Saturday, 16 April 2016

“దేశ భాష లందు తెలుగు లెస్స”

   
                                                                                                                                           
                                                      " దేశభాష లందు తెలుగు లెస్స”

కమ్మనైనది తెలుగు,
అమ్మవంటిది తెలుగు

జున్నుపాలు మన తెలుగు,
వెన్నపూస మన తెలుగు

తియ్యనైనది తెలుగు,
తేనెలూరు మన తెలుగు

వెండి వెన్నెల మన తెలుగు,
విరి తేనెల తెలుగు

విరబూసిన విరులు తెలుగు,
మంచు పూల జిలిగు ,తెలుగు

రమ్యమైనది తెలుగు,
 రాగమాలిక తెలుగు

పాలసముద్రం చిలకగ వచ్చిన అమృత కలశము మన తెలుగు

తెలుగు భాష మృదువుగా , సరళముగా ఉండే భాష . “దేశ భాష లందు తెలుగు లెస్స” అని శ్రీ కృష్ణ దేవరాయులవారు అన్నారు. పురావస్తు శాఖవారు తెలిపినదాన్ని బట్టి, తెలుగు భాష 2500 సంవత్సరాలకు పూర్వం నుండి వున్న అతి ప్రాచీన మైన భాష . తెలుగుని ప్రపంచ వ్యప్తముగా 7 కోట్ల 90 లక్షల మంది ప్రజలు మాట్లాడతారు అని అంచనా . ప్రపంచములో అత్యధికముగా మాట్లాడే భాషలలో తెలుగు 15 వ
స్థానములోనూ,మరియ, మన దేశములో రెండవ స్థానములోనూ ఉన్నది.
వేద వ్యాసుల వారు రచించిన “మహా భారతము ” లో ఆంధ్రుల శబ్దము మనకు కనిపిస్తుంది. ఆంధ్రా, తెలుగు పదాలు ఒక దానికి ఒకటి పర్యాయ పదాలు. తెలుగుని మొదట తెనుగు అని పిలిచేవారుట. ఆంధ్ర అనే పదము కీ .పూ . 600 సం” లో ఒక జాతిని ఉద్దేశించి వాడబడినది అని చెపుతారు . తేనే అంటే దక్షిణము అని, దక్షిణ భారత దేశములో నివసించు ప్రజలు కనుక, తెలుగు ప్రజలు అని పిలిచేవారని ఒక వాదన.
కీ.పూ.7 వ శతాబ్దమునకు ముందే ఉన్న అచ్చ తెలుగు గ్రంధాలు కూడా లభ్యమవుతున్నాయి . నన్నయ గారి కాలము నుండి ఇంకా ఎక్కువ గా లభిస్తూవచ్చాయి . తెలుగు భాష శాతవాహనుల కాలము నుండి ఉన్నా ,ఇక్ష్వాకుల కాలములో బాగా అభివృద్ధి చెందినది అని చరిత్ర కధనము. చాళుక్యుల కాలమునాటి తెలుగు శాసనాలు కూడా లభ్యము అయ్యాయి.
నన్నయ 11 వ శతాబ్దములో పశ్చిమ గోదావరి జిల్లా , తణుకులో జన్మించారు. పంచమ వేదము ఐయిన మహాభారతములో ఆది ,సభా పర్వాలను, అరణ్య పర్వములో కొంత భాగమును ఆంధ్రీకరించారు. మిగిలిన భాగమును తిక్కన , ఎర్రన పూర్తి చేసారు. నన్నయ్య “ఆంధ్ర శబ్ద చింతామణి”లో తెలుగు వ్యాకరణం రచించినన్దుకుగాను, వారిని “వాగన శాసనుడు” అని అభివర్ణించారు. ఎర్రన, సంస్కృత గ్రంధాలైన హరి వంశము, రామాయణములను తెలుగులోకి అనువదించారు. బమ్మెర పోతన, భాగవతమును తెలుగులోకి అనువదించారు. దానికి “ఆంధ్ర మహా భాగవతము ” అని పేరు పెట్టారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకులు శ్రీకృష్ణ దేవరాయలు కూడా “ఆముక్త మాల్యద ” గ్రంధమును తెలుగులో రచించారు. C.P. బ్రౌన్ తెలుగు భాష పట్ల మక్కువతో నేర్చు కుని , ఒక నిఘంటువుని రాసి తన అభిమానాన్ని చాటు కున్నారు. బెంజిమేన్ షల్గ్ అనే పోర్చుగీసు మెషినరీ కూడా బైబుల్ ను తెలుగులోకి అనువదించారు.
తెలుగు భాష లిపి
తెలుగు దేవనాగరి లిపి. తెలంగా , తెలింగా, తిలాంగ్ , అనేవి తెలుగు లిపికి ఉన్న పేర్లు. తెలుగు వారు రాసే లిపిని ఆంధ్ర లిపి అంటారు. ప్రస్తుతము మనము తెలంగాణా అని పిలిచే పేరు కూడా తెలంగా అనే లిపి నుంచి వచ్చినదేనట. నన్నయ గారి కాలములో వేంగీ , చాళుక్య లిపి లో మార్పులు ప్రారంభము అయి కన్నడ , తెలుగు లిపిలు గా విడిపోయి ఆ తరువాత మనము రాసే తెలుగు లిపి గా మారిపాయింది అని అంటారు. కాలక్రమేనా తెలుగు భాషలో ఎన్నో మార్పులు వచ్చాయి. పూర్వం, ప్రధమా విభక్తి అయిన “డు,ము,ఉ,లు ” మన భాషలో ప్రస్పుటంగా వినిపించేవి. ఇప్పుడు వాడే “ము” అనే పదానికి “బు” అని వాడేవారు. పాత రోజుల్లో పామును “నాగబు” అనేవారు. తరవాత అది “నాగము” గ మారింది. ఈ పదం సంస్కృత భాషలో “నగ ” అనే పదము నుండి వచ్చినది. ఆ పదానికి పాము, ఏనుగు అని రెండు అర్థములున్నవి. తెలుగు అక్షరం “గ”, కన్నడ “ಗ” బర్మా “ చూసేందుకు ఒక్కలాగే వుంటాయి.
సాహిత్య పరముగా తెలుగు భాష లో ఎన్నో అద్భుత రచనలు వున్నాయి. వేమన గారి పద్యాలు , సుమతీ శతకము, దాశరధి శతకము , భతృహరి సుభాషితాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి . మన తెలుగు భాష ఖ్యాతి ని ఏంతో ఎత్తుకు తీసుకువెళ్ళిన మహా కవులు ఎందరో. నన్నయ, తిక్కన , ఎర్రన , తెనాలి రామకృష్ణ, శ్రీ నాధుడు, పోతన, యోగి వేమన, నందితిమ్మన, మొదలగు వారు తెలుగు సాహిత్యములో కృషి చేసి చరిత్రలో బంగారు పుటలు సృష్టించారు.
ఆధునిక కాలములో విశ్వనాధ సత్యనారాయణ గారు, తిరుపతి వెంకట కవులు, శ్రీ రంగం శ్రీనివాస రావు గారు, దాశరధి గారు, తెలుగు సాహిత్యములో చేసిన కృషి శ్లాఘనీయము. విశ్వనాధ సత్యనారాయణ గారికి తెలుగు అంటే మక్కువ ఎక్కువ. ఆయన తెలుగు భాష కు చేసిన కృషి ఎన లేనిది. ఆయనకు తెలుగు సాహిత్యములో మొదటి జ్ఞాన పిఠ అవార్డు “శ్రీమద్రామాయణ కల్ప వృక్షము” నకు వచ్చినది. మరెందరో మహాను భావులు, వాగ్గేయ కారులు, తెలుగు భాషకు చేసిన పద సేవ యేన లేనిది. సాహిత్య చరిత్రలో తెలుగు భాషకు ఉన్నతమైన విలువను ఏర్పరచి , ప్రంపచవ్యాప్తముగా తెలుగు భాష గొప్పదనమును చాటి చెప్పిన మహానుభావులందరికీ వందనము అభివందనము.

మనకు తెలియని ఇంకొన్ని విషయాలు:
మయాన్మార్లో తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతాలు చాల వున్నాయి. అక్కడి యాంగాన్ అనే వూరిలో “వేమన లైబ్రరీ వుంది”. మౌమీన్ అనే వూరిలో ఒక వీధి పేరు ” మల్లె పూల దిబ్బ”. 1960 వరకు ఇక్కడ పాఠ శాలల్లో తెలుగు భోదించేవారు. 1948 లో బర్మా రాజ్యాంగం రాసినది కూడా ఒక తెలుగు సంతతికి చెందిన వ్యక్తే. పురాతన కాలంలో తూర్పు మయాన్మార్లో తైలాంగ్ అనే జాతి వారి పూర్వీకులు కృష్ణ, గోదావరి మధ్య ప్రాంతంలో ఉండేవారని, అక్కడనుంచే వారు వలస వెళ్ళారని, అందువలన వారు తెలుగు మాట్లాడేవారని తెలుస్తోంది. మారిషస్ లో టి.వి.లలో , రేడియో లలో తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలో ఎప్పటినుంచో తెలుగువారు నివసిస్తున్నారు.

ఇంతటి ప్రాచీనమైన, సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన తెలుగు భాషలో మాట్లాడుకుందాం… తేనెలొలికే తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం….