Thursday 5 January 2017

యజ్ఞోపవీత విశిష్టత


యజ్ఞోపవీత విశిష్టత

యజ్ఞోపవీతం అనేది వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ పరిచయమే. దీనినే జందెం అని, బ్రహ్మసూత్రం అని కూడా పిలుస్తారు.

ఈ యజ్ఞోపవీతాన్ని

“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్|
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||”

అనే మంత్రాన్ని చదువుతూ ధరించాలి.

ఈ మంత్రం ప్రకారం పరమపవిత్రమైన యజ్ఞోపవీతం ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టినట్లు తెలుస్తోంది. యజ్ఞోపవీతం నవ తంతువుల (తొమ్మిది దారపుపోగుల) తో నిర్మించబడుతుంది. వీటిలో ఒక్కో తంతువుకీ ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు.
వారు
1. ఓంకారం 2. అగ్నిదేవుడు 3. నాగదేవత 4. సోమదేవత 5. పితృదేవతలు 6. బ్రహ్మదేవుడు 7. వాయుదేవుడు 8. సూర్యుడు 9. మిగిలిన దేవతలందరూ ఉంటారు.

ఈ యజ్ఞోపవీతం అనేది కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదు. అది 15 తిథులకు, 7వారాలకు, 27 నక్షత్రాలకు, 25 తత్వాలకు, చతుర్వేదాలకు, త్రిగుణాలకు, త్రికాలాలకు, 12 మాసాలకు అనగా మొత్తం 96 విషయాలకు ప్రతీక. దీనివలన యజ్ఞోపవీతం ధరించిన వ్యక్తికి సకల తిథులలోను, వారాలలోను, నక్షత్రాలలోను, తత్వాలలోను, వేదాలలోను, గుణాలలోను, కాలాలలోను, మాసాలలోను పవిత్రత ఏర్పడి, ఇవన్నీ ఆ వ్యక్తికి శుభఫలాలను కలిగిస్తాయి. అందువలననే యజ్ఞోపవీతం 96 కొలతలతో ఉండాలని “వసిష్ఠ స్మృతి” తెలియజేస్తోంది.


అలాగే “చతుర్వేదేషు గాయత్రీ చతుర్వింశతికాక్షరీ  తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్” అనే ప్రమాణం ప్రకారం
 గాయత్రీ మంత్రంలో ఉండే అక్షరాల సంఖ్య 24 ను, వేదాల సంఖ్య 4 తో గుణిస్తే వచ్చే సంఖ్యతో అనగా 24 x 4 = 96 తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించి ధరించాలి.

యజ్ఞోపవీత పరిమాణం:

సాముద్రిక శాస్త్రప్రకారం యజ్ఞోపవీతం అది ధరించిన వ్యక్తి యొక్క నడుము వరకు వ్రేలాడుతుండాలి. అంతకంటే చిన్నగా ఉంటే ఆయుష్షు తగ్గిపోతుంది, పొడవు ఉంటే చేసిన జపం/తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది, మరీ సన్నగా
ఉంటే ధననష్టం.

పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడరాదు. దానికి ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం వలన సమస్త పాపాలు చుట్టుకుంటాయి.
మన శరీరంలోని ప్రాణనాడులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో,
యజ్ఞోపవీతంలోని తంతువులను కూడా అంత జాగ్రత్తగానూ రక్షించుకోవాలి.

యజ్ఞోపవీతం జీర్ణమయిపోయినపుడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి, జీర్ణమయిపోయిన యజ్ఞోపవీతాన్ని తొలగించాలి. అలాగే ఆప్తుల జనన, మరణాల వలన అశౌచం కలిగినప్పుడు, ఇతర అమంగళాలు కలిగినప్పుడు, గ్రహణముల తరువాత విధిగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి.

పాత యజ్ఞోపవీతాన్ని తొలగించేటప్పుడు:

“ఉపవీతం చిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే|
యజ్ఞోపవీతం హత జీర్ణవంతం వేదాంత వేద్యం
పరబ్రహ్మ రూపం జీర్ణోపవేతం విశృజస్తు తేజః||”

అనే మంత్రాన్ని చదవాలి. మంత్రం చదువుకండా యజ్ఞోపవీతం ధరించుట కాని, విసర్జించుట కాని పనికిరావు.

యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ,
ధరించిన వ్యక్తి దానికి తగిన ధర్మాలను ఆచరించాలి.