Wednesday 27 April 2016

తమలపాకు ఔషధం

             
                       
                                                          తమలపాకు ఔషధం

భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు తాంబూలం
లేని భోజనం ఉండేది కాదు. షడ్రసోపేతమైన భోజనానికి ఘుమ ఘుమ లాడే తాంబూలం
కొసమెరుపు.భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే , పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు, సోంపు ధట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్యజీవితంలో భాగం చేశారు మన పెద్దలు.

1. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

2. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి.

3. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.

4. ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.

5. ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే
     బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

6. ప్రతి రోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

7. స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

 8. తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.

9. చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.

10. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.

11. చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

12. తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.

13. పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

14. తమలపాకును తింటే  అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది. తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.

 15. తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.

16. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

17. తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.

18. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.