హయగ్రీవ స్తోత్రం
ॐ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం !
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే !!
జ్ఞానంతో వున్న కారణంగా నానందంగా కనిపించేవాడూ,
స్ఫటికంలా నిష్కల్మషుడూ, సర్వవిద్యల కాధారభూతుడైన,
" హయగ్రీవుణ్ని" వుపాసిస్తున్నాను అని ఒక ప్రార్థనా శ్లోకభావం.
చిన్ముద్ర, పుస్తకం, శంఖుచక్రాలు ధరించిన నాలుగు చేతులతో పద్మంమీద
ఆసీనుడై, ఆర్ద్రమైన అమృత కాంతులతో పావనం చేస్తున్న వాగధీశుడు
హయగ్రీవుడు నా మనసునందు ఆవిర్భవించుగాక అని మరొక ప్రార్థన ఉంది.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో 'హయగ్రీవ'
అవతారం ఒకటి. శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవోత్పత్తి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.
స్కంద పురాణం, దేవీభాగవతం, భాగవతాలు హయగ్రీవ జననం, ఉపాసనా విధానాలను వర్ణించాయి.విష్ణుమూర్తి దానవులతో యుద్ధంచేసి అలసిపోయి
వింటినారిని తలకింద పెట్టుకుని నిద్రపోయాడు. దేవతలు విష్ణువు కోసం
వెతుకుతూ వెళ్లి, నిద్రపోతున్న ఆయనను చూశారు. ఎవరికి వారు ఆయనను నిద్ర లేపడానికి వెనకాడుతున్నప్పుడు, శివుడు 'వింటినారిని తెంచితే విష్ణువు తల కదిలి మెలకువ వస్తుంది'అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ ఈ పని కోసం 'వమ్రి' అనే కీటకాన్ని నియోగిస్తే అది ధనుస్సు నారిని కొరికివేసింది. ఎక్కుపెట్టిన ధనుస్సు వల్ల
విష్ణువు తల తెగి ఎగిరిపడింది. ఈ విషయంలో విష్ణువుకు లక్ష్మీదేవి శాపం కూడా
ఉంది. దుఃఖిస్తున్న దేవతలతో బ్రహ్మ 'దేవి'ని స్తుతించమన్నాడు. దేవతల ప్రార్థనకు ప్రసన్నురాలైన 'దేవి' హయం (గుర్రం) తల తెచ్చి విష్ణువు దేహానికి అతికించమని చెప్పింది. దేవతలు ఆ విధంగా చేయడం వల్ల హయగ్రీవుడు ఉదయించాడని దేవీ భాగవతం పేర్కొంటోంది.
బ్రహ్మ సృష్టిరచనకు ముందు వేదాలను సృజించాడు. వాటిని మధుకైటభులనే రాక్షసులు అపహరించి రసాతలంలో దాచారు. అప్పుడు విష్ణువు హయశిరం ధరించి రసాతలానికి వెళ్లి భూనభోంతరాళాలు దద్దరిల్లేలా ప్రణవరూపమైన నాదం చేశాడు. మధుకైటభులు ఆ నాదం వెలువడిన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో,
విష్ణువు వేరొక మార్గంలో వెళ్లి వేదాలను తీసుకువచ్చి బ్రహ్మకు అప్పగించాడు. ఆ తరవాత మధుకైటభులను సంహరించాడు. ఇది స్కందపురాణ గాథ.
హయగ్రీవుడనే రాక్షసుడు తనకు మృతి లేకుండా చేయమని దేవిని ప్రార్థిస్తే, ఆమె అది అసంభవమని చెప్పడంవల్ల తనవంటి ఆకారం గలవాడి చేతిలోనే మరణం సంభవించాలని కోరుకున్నాడు. ఈ రాక్షసుని సంహారం కోసమే హరి హయగ్రీవుడయ్యాడని మరొక గాథ చెబుతోంది.
వేదోద్ధరణ గావించిన హయగ్రీవుని సకల విద్యాప్రదాతగా భావిస్తారు. హయగ్రీవారాధన వల్ల లౌకిక విద్యలు మొదలు బ్రహ్మవిద్యల వరకు సకలమూ సిద్ధిస్తాయని నమ్మకం. వాక్‌శక్తిని, విద్యాశక్తిని, బుద్ధిని కలిగించేవాడిగా హయగ్రీవుణ్ని ఆరాధిస్తారు.
ఆదిశంకరులు, రామానుజులు హయగ్రీవుని పూజించి జ్ఞానసిద్ధి పొందారు. ఒకప్పుడు శ్రీపాద రాజతీర్థులు రాజాస్థానంలో పండితులతో జరిగిన వాదనలో గెలవడంతో వారు మంత్రాలతో ఆయనకు వాగ్బంధనం చేశారట. హయగ్రీవోపాసకుడైన ఆయన ఉపాసన
శక్తి వల్ల అందులో నుంచి విముక్తి పొందినట్లు కథ వ్యాప్తిలో ఉంది.
నారదుడు, సూర్యాది దేవతలు కూడా హయగ్రీవుని ఉపాసించినట్లు హయగ్రీవోపనిషత్తు చెబుతోంది. జగన్మాత లలితాదేవి వైభవాన్ని, ఉపాసన రహస్యాలను, లలితా సహస్రనామ, త్రిశతి మొదలైన విద్యలను హయగ్రీవుడే అగస్త్యమహర్షికి బోధించినట్లు బ్రహ్మపురాణం పేర్కొన్నది. మంత్రతంత్ర యంత్రాది విద్యలకు అధిదైవం హయగ్రీవుడు. శ్రీరంగం, కంచి క్షేత్రాల్లో హయగ్రీవాలయాలు ఉన్నాయి.
సోదరీసోదర అనుబంధానికి, స్నేహబంధానికి గుర్తుగా భావించే శ్రావణ పూర్ణిమ
(రాఖీ పండుగ)నాడే స్వామిని ఆరాధిస్తారు.ఉడకబెట్టిన గుగ్గిళ్ళు, ఉలవలు నివేదిస్తారు. విద్యార్థులు స్వామిని పూజించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు.