Monday 29 February 2016

శ్రీ వినాయక షోడశ నామాల  స్తోత్రము.

                         
                                                   శ్రీ వినాయక షోడశ నామాల  స్తోత్రము

"  సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
 లంబోదరశ్చ
వికటో విఘ్నరాజో గణాధిపః
 ధూమ్ర కేతుః
గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 
వక్రతుండ
శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే “

 ఏ పూజకు అయినా , ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆచరించేది శ్రీ వినాయక పూజ. ఆ గణ నాధుడుకు పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. వినాయకుడు కూడా  పదహారు గుణాలు కలిగిన స్వామి కనుక ఆ స్వామిని  షోడశ నామాల  స్తోత్రముతో  పూజ ప్రారంభిస్తారు.

ఆ షోడశ నామాల  వెనుక వున్న కధలను కొందరు పూజ్య ఆధ్యాత్మిక గురువుల  ఇలా  వివరించారు…
సుముఖ
వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి,
ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని  చేతి లోనే మరణించాలని  వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము  తొలగించి గజముఖముతో ప్రాణ  ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట. లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక  సుముఖము అన్నారు.
ఏ ముఖము  ప్రసన్నముగా, సంతోషముగా,
లోక హితము  కోరుతుందో,  ప్రేమగా  ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున
ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.

లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో  స్థిర నివాసము ఉంటుంది.

1. ఏనుగు కుంభ  స్థలములో
2. ఆవు వెనుక  తట్టులో
3. తామర పువ్వులో
4. బిల్వ దళములో
5. పాపిట బొట్టు పెట్టుకునే స్థలములో  ఉంటారని అంటారు.

చిదంబరములోను, తిరుచ్చిలోను నర వినాయక విగ్రహాలు ఉన్నాయి. కానీ, జాగ్రత్తగా  పరిశీలిస్తేగాని గుర్తుపట్టడము కష్టము. ఎందుకంటే ఆయన నరముఖముతోఉంటారు కనుక , మనకి గజముఖము మాత్రమే తెలుసు కనుక.
ఏకదంత
వినాయకుని కి కుడి వైపు దంతము ఉండదు. అందుకే “ఏక దంత” అంటారు. వ్యాసమహా భారత రచన చేసేటప్పుడు ఎక్కడా ఆగకుండా , వేగముగా అర్థము చేసుకుంటూ రాయాలి. అందుచే వినాయకుడు తన కుడి దంతమును ఉపయోగించి రాశారుట. ఇది ఇలా ఉండగా , గజాసురుడిని తన  కుడి దంతమును ప్రయోగించి సంహరించారని , కనుక  ఏక దంతుడు అనియు ఇంకొక కధనము.
కపిల
గజ ముఖాసురుడిని  వధించినప్పుడు ఆయన ముఖముపై పడిన ఎర్రటి నెత్తురు, ఆయన తెల్లదనముతో కలిసి కపిల వర్ణ ములో కనిపించారుట అందు వలన  స్వామిని “కపిల”  అని అంటారు.
గజ కర్ణ
కప్ప బడని చెవులు ఉన్నవాడు వినాయకుడు. ఏ దేవతా స్వరూపానికైనా చెవులు కప్పబడి ఉంటాయి , ఒక్క  వినాయకుడికి మాత్రమే పెద్ద చెవులు ఉంటాయి . మన  విన్నపాలను విని కోరికలు త్వరగా సిద్ధింప చేస్తారు కనుక “గజ కర్ణ” అని అంటారు.
లంబోదర
వృత్తాకారములో వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు లంబోదరుడు. మొదకులు, ఉండ్రాళ్ళుఆయనకు ప్రీతి. దేవతలు అందరు ప్రసాదాలను చూసి పవిత్రతను ఆస్వాదిస్తారు. కానీ ఒక్క వినాయకుడు మాత్రము స్వీకరించి చేతిలో  పెట్టుకుంటారు. మోదకము మధ్య లో తీపి ఉంటుంది. అలాగే తమ భక్తుల మీద వున్న అమ్మ మనసు లాంటి తియ్య నైన అపారమైన ప్రేమను ఆయన కడుపులో ఉంచుకొంటారు కనుక “లంబోదర” అని అంటారు.
వికట
హాస్య స్ఫూ రకముగా  ఉండే పనులు చేస్తారు కనుక వికట అని అంటారు. భక్తుల  మీద  కోపము పెట్టుకోకుండా,  చేసిన దోషానికి శిక్షించి , వెంటనే అనుగ్రహించేస్తారు స్వామి. కర్మ ఫలితముగా ఏదైనా ఆపదలో వుంటే, ఆయన కాళ్ళుకు మొక్కితే చాలు ఆ ప్రభావాన్ని తొలగించేస్తారు , శాశ్వత సుఖాన్ని ఇస్తారు.
రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకు వస్తున్నప్పుడు సంధ్యా వందనము  ఆచరించుటకు సమయం అవుతుంది. లింగమును భూమిపై పెట్టవలదు.  కనుక, ఎవరైనా పట్టుకుని ఉండేందుకు వున్నారా అని ఎదురు చూస్తున్నప్పుడు, వినాయకుడు బాలుడి రూపములో వచ్చిమూడు సారులు  పిలుస్తాను రాకపొతే కింద పెట్టేస్తాను అని అంటాడు. అందుకు  అంగీకరించిన రావణాసురుడు ఆత్మ లింగాన్ని  ఇచ్చి వెళతాడు. అప్పుడు  వినాయకుడు వెనువెంటనె  మూడు సార్లు  పిలిచి  కింద పెట్టేసారుట. అదే  గోకర్ణ క్షేత్రముగా  ప్రసిద్ధి చెందినది. దానినే భుకైలాసము అని  కూడా అంటారు. ఇలా విఘ్నేశ్వర స్వామి లోక కళ్యాణము కోసము చేసే పనులు కూడా హాస్యముగా ఉంటాయి.
విఘ్నరాజు, వినాయకుడు
ఒకే ప్రాంగణములో ఇద్దరు వినాయకులు వుంటే  ఒకరు విఘ్న కారకుడు, ఒకరు విఘ్న నాశకుడు అంటారు. చెడ్డపనులు చేసేవారికి ఆ పనులు జరుగకుండా  విఘ్నాలను కల్పించే  వారు , ఒక పని మీదకు వెళుతున్నప్పుడు  అక్కడ ఏదైనా ఆపద ఉన్నప్పుడు , అక్కడికి వెళ్ళకుండా విఘ్నమును కల్పించి రక్షించేవారు విఘ్నరాజు. ఏ మంచి కార్యక్రమముకైనా విఘ్నాలు జరుగకుండా చూసేవారు వినాయకుడు.
” ఆత్మ లింగము ” విషయములో రావణాసురుడికి, “రంగనాధ  స్వామి ” విగ్రహము విషయములో విభీషుణుడికి  విఘ్నాలు కలిగించి , శివ కేశవులను మన దేశము లోనే ఉండేటట్టుగా చేసి, వారిని పూజించుకునే మహా భాగ్యాన్ని  ప్రసాదించారు. ఇప్పుడు ఆ రెండు క్షేత్రాలు “గోకర్ణ  క్షేత్రము”,  “రంగనాధ క్షేత్రము ” గా విరాజిల్లుతున్నాయి.
ధూమ్రకేతు
ధూమాసురుడు అనే రాక్షసుడు విష వాయువులను ప్రయోగించినప్పుడు, ఆ వాయువులను తిరిగి  అతని మీదే ప్రయోగించి సంహరించి నందున  “ధూమ్రకేతు” అని  అంటారు.
గణాధ్యక్ష
గణాలకు అధిపతి అయినందున “గణాధ్యక్ష” అని అంటారు.
ఫాల చంద్ర
చంద్రునికి  షోడశ  గుణాలు ఉన్నాయి. అలాగ  వినాయకుడు కూడా షోడశ గుణాలతో, శివుని శిరము నందు ఉన్న చంద్రుని వంటి స్వరూపము కలవారు కనుక  “ఫాల చంద్ర” అని అంటారు.
గజానన
ఏనుగు ముఖము కలవాడు, సులభుడు, మ్రొక్కిన వెంటనే వరాలు ఇచ్చు వాడు అయినందున “గజానన” అంటారు.
వక్ర తుండ
తొండము కుడి ప్రక్కకు తిరిగి ప్రణవాకృతిని  కలిగిన వాడు కనుక “వక్రతుండ” అని అంటారు
శూర్పకర్ణ
చేటలంత పెద్ద చెవులున్నవాడు, కోరిన  కోరికలలో చెడుని చాటలా ఏరి వేసి మంచిని  మాత్రమే అనుగ్రహిస్తారు. కనుక “శూర్పకర్ణ” అని అంటారు .
హేరంభ
పంచాస్యము (సింహము / పంచాస్యుడు, పంచముఖములు కలవాడు శివుడు ) చేత పూజింపబడినవాడు. పరమ శివుడు త్రిపురాసుర సంహారానికి వెళ్ళే ముందు గణపతిని పూజించుట మర్చిపోయరుట. అప్పుడు విఘ్నాలు ఎదురైతే, వెంటనే వినాయక పూజ చేసి యుద్ధము లో విజయము పొందారుట. అలా పంచాస్యముచే పూజించబడిన వారు కనుక “హేరంభ” అనియు అంటారు.
స్కంద పూర్వజ
స్కందుడు( కుమార స్వామి ) ఉన్నతిని చూసినవారు, తమ్ముడి ఉన్నతికి కారణము అయిన వారు కనుక “స్కంద పూర్వజ” అని అంటారు. అలా  పిలిస్తే కుమార స్వామి కూడా సంతోషిస్తారుట.
విద్యారంభములోను , గృహ ప్రవేశము నందు, వివాహము నందు విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నాలు లేకుండా ఉంటాయి. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చే వినాయక చవితి పూజను ఆచరించడము వలన గణేశుడు ఎంతో ప్రీతి చెంది , భక్తులకు నీలాపనిందలు, విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారు. కావున వినాయక చవితినాడు  షోడశోపచార పూజ, అంగపుజ, 21 పత్రములతో ఏక వింశతి పత్రపూజ, అష్టోత్తర పూజ  చేసి, వ్రత కధ విని స్వామి వారి కటాక్షాన్ని పొందండి. స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకులు మొదలగునవి నైవేద్యము పెట్టి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి.
                             జై గణేశ జై జై గణేశా!!!