ద్రాక్షారామం
తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం. పంచారామాల్లో ఒకటి
పురాణ కధలు
తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారు
అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం.
పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దాక్షారామం అయింది.
ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు.ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, శివుడు జగద పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని
మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.
ఈ క్షేత్రం గురించి.
పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద
వ్యాసుని విగ్రహం చెక్కబడింది.
వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు.
మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది. ·
ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. · వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు. ·
ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది. ·
ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.
గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి.
దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.
ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది.
ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు. · ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. · అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో
గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. · 9-10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి. వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.· భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి,
సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.