Saturday 30 April 2016

రాజమండ్రి పరిసర ప్రాంత " దేవాలయాలు "


  రాజమండ్రి పరిసర ప్రాంత " దేవాలయాలు "
               
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి తీరాన కొలువై వున్నది శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఆ పరమ శివుడు రాక్షస సంహారం చేస్తుండగా , కొన్ని స్వేద బిందువులు రాక్షసులపై పడి వారంతా లింగాలుగా మారగా , వారిని బ్రహ్మ విష్ణులు స్థాపించుకుంటూ వచ్చారని , ఆ క్రమం లో చివరిగా కాశీ నుంచి తెచ్చిన లింగమే ఈ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ గర్భాలయంలో కొలువు తీరిందని పురాణ కధనాలు చెప్తున్నాయి. కావున గోదావరిలో స్నానం ఆచరించి, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి కి అర్చన చేయిస్తే అత్యంత పుణ్యం , కోటిలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుందని శివ పురాణం లోచెప్పబడినది.

శ్రీ మార్కండేయ స్వామి ఆలయం :

రాజమండ్రి లో గోదావరి నదీ తీరాన తప్పక చూడవలసిన మరో ఆలయం శ్రీ మార్కండేయ స్వామి ఆలయం. రాజ రాజ నరేంద్రులు, చోళ రాజులు, రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసారు.సువిశాల ప్రదేశంలో ప్రధాన ఆలయం తో పాటు పలు ఉపాలయాలు కూడా ఇక్కడ వున్నాయి.

ఇస్కాన్ మందిరం :

రాజమండ్రి లో గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఇస్కాన్ మందిరం రెండు ఎకరాల విస్తీర్ణం
లో ఎంతో అద్భుతంగా నిర్మించబడినది. ఈ మందిరం చుట్టూ దశావతార మండపాలు కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఇస్కాన్ మందిరాలలో ఈ మందిరం మూడవ స్థానంలో వుంది.

శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం, ధవళేశ్వరం :

రాజమండ్రి నుండి కేవలం 8 కి.మీ. దూరంలో కొండ పైకొలువై వుంది శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయం. ఇది ఎంతో పురాతనమైన ఆలయం. కృత యుగ అవతారంగా బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిన స్వయంభూ ఈ జనార్ధన స్వామి. ఇక్కడి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి . వారి కోవెల కూడా ఈ ఆలయ ప్రాంగణంలో వుంది.

గోష్పాద క్షేత్రం, కొవ్వూరు :

రాజమండ్రి నుండి కేవలం 10కి.మీ. దూరంలో ఉన్న కొవ్వూరు లో , పావన గోదావరి నదీ తీరాన శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం వున్నది. ఇక్కడి వాతావరణం ఎంతో రమణీయంగా వుంటుంది. లక్ష గోవులు ఏక కాలంలో సంచరించిన అత్యంత పవిత్ర ప్రదేశం ఈ గోష్పాద క్షేత్రం. ఇక్కడ స్పటిక లింగే శ్వరాలయము మరో ప్రత్యేకత.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం , కోరుకొండ :

రాజమండ్రి నుండి 22కి.మీ. దూరంలో ఉన్న కోరుకొండ లో కొండ పైన మరియు కొండ కింద రెండు నరసింహ క్షేత్రాలు వున్నాయి . పరాశర మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష్య మైన స్వామి మహర్షి కోరిక మేరకు శ్రీ లక్ష్మి సమేత నృసింహ స్వామిగా ఇక్కడ వెలిసాడని పురాణ కధనం.

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, పట్టిసీమ :

రాజమండ్రి నుండి 40కి.మీ దూరంలో కొలువై వుంది శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. పవిత్ర గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై వున్నది ఈ దేవాలయం. ఇక్కడ వీరభద్రుడు లింగాకారంగా స్వయంభువై వెలిసాడు.

శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం, ర్యాలి :

రాజమండ్రి నుండి సుమారు 40కి.మీ దూరంలో ఉన్న ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామం లో కొలువై వుంది శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. దేశం లో నే ఏకైక శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం యిది. ఈ కోవెలను 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడి మూల విరాట్ విగ్రహం స్వయంభు అని పురాణ కధనాలు చెప్తున్నాయి.

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం , ద్రాక్షారామం :

రాజమండ్రి నుండి సుమారు 44కి.మీ ( ద్వారపూడి-యానం రోడ్డు) దూరం లో ఉన్న శివ క్షేత్రం ద్రాక్షారామం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం దక్షిణ కాశీ గా ప్రసిద్ది .
ఈ ఆలయ ప్రాంగణంలో మాణిక్యాంబ అమ్మవారు కొలువై వున్నారు. అష్టా దశ శక్తి పీఠాల్లో ఇది ద్వాదశ శక్తి పీఠమ్.

శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం, సామర్లకోట :

రాజమండ్రి నుండి సుమారు 50కి.మీ. దూరంలో ఉన్న సామర్లకోటలో వుంది శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని స్వయంగా కుమార స్వామి ప్రతిష్ట చేసారని పూర్వ కధనము .