Thursday 19 January 2017

షోడశోపచారాలు



షోడశోపచారాలు
మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం.
అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు

పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు

1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం
7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం
13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం
1. ఆవాహనం:
భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము
2. ధ్యానం:
భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి.
3. ఆసనం:
రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం.
4. పాద్యం:
పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు.
5. అర్ఘ్యం:
చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అందించడాన్ని అర్ఘ్యం అంటారు.
6. అభిషేకం:
స్నానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం (తేనె, ఆవు పాలు, ఆవు నెయ్య, పెరుగు, పంచదార) స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏడు పదార్ధాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు.
7. వస్త్రం:
అభిషేకం పూర్తి అయ్యాక దేవునికి సమర్పించే వస్త్రాలను వస్త్రం సమర్పయామి అని అందిస్తారు.
8. యజ్ఞోపవీతం:
భుజం  పై నుంచి వేసుకోవడానికి యజ్ఞోపవీతం సమర్పించడం.
9. గంధం:
దేవునికి గంధం, అక్షతలు మరియు పుష్పాలు సమర్పించడం.
10. అధాంగ పూజ”
దేవునికి వారి అన్ని శరీర అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అధాంగ పూజ అంటారు.
11. ధూపం:
దేవునికి అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం
12. దీపం:
దీపాన్ని వెలిగించి దేవుని ముందుంచి ధ్యాన నిమగ్నులమై పూజించడం.
13. నైవేద్యం:
భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాసక్తులతో భగవంతునికి ఆరగించడానికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు. ఆ భగవానుడే మనకి ఇచ్చిన జీవితానికి, ఆనందాలకు, సుఖశాంతులకు, మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇదొక అవకాశం.
14. తాంబూలం:
మనం భక్తి తో సమర్పించిన భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి, తాంబూలం సమర్పించడం. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతుంది.
15. నీరాజనం:
దేవునికి కర్పూరంతో హారతి వెలిగించి, దిష్టి తీసి, మంగళం పాడి, మనం కళ్ళకి అద్దుకోవడం.
16. మంత్రపుష్పం:
మన మనస్సునే ఒక పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించడానికి మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు.
ఇన్ని సేవలూ పూర్తి అయ్యాక, చేసిన పూజలో గాని, చదివిన మంత్రాలలో గాని తప్పులున్న మన్నించమని, ఉచ్చారణ దోషాలున్నా, భక్తి లో ఎటువంటి లోపము ఉండదని అపరాధ క్షమాపణ చెప్పుకుని దేవుని సాగనంపుతారు.
వెళ్లేముందు “పునరాగమనాయచ” అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ పంపుతారు.
ఇవి మనం నిత్యం దేవునికి సమర్పించే షోడశోపచారాలు(సేవలు).