అందాల అరకు లోయ
మంచు తెరల సొగసులు
సంధ్యా రాగపు సరిగమలు
కర్పూర సుగంధాలు
గులాబీల గుబాళింపులు
ఉరికే జలపాతాలు
పచ్చని ప్రకృతి సౌందర్యాలు
కొండలు, కోనలు, లోయలు, గుహలు
మనసుకు అద్భుత ఆహ్లాదాన్ని పరిచయము చేసే సుందర రమణీయ ప్రదేశం,
ఆంధ్రా ఊటీ " అరకు ".
ప్రశాంతమైన వాతావరణానికి, ఎన్నో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు, జలపాతాలు, వాగులు, కాఫీ పంటలు, గులాబి తోటలకు నెలవైన అరకు, విశాఖపట్నం నుండి సుమారు 115 కి. మీ. దూరంలో వుంది. ఇక్కడికి రైలు లేదా రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. విశాఖ నుండి రైలు మార్గములో ప్రయాణము ఆహ్లాదకరముగా వుంటుంది. మార్గ మధ్య లో ఇంచుమించు 46 సొరంగాల గుండా ప్రయాణము గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి గిరిజనుల చేసే ధింస మరియు మయూరి నృత్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అరకు, ఆ చుట్టుప్రక్కల తప్పక చూడవలసిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. వాటిలో కొన్ని ప్రదేశాల వివరాలు మీ ముందుకు...
బొర్రా గుహలు
అరకు నుండి సుమారు 36 కి.మీ. దూరంలో బొర్రా గుహలు వున్నాయి. భారతదేశం లోనే అత్యంత లోతైన గుహలు అయిన బొర్రా గుహలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. సున్నపు రాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి. ఆ సహజ సిద్ధమైన కళాకృతులు మనసును ఎంతో రంజింప చేస్తాయి.
గిరిజన మ్యూజియం
అరకులో తప్పక చూడవలసినది గిరిజన మ్యూజియం. ఇక్కడ నివసించే 19 రకాల తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతీ సాంప్రదాయాలు, జీవన శైలి గురించిన విషయాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ మ్యూజియంలో పొందు పరిచారు.
చాప రాయి
అరకు నుండి సుమారు 15 కి.మీ. దూరంలో చాప రాయి ఉంది. చుట్టూ పచ్చటి అటవీ ప్రాంతం , మధ్యలో విశాలంగా పరచుకున్న రాతి పై జాలువారుతున్న జలపాతం, ప్రకృతి ప్రియులను కట్టి పడేస్తుంది. అరకులో ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి.
అనంతగిరి
అరకు నుండి సుమారు 26 కి.మీ. దూరంలో అనంతగిరి హిల్ స్టేషన్ ఉంది. అనంతగిరి కాఫీ పంటకు ప్రసిద్ధి. అనతగిరి మెయిన్ రోడ్ పై ఉన్న వ్యూ పాయింట్ నుంచి ఒక పక్క కొండలు, లోయలు మరో పక్క కాఫీ పంటలు ఎంతో అందంగా కనిపిస్తాయి .ఇక్కడ ఎన్నో జలపాతాలు ప్రకృతి ప్రియుల మనసు దోచుకుంటాయి.
కటికి జలపాతాలు
బొర్రా గుహలు నుండి సుమారు 7 కి.మీ. దూరంలో కటికి జలపాతాలు ఉన్నాయి. గోస్తాని నది నీటితో ఏర్పడిన ఈ జలపాతాలు 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంటాయి. జలపాతాల కింద ఉన్న కొలనులో స్నానం చెయ్యడం ఓ అద్భుతమైన అనుభూతి.
పద్మాపురం గార్డెన్
1942 లో రెండో ప్రపంచ యుద్ధ సైనికుల కోసం 26 ఎకరాలలో కూరగాయలు పండించడానికి పద్మాపురం గార్డెన్ ఏర్పాటు చేసారు. తరవాత దానిని హార్టికల్చర్ నర్సరీ మరియు శిక్షణా కేంద్రంగా మార్చారు. అక్కడున్న ట్రీ హౌసెస్ ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఎన్నో రకాల పూల మొక్కలు కనువిందు చేస్తాయి.
అరకు జలపాతాలు
అరకు నుండి సుమారు 8 కి.మీ. దూరంలో ఉన్నాయి. 60 అడుగులు ఎత్తు నుండి పడుతున్న ఈ జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ జలపాతాలని చూడడానికి కొండ పైకి ఎక్కవలసి ఉంటుంది. వీటిని చూడాలంటే అరకు-పాడేరు రోడ్డులో రెండు కి.మీ. వెళ్ళాక కుడి వైపు తిరిగి సుమారు 6 కి.మీ. వెళ్ళవలసి ఉంటుంది.
మత్స్య గుండం
అరకు నుండి సుమారు 35 కి.మీ. దూరంలో మత్స్య గుండం అనే కొలను ఉంది. మ్యచ్ కుండ్ అనే నది పై ఒక రాళ్ల సేతు ఉంది. అక్కడ నీటి ప్రవాహం ఒక పెద్ద గుండం లోకి వెళ్లి , అక్కడ నుండి 100 గజాల కింద బయటకు వస్తుంది. ఈ మత్స్య గుండం లో ఎన్నో రకాల చేపలు ఉండుట ఓ ప్రత్యేకత. ఆ గుండంలోకి మెట్ల ద్వార దిగి చేపలకు ఆహరం పెట్టొచ్చు. నది ఒడ్డున శివాలయం ఉన్నది.
టైడ పార్క్
అరకు నుండి సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న గిరిజన గ్రామం పేరు టైడ. ఈ ప్రాంతాన్ని జంగల్ బెల్స్ అని కూడా అంటారు. ఇక్కడ రాక్ క్లైమ్బింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, యారో షూటింగ్ మొదలైన ఆక్టివిటీస్ ఉంటాయి.
ఇవే కాకుండా 27 ఎకరాల్లో వున్న గులాబి తోట, దుంబ్రిగుడ జలపాతాలు, సుంగడ జలపాతాలు, దుడుమ జలపాతాలు, తాడిమాడ జలపాతాలు, పసుపు పచ్చగా ఎంతో ఆకర్షణీయంగా వుండే ఆవ పువ్వులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అందాలు ప్రకృతి ప్రియుల మనసు దోచుకుంటాయి. ఈ అందాలను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే అక్టోబర్ నెల నుండి మర్చి నెల మధ్యలో వెళ్ళాలి.