మహా కవి "శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి " గారు.
నంది వర్ధనాల పట్టు కొమ్మ మన మహా కవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సినీ నేపధ్యగీతాలలో తనదంటూ ప్రత్యేక శైలిని , స్థాయిని ఏర్పరుచుకుని తెలుగు వారు గర్వించదగ్గ ప్రపంచ స్థాయి మహా కవిగా సుస్థిర స్థాన్నాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ మహానుభావుడి గురించి కొన్నివిషయాలు ప్రస్తుతించడము అదృష్టము గా భావిస్తూ ....
విధాత తలపున ప్రభవించినది
అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన
ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన
విరించి విపంచి గానం
సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం .....
బ్రహ్మ యొక్క ఆలోచనలలో యెప్పుడో పుట్టిన సృష్టి కి మూలవేదం "ఓం ", అంటూ ఓంకారం చుట్టి ,
నా ఉచ్వాసము కవిత్యము , నా నిశ్వాసము పాట గా సినీ గేయ రచయిత గా , సాహితీ చరిత్రలో తనదంటూ ఓ బంగారు పేజి ని సృష్టించుకున్న, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పాదాభి వందనాలు చేస్తూ ..... శుభోదయం ,
కళాభ్యుదయ వాది కి అరుణోదయం,
ప్రభవించిన చాతుర్యానికి ప్రభోదయం ,
కలం పట్టి , పదాలు దున్ని, మీరు చేస్తున్న పదకవితా సేద్యము, కలలు కదిపి, కలం కదిపి , గీతాల నిండా పదాలు నింపి , సుస్వర , సుశబ్ద పదాల మాల నూర్చి , మీరు చేస్తున్న సాహితీ సాగర మధనం ,మధురామృత కావ్య జననం ....
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
అంటూనే తొలి "నంది " ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు.
మూడు వేలకు పైగా పాటలు , పది నంది అవార్డు లు, మూడు ఫిలిం ఫేర్ అవార్డు లు .
అత్యంత అద్భుతము గా రాయడమే కాకుండా , అత్యధిక పారితోషిక గౌరవాన్ని
దక్కించుకున్న ఘనత కూడా శాస్త్రి గారిదే. గర్వించ దగ్గ రచయితలలో " శ్రీ వేటూరి " గారు , "శ్రీ ఆత్రేయ " గారి తో సమానము గా రాయగల సామర్థ్యము గలవారని అభివర్ణిస్తూ ఉంటారు.
వర్ధమాన రచయితలు చంద్రబోస్ , అనంత శ్రీరాం ,రామజోగయ్య శాస్త్రి గార్లు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని గురువుగా భావించి గౌరవించుకుంటూ ఉంటారు.
తెలుగు సాహిత్య రంగము లో సిరివెన్నెల గారు చేస్తున్న కృషి ఎనలేనిది. ఆయన రచనలలో ఎక్కడా ద్వందార్ధాలు కనపడవు. అశ్లీలత ఆమడదూరం లో ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని, విలువలను, మన సంస్క్రుతి సాంప్రదాయాలను, స్థాయిని, ప్రతిబింబింప చేసేవిగా ఉంటాయి.
ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటల్లో :
"శాస్త్రి గారు పాట రాస్తే నిఘంటువు దగ్గరకు పరిగెత్తాలి" అంటారు
ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా ....
ఆ పాట విన్నంతనే "తెలుగు dictionary" ఒకటుంటుంది అని దాని పేరు "శబ్ద రత్నాకరము " అని తెలుసుకున్నాను అంటారు. ఒక పాటను అర్థము అయ్యేలా మాత్రమె కాదు అర్థము చేసుకోవాలి అనే కోరికను పుట్టించేదిగా కూడా రాయచ్చు అని, తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి శ్రీ సీతారామ శాస్త్రి గారు అని కొనియాడతారు.
రాత్రిళ్ళు టేబుల్ మిద ఆయన ఖర్చు చేసిన క్షణాలు, ఆయన ఖర్చు చేసిన జీవితం,
ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన నిద్రలేస్తాడు , అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.
ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని అక్షారాలు అనే తూటాలతో ప్రపంచం మీదకు వేటకు
బయలు దేరుతాడు. రండి, నాకు సమాధానం చెప్పండి, మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకు సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, మన ప్రక్కనే నిలుచుంటాడు, ఎప్పుడు ఒప్పుకోవద్దు "ఓటమి" ని అంటాడు. వచన కవిత్వానికి నోబుల్ స్థాయిలో రాయగల సామర్థ్యం ఉన్న కవి అంటారు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్.
వాడుక భాషలో , ఆధునిక పాశ్చాత్య పోకడలతో ప్రస్తుత పరిస్థితులలో గీతాలకు వ్యాపార పరము గా ప్రాధాన్యము ఉన్నా, తెలుగు భాష గొప్పదనము తెలుగు వారి , సంస్క్రుతి సాంప్రదాయాలు , సాహిత్య విలువలు కాపాడు కుంటూ వస్తున్న మార్గ దర్శకులు శ్రీ సీతారామ శాస్త్రి గారు.అంతే కాదు అవసరము అనుకుంటే ఆ పాట ను రాసే అవకాశాన్ని వదులుకుంటాను కానీ ,అలంటి పాటలు రాయను అని చెప్పేస్తారు. అంతటిసామర్థ్యము ఉన్న రచయిత.
ఆయన పాటలలో పద సామర్థ్యము మాత్రమే కాదు , పలు సామాజిక అంశాలను కూడా, సున్నితముగా సృసిస్తూ ఉంటారు. ఒక్కో సారి కవితా వెశము లో
" నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం "
"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా "
...అంటూ నిష్కర్ష గా విరుచుకు పడతారు . ఆయన రాసే ప్రతి పాట మార్గ దర్శకమె ,
ప్రతి మాట అముల్య మైనదే .
రుద్రవీణ అనే చిత్రము లో ఆయన రాసిన ఒకపాట గురించి విష్లెసిస్తూ, అడవి గాచిన వెన్నెల అనే పదాన్ని చాలాసార్లు వింటాము గాని వెన్నెలవృధా కావడము ఏమిటి, నాకు నచ్చ లేదు, అందుకే
"తరలి రాదా తనే వసంతము తన దరికి రాని వనాలకోసము " అంటూ
"వెన్నెల దీపముకొందరిదా , అడవికి సైతము వెలుగు కదా" అంటూ న్యాయము చేసాను అంటారు.
అంతే కాకుండా ఈ చిత్రము సామాజిక ఇతివృత్తము తో కూడినది .హీరో తండ్రి సంగీత
విద్వాంసుడు ,ఆయన పాటలు హరిజనులు కోసము పాడడము ఇష్టము ఉండదు. కానీ ఆయన కుమారుడికి ఇది ఇష్టము ఉండదు. అందరు సమానమే, మీ సంగీతము పండితులకు, పామరులకు కూడా ఒకే విధమైన ఆనందాన్ని ఇస్తుంది అని వాదిస్తూ ఉంటాడు. ఆ భావాన్ని అంతర్లీనంగా వచ్చే విధము గా "వెన్నెల దీపం కొందరిదా, అడవికి సైతము వెలుగుకద", రాసారు. విశిష్టమైన illustrated రచనా శైలి లో అందే వేసిన చేయి మన సీతారామ శాస్త్రి గారిది.
నంది అవార్డుల వివరాలు :
1986 సిరివెన్నెల " విధాత తలపుల "
1987 శృతిలయలు " తెలవారదేమో స్వామి "
1988 స్వర్ణ కమలం " అందేలా రవమిది "
1993 గాయం "సురాజ్యమనలేని "
1994 శుభలగ్నం " చిలకా ఆ తోడులేక "
1996 శ్రీకారం " మనసు కాస్త "
1997 సింధూరం " అర్థ శతాబ్దపు "
1999 ప్రేమకథ. " దేముడు కరుణించాడని "
2005 చక్రం. " జగమంత కుటుంబం నాదీ "
2008 గమ్యం. "ఎంత వరకో"
--Achanta.Goplakrishna