Monday 24 October 2016

అన్నపూర్ణాతత్వము


అన్నపూర్ణాతత్వము

" అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం భిక్షామ్ దేహీచ పార్వతీ"

అన్నపూర్ణాదేవి కాశి క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని మనలను అందరిని అనుగ్రహిస్తూ ఉంటుంది.
ప్రత్యేకంగా అన్నపూర్ణోపాసన చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. శ్రీవిద్యోపాసనలో అన్నపూర్ణాదేవిని అమృత శక్తిగా, అమృతేశ్వరీదేవిగా పూజిస్తారు.

అన్నపూర్ణ అనగానే మనకి గుర్తుకు వచ్చేటటువంటి మూర్తి ఎడమచేతిలో ,
మణిమాణిక్యాలతో పొదగపడిన బంగారు గిన్నెను పట్టుకుని, కుడిచేతిలో
బంగారు తెడ్డును మణిమకుటాలతో అలంకరింపబడింది పట్టుకుని
ఆ తల్లి మొదట పరమశివునికి అన్నం వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది.

అన్నపూర్ణ అనేటటువంటి నామము మహా మంత్రం. "అన్న" శబ్దానికి ఐశ్వర్యం అని కూడా అర్ధం.
ఏ ఇంట అన్నపూర్ణ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట దరిద్రం ఉండదు.

పూర్వకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.
ఈ దుర్గమాసురుడు బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు.
ఈ దుర్గముడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మఏమి వరం కావాలో కోరుకొ అన్నారు.
 వేదాలన్నీ నాలోకి వచ్చెయ్యాలి అని, ఇప్పటి వరకు వేదం చదువుకున్నవారు కూడా
దానిని మర్చిపోవాలి అని కోరుకున్నాడు.
వెంటనే బ్రహ్మగారు తధాస్తు అన్నారు.
ఎప్పుడైతే వేదాలన్నీ వాడిలోనికి వెళ్లిపోయాయో అందరూ కూడా వేదమంత్రాలు మర్చిపోయారు.
వేదమంత్రాలను మర్చిపోయేసరికి మరి భగవంతునికి హవిస్సు ఇవ్వడం లేదు.
భగవంతునికి హవిస్సు లేదు కాబట్టి వర్షాలు లేవు. వీటన్నింటికి కూడా అవినాభావ సంబంధం.
వర్షాలు లేక దేశంలో కరువుకాటకాలు ఏర్పడ్డాయి.
ఎవరో కొంతమంది పెద్దలు వారికి తెలిసిన రీతిలో
అమ్మవారి ఆరాధన చేశారు. కొంతమంది కీర్తన ద్వారా, కొంతమంది ధ్యానం ద్వారా,
కొంతమంది నృత్యం ద్వారా తమ తమ భక్తిని ఆవిష్కరించారు.
అలా భక్తులందరూ పిలిచేసరికి ఆ కరుణామయి అయిన ఆమె
తన యొక్క చూపులతోనే అందరిని పోషించింది.
అందుకే ఆ తల్లిని శతాక్షి అన్నారు.
అందరికీ ఆకలిగా ఉంది. ఆ తల్లి తన శరీరం నుండే
అనేక రకాలైన కాయగూరలను,
పండ్లని సృష్టించి అనుగ్రహించింది "శాకంభరీ రూపం " లో
దుర్గమాసురుని సంహరించి 'దుర్గ' అనే నామాన్ని పొందింది.
వేదాలన్నింటిని తనలో నుంచి ప్రకాశింపచేసింది.
వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుపతికి దగ్గిరలో ఉంటుంది.
" శతాక్షి " , "విశాలాక్షి " ," శాకంబరీ " , " అన్నపూర్ణ " , అందరూ ఒక్కటే.