.
తెలుగు నెలల క్రమంలో ఆషాడం నాలుగోది.
ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు విరామం ఇస్తారు.

పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాడ నక్షత్రంలో సంచరించే మాసం
 ‘ఆషాఢ మాసం’.
దీనిని శూన్యమాసమంటారు.
ఆషాఢం నుంచే దక్షిణాయణం, వర్షరుతువు ఆరంభమవుతాయి.
కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం తిరిగి మకర రాశిలోకి వెళ్లే వరకు ఆరు మాసాలు ఉంటుంది. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది.
ఆషాఢంలో అందరూ  గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం ....


గోరింటాకు పుట్టుక  :

అసలు పేరు గౌరింటాకు
(గౌరి ఇంటి ఆకు)

గౌరీదేవి బాల్యంలో చెలులతో
వనంలో ఆటలాడే సమయాన
రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓమొక్క పుడుతుంది.
ఈ వింతను చెలులు పర్వతరాజుకు
చెప్పగా సతీసమేతంగా చూసేందుకు
వస్తాడు.
అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను
నావలన లోకానికి ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది.
అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది.
ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.
అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే ,పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు.
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా
ఈ గౌరింటాకు మానవలోకంలో
ప్రసిధ్ధమవుతుంద ని ,రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది.
అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తనవర్ణం వలన చేతులకు కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది
అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా అప్పటినుంచి , గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చి దిద్దుకుంటు ఉంటారు.
ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది.నుదుటన కూడా‌ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో
ఆసందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది. గోరింటాకు నుదుటన పండదు.

శాస్త్రపరంగా
1.గర్భాశయదోషాలు తీసేస్తుంది.
2. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి.
 వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి
ప్రశాంతపరుస్తుందిగోరింటాకు.
3. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి అంటారు పెద్దలు.

గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అన్నది నానుడి.

స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా
అందంగా సున్నితంగా ఉంటుంది.
అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు
మరింత అందంగా పండి కనిపిస్తుంది.
ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని
సూచిస్తుంది.
ఈ గోరింటాకు  సంవత్సరానికోమారు పుట్టింటికి వెళుతుంది.
అంటే పార్వతి దగ్గరికి.
ఆషాఢమాసంలో
అక్కడున్నపుడు కూడా తనను
మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.  ఆషాఢంలో అందరూ పెట్టుకోవడం సంప్రదాయం అయ్యింది.