Tuesday 31 May 2016

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము “అంతర్వేది “. ( అన్నా చెల్లెళ్ళ గట్టు )



                                                             
                                                   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము
                                                                    “అంతర్వేది “.
                                                               

అంతర్వేది నృసిం హాగ్రా రత్నలోచనాసక
ఉత్తిష్ట  కమలాకాంతా భక్తాభీష్ట ప్రపూరయా
అశ్వరూఢామ్బికావ్యాప్త జీహ్వరుద్దరి ఉద్గమా
లక్ష్మీ నృసింహ భగవాన్ సుప్రభాతమరిన్దమాన్”

నవ నృసింహ క్షేత్రాలలో  అగ్రగణ్య మైనదిగా  ప్రభవిల్లుతున్న క్షేత్రం “అంతర్వేది “.  ఇది పరమ పుణ్య  ప్రధమ  క్షేత్రం.  సాగర సంగమ ప్రదేశములో  విరాజిల్లుతున్న ఈ ప్రముఖ దేవాలయము, తూర్పు గోదావరి జిల్లాలోని సఖి నేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వున్నది. పౌరాణికముగా, చారిత్రికముగా ఎంతో ప్రాశస్త్యం వున్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల శుభప్రదం.పవిత్ర గోదావరీ తీరాన వెలసిన ఈ పుణ్య క్షేత్రం  , పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో  ప్రసిద్ధి చెందినది…

" కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి , విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై ,కూనలమ్మ కునుకై ,అది కూచిపూడి నడకై , పచ్చని చేల పావడ కట్టి ,
కొండమల్లెలే కొప్పున బెట్టి,వచ్చే దొరసాని మా వెన్నెల కిన్నెరసాని…"

అంటూ ఎందరో కవులు చల్లని గోదావరి తల్లి గురించి ఎన్నో వర్ణనలు చేసారు…ఇక్కడ గోదావరి నదికి ఇరు ప్రక్కలా  కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, లంకలు కనువిందు చెస్తూ ఉంటే, ఎదురుగా అనంతముగా వ్యాపించి వున్న సముద్రము ఆహ్లాదాన్ని  కలిగిస్తుంది. ఉరకలు, పరవళ్లతో పరుగులు తీసేగోదావరి, సముద్రములో కలిసే దృశ్యము ను చూసి తీరవలసినదే.  అంతర వాహినిలా నది, కడలిలో కలిసే వైనము, ఒక అద్భుత సుందర దృశ్యకావ్యము.  పౌర్ణమి నాటి వెన్నెలలో, వెండి వెలుగులలో  మెరిసిపోతూ ఆ సుందర మనోహర  దృశ్యము కన్నుల పండుగలా ఉంటుంది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ, వశిష్ఠ గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.

అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలో  వుంది. అన్నా చెల్లెల గట్టుగా పిలువ బడే ఈ  ప్రాంతములో, ప్రశాంత మైన వాతావరణములో, భూతల స్వర్గమును తలపింప చేసే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయము, సుప్రసిద్ధ  పుణ్య క్షేత్రముగా  భాసిల్లుతున్నది.
స్థలపురాణం:
ఒకసారి బ్రహ్మ, రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది
రక్తావలోచనుని కథ:
హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి   పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన
రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం  పొందుతాడు. ఆ వర గర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తినుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశారు. ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నారని పురాణ కధనము. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తేసర్వపాపాలు హరిస్తాయని చెబుతారు.
హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా అంటూ వుంటారు.
శ్రీ రాముడు సీతా సమేతుడై లక్ష్మణ, హనుమంతులతో కూడి   వశిష్ఠాశ్రమాన్ని, శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. అర్జునుడు తీర్ధయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లోను,  శ్రీనాధ కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోను వర్ణించారు.
ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ. 300 ఏళ్ళకు పూర్వం నిర్మంపబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
వశిష్ఠాశ్రమం:
సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం వుంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్థులుగా నిర్మించారు. చూట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో వుంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి వున్నాయి. వశిష్ఠాశ్రమం కూడా మనము తప్పక దర్శించవలసినది.
అన్నాచెల్లెళ్ళగట్టు: 
సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడు సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలలో కూడా ఇలాగే వుంటుంది.
అశ్వరూఢామ్బిక ఆలయం (గుర్రాలక్క):
లక్ష్మీ నృశింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూఢామ్బి కాలయం ఉంది. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పిల్చేస్తూ అతని మరణానికి కారణమౌతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూఢామ్బికగా వెలిసింది అని పురాణ కధనము.
ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రధోత్సవం జరుగుతాయి. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు శ్రీ లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సంతానం లేని వారు స్వామివారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ వుండి, రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో  కనిపిస్తేసంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసము.


                  పర్యాటక , ఆధ్యాత్మిక అంతర్వేదిక అయినఅంతర్వేదిని  దర్శించండి, సర్వ శుభాలు  పొందండి…
                              ఓం ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః