Monday, 25 April 2016

శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం , బిక్కవోలు


                               
                                                 శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం ,
                                                                        బిక్కవోలు

  విఘ్నాంత కారుడు, దేవతా సమారాధనలో అగ్ర పూజలు అందు కొంటూ,
 విఘ్నాలను తొలగిస్తూ, భక్తులకు కోరిన వరాలు ఇచ్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు
కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలలో ఒకటిఅయిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం ,
తూర్పు గోదావరిజిల్లా బిక్కవోలు లో ఉంది.

క్రీ. శ. 9వ శతాబ్దం లో తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలం లో ఈ క్షేత్రం రాజధాని. అత్యంత పురాతనమైన ఈ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం చాళుక్య రాజులు క్రీ. శ. 849 – క్రీ. శ. 892 మధ్యలో నిర్మించారని ఇక్కడ లభించిన శాసనాల ద్వారా అవగతమవుతోంది.

నవాబుల కాలం లో ఆలయాలు విఛిన్నమవడంతో ఈ ఆలయం భూమి లో ఉండిపోవడం జరిగింది.1960 వ దశకం లో ఒక భక్తుడి కలలో కనిపించి స్వామి వారే తమ ఉనికిని తెలిపారని, గ్రామస్థుల సహకారం తో ఆ ప్రదేశం లో త్రవ్వకాలు సాగించగా దక్షిణావృత తొండం తో వినాయకుడు బయల్పడ్డారని కధనం .

అననంతరం పందిరి వేసి భక్తులు పూజలు మొదలు పెట్టారు. విగ్రహం బైటపడిన తొలి నాళ్లలో చిన్నది గా
ఉన్నా తరువాత భారీ స్థాయికి ఎదిగింది అన్నది స్థానికుల కధనం.

శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి చెవి లో తమ కోర్కె చిపితే అది తప్పక నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం. వినాయక చవితి పండుగ అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఏటా మార్గశిర శుద్ద షష్టి నాడు సుబ్రహ్మణ్యే శ్వర స్వామి వారి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి.

ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిల్వాలతో పూజ, మూల మంత్ర జప తర్పణ హోమములు, సూర్యనమస్కారము, లింగార్చన, సుందరకాండ పారాయణ, వేద పారాయణ, నవగ్రహారాధన, గణపతి చతురా వృత తర్పణ, పదకుండు ద్రవ్యాలతో ఏకాదశ రుద్రం, అభిషేకం, గణపతి హోమం, రుద్ర హోమం, ఛండి హోమం చేస్తారు.

ఈ ప్రాంగణం లో ఇంకా రాజరాజేశ్వర, చంద్రశేఖర , గోలింగేశ్వర, ఆలయాల సముదాయం ఉంది. గోలింగేశ్వర ఆలయలంలో గోలింగేశ్వరుని తో పాటూ , పార్వతీదేవి, కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వీర భద్రుడు, నందీశ్వరుడు, ఇలా మొత్తం శైవ కుటుంబమే కొలువై ఉంది.