Sunday 29 October 2017

బిల్వపత్రం శివార్పణమ్


బిల్వపత్రం శివార్పణమ్

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,
శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం,
కోటి కన్యాదానాలు చేసిన ఫలం.
ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి..

బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,
“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “

అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు. “పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.
బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును.
తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును.
దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!
బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును.

బిల్వాష్టకం:
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

ఫలశృతి :
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్  ||