Friday, 15 April 2016

" శ్రీ రామ తీర్థం "

                                                      " శ్రీ రామ తీర్థం "

పచ్చని పొలాలు, ప్రకృతి  అందాలు, కనువిందైన కొండలు, అత్యంత ప్రశాంతంగా వుండే వాతావరణం లో  అలరారుతున్న పుణ్య క్షేత్రం  " శ్రీ రామ తీర్థం " 

విజయనగరం నుండి  12 కిలోమీటర్ల దూరం లో వున్న  దివ్య క్షేత్రం  రామ తీర్ధం.ఆ స్వామి విగ్రహాలు తీర్థం లో (నీటిలో )  దొరికినందున  ఈ ప్రాంతానికి రామ తీర్థం అని పేరు వచ్చింది.

500 సంవత్సరాల క్రితం  ఈ కోవెలను నిర్మించారు.  , సీతమ్మతల్లి , లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుని విగ్రహ మూర్తులు ఎంతో శోభాయమానంగా సమ్మొహనమైన , ఆ విగ్రహాలను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టించి పాండవులకు ఇచ్చారనీ , వారు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతం లో  కొన్నాళ్ళు వుండి ఆ  విగ్రహాలకు నిత్యం పూజాదికాలు నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది .

ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు  కూడా ఇక్కడకు  వచ్చి రాముల వారిని దర్శించుకున్నట్లు చెబుతారు .నేటికీ  వైఖానస ఆగమం ప్రకారం పూజలు చెయ్యడం ఆనవాయితీ , ప్రతిరోజూ లోకకళ్యానార్థమ్ హోమం చేయడం ఇక్కడి ప్రత్యేకత  ,

మాఘ శుద్ధ ఏకాదశి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వరకు వార్షిక కళ్యానొత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు,

శ్రీరామ నవమి నాడు  అత్యంత వైభవంగా  కళ్యాణం దాదాపు లక్ష మంది భక్తులు శ్రీ సీతారామ కళ్యాణం  కనులార చూచేందుకు వస్తారు. .

కోవెల ప్రాంగణములో ఊర్ధ్వ పుండ్రము లతో   (తిరు నామములతో )  ఎన్నో  తాబేళ్లు  మనకు  దర్శనమిస్తాయి.

శ్రీ రాముల వారి కోవెల ప్రక్కనే వున్న శివాలయము , శ్రీరాముని వారి లానే ఆ పరమ శివుడు కూడా నిత్యం  పూజలు అందుకుంటున్నారు.  ఇక్కడ శైవ పర్వదినాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తిక మాసంలో , శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ దినములలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా వుంటుంది.

  కోవెలకు  దగ్గరలో  వున్న బోధి కొండ పైన సుమారు  వేయి  సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక చిన్న  శిధిల  ఆలయం వుంది. శ్రీ రాముల వారి పాద ముద్రలు , చిన్న నీటి కొలను వున్నాయి.  త్రేతాయుగంలో  శ్రీరాముల  వారి  వనవాస  సమయంలో  రాములవారు సీతా లక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో  సంచరించార నీ , ఆ సమయంలో సీతమ్మతల్లి కి దాహం వేస్తె, శ్రీ రాములవారు బాణం  వేసి పాతాళ గంగను రప్పించారని ,ఎంత వేసవి అయినా  ఆ కొలను ఎండక  పోవడం  ఆ శ్రీరామ చంద్రు ని మహిమ అని ఆ ప్రాంతం వారు ప్రగాఢముగా నమ్ముతారు.

ఆ ప్రాంతం లో జైనులు,  బౌద్ధులు  కూడా సంచరించారని, అక్కడున్న కొన్ని జైన,  బౌద్ధ  ఆలయ శిధిలాలె వాటికి ఆధారము .ఇంత ప్రాశస్త్యం  వున్న  దివ్య క్షేత్రం అయిన రామ తీర్థాన్ని దర్శించుకున్న జన్మ ధన్యం .