Saturday, 27 February 2016

శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై వున్న ఏడుకొండల పేర్లు


           
                                     శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై వున్న ఏడుకొండల పేర్లు

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువై వున్న సప్తగిరుల పుణ్య క్షేత్రము తిరుమల. నిత్యమూ స్వామి వారి నామ స్మరణతో పునీతమైన పవిత్ర ప్రదేశం తిరుమల. చూడ వేయి కన్నులు చాలని బ్రహ్మోత్సవం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడుకి బ్రహ్మోత్సవం అంటూ జరిగే ఉత్సవాలతో, ఊరేగింపులతో, ఆటపాటలతో, కోలాటాలతో, శ్రీ వారి స్తోత్రాలతో, భక్తి పాటలతో , కీర్తనలతో అలరారుతూ, ప్రతిరోజూ లక్షలాది భక్తులకు దర్శన భాగ్యమును ప్రసాదిస్తూ, కోట్లాది భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై వున్న ఇల వైకుంఠము తిరుమల, మన రాష్ట్రములో ఉండడము మన అదృష్టము, మహద్భాగ్యము.
దివ్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, భూతల స్వర్గము అయిన తిరుమల పుణ్య క్షేత్రము శేషాచల పర్వత ప్రాంతములో నిలయమై ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి వేంకటాద్రి శిఖరము పైన నిలయమై ఉన్నది. ఈ పర్వతశ్రేణులన్నీ శ్రీ మహా విష్ణువు యొక్క క్రీడా పర్వతాలు అనీ, వైకుంఠము నుండి వాటిని తెచ్చి స్వర్ణ ముఖి నదీ తీరంలో ప్రతిష్ట చేసారని, ఈ ఏడుకొండలపై వున్న ప్రతి శిలా చింతామణి అని, ప్రతీ చెట్టు, ప్రతీ తీగ మహర్షులని, ప్రతీ తీర్థము దేవ గంగా స్వరూపాలని శ్రీ వేంకటాచల మహత్యంలో చెప్పబడినది.
ఆ ఏడు కొండల స్వామి కొలువై వున్న ఏడుకొండల పేర్లు
వృషభాద్రి
అంజనాద్రి
నీలాద్రి
గరుడాద్రి
శేషాద్రి
నారాయణాద్రి
వేంకటాద్రి
వృషభాద్రి:
పూర్వం వృషభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆతడు ఓ విచిత్రమైన పద్ధతిలో తపస్సును ఆచరించేవాడు. తన శిరస్సును చేదించి దానితోపాటు ఓ పుష్పాన్ని స్వామివారికి అర్పించేవాడు . ఆ మహా విష్ణువు దయ వల్ల మళ్ళీ తన శిరస్సు మొండెము ఒకటయ్యేవి. వృషభాసురుడు మరణ సమయమున ఆ శ్రీ మహా విష్ణువుని తిరుమలలో ఒక పర్వతానికి తన పేరు పెట్టాలని కోరాడు. స్వామి వారు అందుకు అంగీకరించడం తో ఆ కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది అని చెబుతారు.
అంజనాద్రి:
అంజనాదేవి ఓ పర్వతం పై తపస్సు ఆచరించి, శివానుగ్రహం తో చిరంజీవి అయిన హనుమంతుడిని పుత్రుడిగా పొందినది. అందువల్లనే ఆమె తపస్సు చేసిన పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చినదని వేంకటాచల మహత్యం లో తెలుపబడినది.
నీలాద్రి:
ఒకనాడు శ్రీనివాసుని తలకు గాయమై కొంతమేర కురులను కోల్పోయారు. గాంధర్వ రాకుమారి అయిన నీలాదేవి తన కురులను తీసి శ్రీనివాసునికి అమరుస్తుంది. ఆ విధంగా స్వామి వారికి తొలి నీలాలు సమర్పించినది నీలాదేవి. అందుకు ఎంతో మెచ్చిన స్వామి వారు ఒక పర్వతానికి నీలాద్రి అని నామకరణం చేసారు అని చెబుతారు. నీలుడు అనే కపీశ్వరుడు తపస్సు చెయ్యడం వల్ల ఆ పర్వతానికి ఆ పేరు వచ్చింది అని మరొక పురాణం కధనం కూడా ఉన్నది.
గరుడాద్రి:
శ్రీ మహా విష్ణువు వరాహావతార ధారియై హిరణ్యాక్షుడిని వధించి భూదేవిని రక్షించారు. అంతట భూదేవి తన స్వామి అయిన శ్రీ మహా విష్ణువును తన తోనే వుండవలనని ప్రార్ధించినది. అందుకు శ్రీ మహా విష్ణువు గరుత్మoన్తుని తో స్వర్గం నుంచి ఒక అందమైన పర్వతాన్ని భువికి తెమ్మని ఆజ్ఞాపించారు. ఆ పర్వతం పేరే గరుడాద్రి అని చెబుతారు. వరాహ మూర్తిగా ఆ పర్వతం పై స్వామివారు సంచరిస్తూ వుంటారని భక్తుల నమ్మకం.
శేషాద్రి:
వేంకటాచల మహత్యం లో తెలుపబడిన ప్రకారం, ఆదిశేషుని అవతారమే శేషాద్రి పర్వతం. పూర్వం వాయువు మరియు ఆదిశేషుని మధ్య ఆధిపత్య పోరు నడిచినది. వారిరువురి మధ్య పోరు జరుగుతున్న సమయం లో నారదుడు తన వీణ పై శ్రావ్యమైన సంగీతం వాయిస్తాడు. ఆ సంగీతానికి ఆదిశేషుడు తన్మయత్వం చెంది పడగ విప్పి నాట్యం మొదలుపెడతాడు.ఆ సమయాన్ని అదునుగా చేసుకున్న వాయువు, తన శక్తి నంతా ఉపయొగించి ఆది శేషుడిని దూరంగా భూమి పైకి పడవేస్తాడు. పిదప తను చేసిన పనికి వాయువు బాగా చింతించి, శ్రీ మహా విష్ణువుకి శయన పాన్పు లేకుండా చేసానే అని బాధపడి, ఆది శేషుడిని తనను క్షమించి తిరిగి వైకుంఠానికి రమ్మని కోరగా , అందుకు శేషుడు ససేమిరా ఒప్పుకోడు. ఏది జరిగినా ఆ శ్రీ మహా విష్ణువు ఆజ్ఞ తోనే జరిగిందని , కావున తను వైకుంఠానికి తిరిగి రానని వెల్లడిస్తాడు. అందుకు ఆ శ్రీ మహా విష్ణువు కుడా అంగీకరించి, ఆది శేషుడు ఒక పర్వత రూపం దాల్చి, కలియుగాంతం వరకు భూమి మీదే శేషాద్రిగా భాసిల్లుతాడని సెలవిస్తారు.
నారాయణాద్రి:
నారాయణ రుషి గౌరవార్థం ఈ పర్వతానికి నారాయణాద్రి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ పర్వతం, దివ్యమైన జ్ఞానం ఇచ్చునది కాబట్టి జ్ఞానాద్రిఅని, కోరికలు తీర్చు కల్పతరువు కాబట్టి చింతామణి అని భక్తులు పిలుచుకుంటూ వుంటారు.
వేంకటాద్రి:
వేంకటాద్రినామములో “వేం ” అనగా పాపము, “కట” అనగా హరించు అని అర్ధము. పురాణ కధనం ప్రకారం, మాధవ అను ఒక కుష్టురోగి తిరుమల యాత్రతో తన రోగము నుంచి విముక్తి పొందాడు. కొండ మీదకు ఎక్కుతూ భక్తులు చేసే గోవింద నామ స్మరణతో ఎంతో సాంత్వన పొందుతాడు . పిదప బ్రహ్మదేవుడు మాధవునికి సాక్షాత్కరించి ఈ విధంగా చెప్పారు,”నీ కారణం గా భక్తులకు ఓ విషయం తెలిసినది. ఎవరైతే భక్తితో ఈ కొండపై కాలు పెడతారో వాళ్ళ పాపాలన్నీ హరించుకుపోతాయి . అందుకే ఈ పర్వతానికి వేంకటాద్రి అని నామకరణం చేస్తున్నాను” అని సెలవిచ్చారు.
కామ, క్రోధ ,లోభ, మోహ ,మద మాశ్చర్యా లనే ఆరు కొండలను దాటి ఏడవ కొండపై విజయమైవున్న శ్రీ సప్తాద్రీశుడిని దర్శించుకుని మోక్షం పొందడం అనేది పురాణాల్లో చెప్పబడిన పరమార్ధం. కావున భక్తులందరూ ఆ సప్తగిరీశుడిని దర్శించుకోండి మోక్షాన్ని పొందండి.
తిరుపతి నుండి తిరుమలకు కాలినడకన రెండు మార్గాలు ఉన్నాయి. అవి
1. అలిపిరి మెట్టు: ఇది తిరుమల పర్వత ప్రాంతము వద్ద వున్నది.
2. శ్రీవారి మెట్టు: ఇది తిరుపతి లో శ్రీనివాస మంగాపురం వద్ద వున్నది.
ఇదే కాక తిరుపతి నుండి తిరుమలకు బస్సు సౌకర్యం కుడా ఉంది.అది తిరుమల తిరుపతి దేవస్థానం వారి పర్యవేక్షణ లో నడుపబడుచున్నది.