Sunday 17 January 2016

DEVALAYAM...శ్రీముఖ లింగం


శ్రీముఖ లింగం

ముఖలింగం, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది ముఖలింగేశ్వరస్వామి ఆలయం. దాన్నే మధుకేశ్వరాలయం అని కూడా అంటారు.

ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై "ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు.

ఈ ఆలయంలో గర్బాలయం కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. సప్తమాతృకలలో ఒకరైన 'వారాహి' అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్న పార్వతీ అవతారం. మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు.

ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.

మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.