Saturday, 23 April 2016

శ్రీకూర్మం


                                                   దేశంలో ఒకే ఒక కూర్మక్షేత్రం

భారతదేశం ఆధ్యాత్మికదేశం. ఎందరో ఋషి పుంగవుల, తపోధనుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశమిది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులకు పుట్టినిల్లిది. ఎన్నోన్నో ప్రత్యేక క్షేత్రాలు తమ తమ మహిమలతో ఈ భూమిపై వెలసి, ప్రతీ ఒక్కరిని ప్రభావితులను చేస్తూన్నాయి. తరింపజేస్తున్నాయి. అటువంటి మహత్తు కలిగిన క్షేత్రమే ఆంద్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ‘శ్రీకూర్మం’.

“కూర్మావతారం ఛ సంశ్రుతం పాపనాశనమ్” అని అగ్నిపురాణం (3-1) చెబుతోంది. అనగా, లోకహితం కోసం ఆ నారాయణుడు మత్స్యకూర్మాది అవతారాలను ధరించాడు. పురాణాలు చెబుతున్న కూర్మావతారం గురించి వింటే పాపాలు నశిస్తాయి. ఇహ…కళ్ళతో ప్రత్యక్షంగా ఆ మూర్తిని తిలకిస్తే ఇంకెంత ముక్తిదాయకమో కదా! విష్ణుమూర్తి సలహాపై దేవదానవులు పాలసముద్రములో, మందార పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని, మధిస్తున్న సమయంలో ప్రతీసారి పర్వతం సరిగ్గా నిలువకుండా కడలిలో పడిపోయేది. సంగతిని తెలుసుకున్న దేవతలు శ్రీహరిని ప్రార్థించగా, కూర్మావతారాన్ని ధరించి, తన సువిశాలమైన వీపుభాగాన మందార పర్వతాన్ని ధరించి (మద్య మానేతదా తస్మిన్ కూర్మరూపే జనార్థనః) కార్యం నిర్విఘ్నంగా ముగించేటట్లు చేసాడని భాగవతం చెబుతోంది. దశావతారాలలో రెండవ అవతారం శీకూర్మ అవతారం.

“యావద్భారతంలో కూర్మావతార క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకూర్మం,

శ్రీకూర్మవతారమైన విష్ణువుకు అంకితమైనందున శ్రీకూర్మంగా పిలువబడుతోంది.”

కాల నిర్ణయం
ఆలయస్థలపురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించాడనికి స్వామి ముందుగా ఇక్కడికి విచ్చేశాడట.అలాగే రోగి అస్తికలను ఇక్కడి శ్వేతపుష్కరిణిలో వేయగా, అందులో నీరు తాబేళ్ళుగా మారాయనీ, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్ళను టాక కూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి “కాలవివరాలు” అంత సమగ్రంగా లేవు. దాదాపు రెండవ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లుగా కొందరి చరిత్రకారుల అభిప్రాయం. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు, ఆలయ మండపంలోగల స్తంభాలపై లిఖించబడ్డాయి. చోళ చక్రవత్రుల కాలంలో ఈ వైభవం తారాస్థాయికి చేరినట్టుగా మరి కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాలనీ కూడా తూర్పు కళింగ, గంగుల పరిపాలలో ఉన్న అనంగభీముడు నిర్మించిన “తిరుచుట్టుమండపం” స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషలలోకనిపిస్తాయి. ఈ మండపంలో నిర్మించిన 71 నల్లరాతి స్తంభాలు గాంధార శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచలం “కప్పు స్తంభం” మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా “ఇచ్ఛాప్రాప్తిస్తంభం” ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్తంభాలపి కలంకారి రంగులతో చిత్రించిన చిత్రములు, శిల్పాలు వగైరా దేనికదే పోలికలు లేకుండా చిత్రించబడటం ఆనాటి కాల నైపుణ్యానికి ప్రతీక.

ఆలయం విశేషాలు
శ్వేతకీర్తి చక్రవర్తి నిమిన్చినట్లుగా చెప్పబడుతున్న ఈ ప్రాచీన దేవాలయం, భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. అపురూప శిల్పకళ సంపదతో, ప్రతికృతిలో సౌందర్యాలతో అలరారుతున్న ఇటువంటి దేవాలయమం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేవాలయ నిర్మాణము తూర్పు గంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తుంది. కృతయుగంలో వెలసిన ఆది కూర్మనాధుడే ఈ యుగంలో కూర్మనాధదేవునిగా ఇక్కడ వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలంలో మూలవిరాట్ గర్భాఆలయంలో ఒక ప్రక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్టించబడటం సహజం. కాని, ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా స్వామిముఖం, తోక భాగాన గల సుదర్శనశాలిగ్రామం తూర్పుకు అభిముఖంగా వెలయడంచేత దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి.

ఈ విధంగా మరే దేవాలయంలో కూడా లేకపోవడం ఒక విశేషం. ఆలయమ్లోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగమంటపం, భోగమంటపానికి ఇరు వైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి. భోగామంతాపం తర్వాత పుష్పాంజలిమంటపం, ఆస్థానమంటపం ఉన్నాయి. వీటిని బ్రహ్మదేవుడు నిర్మించాడని ప్రతీతి.

“శ్రీకూర్మనాథస్వామి స్వయంవ్యక్తమూర్తి అనీ, ఈ దేవుని కంఠంలో ఉన్న సాలగ్రామమాలికతో పాటూ శ్రీమహావిష్ణువు కూర్మాక్రుతి పొందాడని భక్తుల విశ్వాసం. స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలు తొలగి, పునర్జన్మ ఉండదని నమ్మకం! అలాగే ఈ క్షేత్రదర్శనంతో అమరావతి, కాశీ పుణ్య క్షేత్రాలకు యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది.”

ఆలయంలోకి ఈ దేవాలయాన్ని నారద, ఇంద్ర, బ్రహ్మాది దేవతలు తిలోత్తమవంటి అప్సరసలు, మునులు, కవులు దర్శించుకుని తరించారు. త్రిమతాచార్యులకు ఆరాధిం శ్రీకూర్మనాధస్వామి. అష్టపదులను రచించిన జయదేవుడు, చైతన్య ప్రభూ, శ్రీనరహరితీర్థులు, శ్రీనాధమహాకవి, శ్రీకృష్ణదేవరాయలువంటివారు స్వామిని దర్శించినట్టుగా చారిత్రిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవుడు, రక్షకుడుగా హనుమంతుడు, పరివార దేవతలుగా వైష్ణవీదుర్గా (జమ్మూకాశ్మీర్ ప్రాంత్రం లోగల వైష్ణోదేవీ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ ఆలయంలో ఉంది) నరసింహస్వామి, గణపతి, శివుడు, వేణుగోపాలస్వామిని బ్రహ్మ ప్రతిష్టించినట్లుగా బ్రహ్మాండపురాణ కథనం. ఈ క్షేత్రానికి పశ్చిమభాగంలో కాలభైరవుడు పూర్వభాగస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూరేశ్వరుడు, పశ్చిమభాగస్థితి హరుకేశ్వరస్వామి కొలువయి భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచాలింగారాధ్య క్షేత్రం. అంటే, ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నారు. వంశధార సాగరసంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురంకొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరానగల (శ్రీకాకుళపట్టణంలో) రుద్రకోటేశ్వరుడు, ఉత్తరాన “పిప్పల” (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండతీర్థంలో పాతాళసిద్దేశ్వరుడు ఉన్నారు. ఇక్కడున్న అష్ట తీర్థములలో స్నానం చేస్తే, సమస్తరోగాలు నశిస్తాయని బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలు తెలియజేస్తున్నాయి. నారదగుండం, సుధాగుండం, చక్రతీర్థం, మాధవతీర్థం, కౌటిల్యతీర్థం, వక్రతీర్థం, నరసింహపాతాళం, మహారథి అనే సముద్రం అష్టతీర్థాలుగా ఉంది భూలోక వైకుంఠంగా అలరారు తున్నది క్షేత్రం.
భారతదేశంలో శ్రీహరికూర్మరూపంలో స్థిరంగా ఉన్నాడని, ఆయన దక్షిణకుక్షిలో ఆంద్రరాష్ట్రంలో వెలసియున్నాడని మార్కండేయ పురాణం తెలియజేస్తోంది.కూర్మనాదుడ్ని శ్రీకాకుళంజిల్లాలోని శ్రీకూర్మంలో అర్చించడం ముక్తిదాయకమని పురాణాల ఉవాచ. అంతేకాక ఈ క్షేత్రదర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయని పద్మపురాణంలో 30 అధ్యాయాల్లో, బ్రహాండపురాణంలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. ఈ క్షేత్రదర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని పద్మపురాణం ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్తమి-పూర్ణిమ దాకా కల్యానోత్సవం జరుగుతుంది.