Wednesday 3 February 2016

ఆంజనేయ స్వామి నవావతారాలు


 ఆంజనేయ స్వామి నవావతారాలు
                                 
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు –

శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని మాట ఇచ్చిన తర్వాత శని ని వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.
స్వామి వారికి ప్రీతి పాత్రమైనవి
తమలపాకుల దండ:
రామాయణ కాలం లో రావణాసురుడు సీతా దేవిని అపహరించి లంక లో అశొక వనం లో ఉంచుతాడు. అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి అక్కడ ఉన్న తమల పాకు చెట్టు నుండి కొన్ని తమల పాకు తీగలను దండ గా చేసి ఆంజనేయ స్వామి కి ఇచ్చారట. శ్రీ రామ బంటు అయిన హనుమంతుడు తల్లి సీతమ్మ ఇచ్చిన తమల పాకు దండను చూసి ఎంతో ఆనందపడ్డారట. అప్పటి నుండి స్వామి వారికి తమలపాకులు అంటే అంత ప్రీతి. అందుకే ఆ తల్లి గుర్తుగా ఇచ్చిన తమల పాకులను భక్తులు సమర్పిస్తే ఆ స్వామి సంతతిస్తాడని ప్రతీతి.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
పంచముఖ హనుమాన్ వివరాలు
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.
1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావాలను, శరీరానికి కలిగే విష ప్రభావాలనుండి రక్షిస్తాడు.
3 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
4 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.