Wednesday, 9 March 2016

" సరస్వతి శ్లోకము "

                                                     సరస్వతి శ్లోకము

శ్లో|| సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి I
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా II

పదవిభజన :-

సరస్వతి , నమః , తుభ్యం ,వరదే , కామ రూపిణి , విద్యారంభం , కరిష్యామి , సిద్ధిః , భవతు , మే , సదా.

ప్రతిపదార్ధం:-
వరదే = కోరిన వరములను తీర్చుదానా,
కామరూపిణి = కోరిన ఆకారమును ధరింపగలదానా,
సరస్వతి = ఓ సరస్వతీ దేవి,
తుభ్యం = నీ కొరకు ,
నమః = నమస్కారము ,
విద్యా = చదువు యొక్క ,
ఆరంభం = ప్రారంభమును ,
కరిష్యామి = చేయబోవుచుంటిని ,
మే = నాకు ,
సదా = ఎల్లప్పుడునూ ,
సిద్ధిః = కార్య సిద్ధి ( సానుకూలత ),
భవతు = చేకూరుగాక
( చేకూరవలయును ).

తాత్పర్యము :-
కోరిన వరములను తీర్చుదానా, కోరిన ఆకారమును ధరింపగలదానా, ఓ సరస్వతీ దేవి! నీ కొరకు నమస్కారము. చదువు యొక్క ప్రారంభమునుచేయబోవుచుంటిని. నాకు ఎల్లప్పుడునూ కార్య సిద్ధి చేకూరుగాక .

వివరణ :-
* కోరిన కోరికలు తీర్చుదానావు , కోరిన రూపము ధరించుదానవు అయిన సరస్వతీ దేవీ నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభించుచున్నాను . నాకు ఎల్లపుడూ చదువుకుంటున్న (లేదా) నేర్చుకుంటున్న విద్య సిద్ధించుగాక ( బాగా వచ్చుగాక ).
* విద్య అనేక రూపములలో వుంటుంది .( చదువు,కళలు,ఆట పాటలు ....మొII వి ). అన్నీ ఆ సరస్వతి దేవి యొక్క రూపములే . అందుకే ఆమె " కామరూపిణి " అయినది . అలాగే ఎవరు ఏ విద్యను కోరి ప్రార్థిస్తే ( అభ్యసిస్తే ) వారికి ఆ విద్యను ప్రసాదిస్తుంది. అందుకే ఆమెను " వరదే" అని పిలుస్తాము.

* " సరస్వతి రహస్యోపనిషత్ " నుండి ఒక ముఖ్యమైన శ్లోకము :-

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసినీ I
త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే II

ఈ శ్లోకమును విద్యార్థులు నిత్యము ప్రార్థించినా అర్థించిన విద్య సిద్ధించును .