Monday 25 April 2016

" ద్వారకా తిరుమల "

         
                       
                                                                 " ద్వారకా తిరుమల "

కలియుగ ప్రత్యక్ష దైవం " శ్రీ వేంకటేశ్వర స్వామి " వారు కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలలో,
 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న " ద్వారకా తిరుమల " ప్రసిద్ధమైనది. దివ్య ఋషులచే
ప్రతిష్ఠ చేయబడిన క్షేత్రాలను ఆర్ష క్షేత్రాలు అని అంటారు.

స్వయంగా దైవం ఆవిష్కృతం అయితే స్వయం వ్యక్త క్షేత్రం అని అంటారు.
ఈ నేపదంలో ద్వారకా తిరుమల స్వయం వ్యక్త ఆర్ష క్షేత్రం…

శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువుతీరి భక్తులకు కోరిన కోర్కెలు సిద్ధింప చేయుచున్నారు. తిరుమల తిరుపతి లో స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కులు, అక్కడికి వెళ్ళలేని వారు, ఈ సన్నిధానం లో చిల్లించు కొన్నా సరే ఫలము వస్తుంది అని భక్తుల విశ్వాసం. అందువలన ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు.

సుదర్శన క్షేత్రము అయిన ద్వారకా తిరుమల భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతోంది .

అత్యంత పురాతనమైన ఈ క్షేత్రము గురించి పలు పురాణ గాధలలో కూడా చెప్పబడినది.

ఈ క్షేత్రము శ్రీ రామ చంద్రుడి తండ్రి దశరధుని కాలం నాటిదని అంటారు. ద్వారకుడు అనే మహర్షి స్వామివారి పాద సేవకై ఉత్తరాభిముఖం గా కూర్చుని తపస్సు చేయగా , ద్వారకునికి స్వామి దక్షిణ ముఖం గా ప్రత్యక్షమై సేవ చేసుకొనే భాగ్యం కల్పించారుట. అందుకనే ఆలయ మూల విరాట్ దక్షిణ ముఖం గా కొలువు తీరి ఉంటుంది.

దక్షిణ భారత దేశంలోనే దక్షిణ దిశగా గర్భాలయ ముఖ ద్వారం కలిగిన ఏకైక దేవాలయం "ద్వారకా తిరుమల."

తరువాత శ్రీ రామానుజాచార్యులవారు ఈ క్షేత్రమును దర్శించి స్వామివారి పాదపూజ కూడా చేసుకొనే భాగ్యం కలిగించడానికి , స్వయం వ్యక్త ధ్రువ మూర్తి కి వెనుక వైపు,
పీఠము పై భాగమున, మరొక నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేసారని ప్రతీతి .

స్వయంభువు గా వెలిసిన స్వామి వారి అర్థభాగాన్ని కొలిచే భక్తులకు , మోక్ష సిద్ధి అని, ఆ తరువాత ప్రతిష్ఠ చేసిన ప్రతిమను కొలవడము వలన ధర్మార్ధ , కామ , పురుషార్ధాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

గర్భ గుడిలో స్వయంభూ వేంకటేశ్వరస్వామికి కుడి వైపు అర్థ మంటపం లో తూర్పు ముఖముగ మంగతాయారు, ఆండాల్ అమ్మవారులు కొలువై వున్నారు.

ఆలయ సాంప్రదాయము ప్రకారం ప్రతియేటా రెండు సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. వైఖానస ఆగమ పద్ధతిలో వైశాఖ మరియు ఆశ్వీయుజ మాసాలలో కన్నుల పండగగా, అత్యంత వైభవం గా జరుపుతారు. భూమూర్తి,వైశాఖ మాసం లో దర్శనము ఇచ్చారని , సంపూర్ణ విగ్రహమును ఆశ్వీయుజ మాసం లో ప్రతిష్టించారని ఈ రెండు మాసాలలో కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారని చెపుతారు.

ప్రతి శుక్ర, శని వారాలలో , ఏకాదశి, పౌర్ణమి,అమావాస్య తిథులలో , పునర్వసు నక్షత్రం రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారులకు విశేష కుంకుమ పూజలు చేస్తారు. ఈకోవెలలో మరొక విశేషము ఏమిటంటే, గర్భాలయంలో వున్న మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించరు. మంత్రం స్నానం, జల సంప్రోక్షణలు మాత్రమే నిర్వహిస్తారు. అభిషేకం చేస్తే ఎంతో ఆశ్చర్య కరంగా, ఆ పరిసరాల్లో ఎప్పుడూ చూడని కొణుజులు అనే జాతి చీమలు కుప్పలు తెప్పలుగా వచ్చి చెరుతాయట.

ద్వారకా తిరుమల గ్రామానికి పశ్చిమాన స్వామి వారి పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి ని సుదర్శన పుష్కరిణి అని , నరసింహ సాగరమని, కుమార తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే రెండు స్నాన ఘట్టాలు ఉన్నాయి . ప్రతి యేట ఇక్కడ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం నిర్వహిస్తారు.