Saturday 28 October 2017

కార్తీక స్నానం

కార్తీక స్నానం
 
కార్తీక మాసంలో నదీస్నానం తప్పనిసరిగా చేయాలన్నారు పెద్దలు. నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి దూరంలో ఉన్న మరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. ఎందుకంటే- మన పక్కన ఏ నది ప్రవహిస్తుందో ఆ నది మనకు అన్నం పెడుతుంది. ఆ నది వలన మన ధర్మం నిలబడుతుంది.
 కార్తీక మాసంలో చేసే నదీ స్నానం మనుషుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కార్తీక మాసంలో చంద్రుడి తేజస్సు దేదీప్యమానంగా ఉంటుంది. చంద్రుడి కిరణాల వల్ల నీటికి ప్రత్యేకమైన శక్తి కలుగుతుంది. అలాంటి నీటిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడు సార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృతస్పర్శ కలుగుతుంది. అంతే కాకుండా మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనయందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమైనిలబడుతుంది.
ఆ సమయంలో సంకల్పం కూడా చెప్పాలి. ఈ సంకల్పంలో ఏ ప్రాంతంలో ఉండి పూజ చేస్తున్నామో ఆ వివరాలన్నీ ఉంటాయి. ‘
 ఆ   సంకల్పం పలికించేటప్పుడు శ్రీశైలం పేరు చెబుతారు. శ్రీశైలస్య.....
...ఏ దిగ్భాగంలో ఉన్నారో ఆ ప్రాంతం గురించి చెప్పిస్తారు.
ఆ తర్వాత ఏ నదుల మధ్య ఉన్నామో
- ఆ ప్రాంతాన్ని చెప్పిస్తారు.
మనం గంగా గోదావరిల మధ్య ఉంటే- ‘గంగా గోదావరీ యోః మధ్య ప్రదేశే’ అని చెబుతారు. ఈ నదులను తలుచుకొని వాటిని ప్రార్థించటం వల్ల మన పాపాలు తొలగిపోతాయి.  స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత పుణ్యకార్యాచరణ చేయాలి.  ఎంతో కొంత దానం చేయాలి. అప్పుడే నదీస్నానం పూర్తయినట్లు అని చెపుతారు.