భగిని హస్త భోజనము
రాఖి పండుగ తరువాత, అంత వైభవంగా అన్నాచెల్లెళ్ళు జరుపుకునే పండుగ " భగిని హస్త భోజనము". ఈ పండుగను దీపావళి అమావాస్య వెళ్ళిన రెండవ రోజున అంటే " కార్తీక శుద్ధ విదియ " నాడు జరుపుకుంటారు.
భగిని అంటే సోదరి , హస్త భోజనము అంటే వారు తయారు చేసిన వంట. ఈ రోజున అన్నగారు
తన సోదరి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టించుకుని ఆమె వండిన వంటకాలను తింటారు. అలా చేస్తే అన్నదమ్ములకు మంచి జరుగుతుందని అంటారు.
పురాణ కధనం:
సంధ్యాదేవి, సూర్యభగవానుల సంతానము యముడు, యమున. అత్త వారింట్లో ఉన్నయమున తన అన్నగారిని ఒకసారి భోజనానికి రమ్మని పిలిచింది. చెల్లెలి ఆహ్వానము ప్రకారము వస్తానని కబురు పంపాడు. అన్నగారికి ఇష్ట మైన వంటలన్నీ సిద్ధం చేసింది. కాని,ఆయనకు ఆరోజు వీలు పడక కార్తీక శుద్ధ విదియ నాడు వస్తానని కబురు పంపి ఆరోజున వెళ్ళాడు. ఆరోజున అన్నగారు రాగానే బొట్టు పెట్టి హారతి ఇచ్చి తాను చేసిన వంటలను ప్రేమతో వడ్డించింది. అన్నగారు ప్రసన్నుడై ఏదయినా వరము కోరుకొమ్మని అంటే , ప్రతి ఏడాది కార్తీక శుద్ధ విదియ నాడు తన ఇంటికి భోజనానికి రావాలని ,అలాగే ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్లి భోజనము చేస్తే అతనికి మంచి జరగాలని కోరినది .ఆయన వరము ఇచ్చాడు.అప్పటినుంచి దీపావళి అమావాస్య వెళ్ళిన రెండవ రోజునకార్తీక శుద్ధ విదియ నాడు ఈ పండగ చేసుకోవడము ఆనవాయతీగా వస్తోంది .
శ్రీకృష్ణుడు
కూడా నరకాసుర సంహారము అనంతరం తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లి ఆమెచేతితో హారతి తీసుకున్నాడు .
అలాగే బలి చక్రవర్తి
కూడా కార్తీక శుద్ధ విదియ నాడు తన సోదరి ఇంటికి వెళ్లి ఆమెను ఆశీర్వదించాడు.
ఆరోజున సోదరీ సోదరులు కలుసుకోవడానికి వీలు కాని వారు చంద్రునికి పూజ చేసి తమసోదరుల క్షేమం కోరు కుంటారు . సోదరులు లేనివారు ఆ రోజున చంద్రుడిని తమ సోదరుడిగా భావించి పూజిస్తారు.
ఈ పండుగను ఉత్తర భారతీయులు భాయి దూజ్ అని, నేపాల్లో భాయి టికా అని, బెంగాలీలు భాయి ఫాటా అని, కర్ణాటక, తమిళనాడు లలో యమ ద్వితీయ అని, మరాఠీ, గుజరాతి , గోవా, కొంకణి ప్రాంతాల వాళ్ళు భాయిబిజ్ అని అంటారు.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer: Meenu Sriram