" రామభక్తహనుమ "
శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ,అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట,
ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి
నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు.
అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.
ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ
సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది.
ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా ,దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా నీవు "సుగ్రీవుని"
వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.
సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు.
మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.
ఆంజనేయుడు శ్రీరాముని బంటుగా ,నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని
,నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర ,నవ్యవ్యాకరణ పండితుడుగా ,బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం.
పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.
కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు ,సీతాన్వేషణలో సఫలీకృతుడై,
రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుట ,
హనుమంతుని యొక్క స్వామిభక్తి, తో , శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు.
యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
శ్రీ ఆంజనేయస్వామివారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.