అధ తృతీయో అధ్యాయః- కర్మ యోగహా
అర్జున ఉవాచ
1 . అర్జునుడు పలికెను - ఓ జనార్దనా ! కేశవా ! నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్ఠమైనచో , భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు .
2 . కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు . కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెల్పుము .
శ్రీ భగవాన్ ఉవాచ
3 . శ్రీ భగవానుడు పలికెను- ఓ అనఘా ! ఓ అర్జునా ! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా , యోగులకు కర్మ యోగము ద్వారా నిష్ఠ కలుగును .
4 . మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు . అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్య నిష్ఠను అతడు పొందజాలడు.
5 . ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము గూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు . ఏలనన మనుష్యులందరును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు భాధ్యులగుదురు . ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును .
6 . బలవంతముగా , బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి , మానసికముగా ఇంద్రియ విషయములను చింతించు నట్టి మూఢుని మిధ్యాచారి అనగా దంభి అని యందురు .
7 . కానీ , అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగచరణమును కావించు పురుషుడు. శ్రేష్ఠుడు .
8 . నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము . ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము . కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము గూడ సాధ్యము కాదు .
9 . ఓ అర్జునా ! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు . కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్ధమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము
10 . కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగ ప్రజలను సృష్టించి , " మీరు ఈ యజ్ఞముల. ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెల నెల్ల తీర్చును ."అని పల్కెను.
11 ." ఈ .యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తి పరచుడు. మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు . నిస్వార్ధ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు " అని పల్కెను.
12 . యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు ( మానవులకు ) అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు . ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే .
13 . యజ్ఞశిష్టాన్నమును తిని శ్రేష్ఠపురుషులు అన్ని పాపములనుండి ముక్తులయ్యెదరు . తమ శరీర పోషణకొరకే ఆహారమును సిద్ధపరచు ( వండు ) కొను పాపులు పాపమునే భుజింతురు.
14 , 15 . ప్రాణులన్నియు అన్నము ( ఆహారము ) నుండి జన్మించును . అన్న ఉత్పత్తి వర్షము వలన ఏర్పడును . యజ్ఞముల వలన వర్షములు కురియును . విహిత కర్మలు యజ్ఞములకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము . అందువలన సర్వవ్యాపియు , అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు .
16 . ఓ అర్జునా ! ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు , అనగా తన కర్తవ్యములను పాటింపక , ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి . అట్టివాని యొక్క జీవితము వ్యర్ధము,.
17 . సచ్చిదానందమను పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని ఐన పరమాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును . అతడు పూర్ణకాముడు . కనుక ఆత్మ యందే తృప్తి నొందును,. అతడు ఆత్మ యందే నిత్య సంతుష్టుడు . అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు .
18 అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన , చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు .అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థ పరమైన సంబంధము ఏ విధముగను ఏ మాత్రము ఉండదు.
19 . అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము . ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును .
20 . జనకుడు మొదలగు జ్ఞానులు గూడ ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి . కావున నీవును. లోకహితార్ధమై కర్మలను ఆచరించుటయే సముచితము .
21 . శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ( ప్రవర్తననే ) ఇతరులును అనుసరింతురు . అతడు నిల్పిన ( ప్రతిష్టించిన ) ప్రమాణములనే లోకులందరు పాటించెదరు .
22 . ఓ అర్జునా ! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు . అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను. నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను .
23 . ( ఏలనన ) ఓ పార్ధా ! ఎప్పుడైనను నేను సావధానుడనై. కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు. గొప్ప హాని సంభవించును . ఎందుకనగా మనుష్యులందరును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు .
24 . నేను కర్మలను. ఆచరించుట మానినచో ఈ లోకములన్నియు. నశించును . అంతే గాదు, లోకములందు అల్లకల్లోలములను ( సాంకర్యములు ) చెలరేగును . ప్రజానష్టము వాటిల్లును . అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను .
25 . ఓ భారతా ( అర్జునా) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటినే ఆచరించినట్లుగా విద్వంసుడు ( జ్ఞాని ) కూడా లోకహితార్ధమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను .
26 . పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత,కర్మలను ఆసక్తితో ( ఫలాసక్తితో ) ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు . అనగా కర్మలయందు వారికి అశ్రద్ధ ను కలిగింపరాదు . పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో. గూడ అట్లే. చేయింపవలెను .
27 . వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును . అహంకార విమూదాత్ముడు ( అహంకారముచే మోహితమైన అంతః కరణము గల అజ్ఞాని ) ' ఈ కర్మలకు నేనే కర్తను ' అని భావించును.
28 . కాని, ఓ మహాబాహూ ! ( అర్జునా) గుణవిభాగ తత్వమును , కర్మ విభాగ తత్వమును తెలిసి కొన్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి , వాటి యందు. ఆసక్తుడు కాడు.
29 .ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును , కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు . అట్టి మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు ( ఊగిసలాటకు ) గురి చేయరాదు. .
30 . అంతర్యామిని , పరమాత్మను అయిన నా యందే నీ చిత్తమును ఉంచి , కర్మలనన్నింటినీ నాకే అర్పించి , ఆశా మమతా సంతాపములను వీడి , యుద్ధము. చేయుము .
31 . దోష దృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు .
H౩౨ కానీ నా యందు దోషారోపణ చేయుచు , నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై ( విపరీత జ్ఞానోపహతులై ) భ్రష్టులై , కష్టనష్టములు పాలయ్యెదరని ఎఱుంగుము.
33 . సమస్త ప్రాణులును తమ తమ ప్రకృతులను అనుసరించి ( స్వభావములకు లోబడి ) కర్మలు చేయుచుండును . జ్ఞానియు తన ప్రకృతిని ( స్వభావమును ) అనుసరించియే క్రియలను ఆచరించును . ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింప గలరు .
34 . ప్రతి ఇంద్రియార్ధమునందును ( ప్రతి ఇంద్రియ విషయము నందును ) రాగ ద్వేషములు దాగియున్నవి . మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు . ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు , మహా శత్రువులు .
35 .పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా. సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము . స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరమే . పరాధర్మాచరణము భయావహం .
అర్జున ఉవాచ
36 .అర్జునుడు పలికెను ! ఓ కృష్ణా ! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను. చేయుచుండును ?
శ్రీ భగవాన్ ఉవాచ
37 . శ్రీ భగవానుడు పలికెను -- రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము .ఇది క్రోధరూపమును దాల్చును . ఇది మహాశనము . భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము . కనుక ఈ విషయమున దీనిని పరామశత్రువుగా ఎరుంగుము .
38 . పొగచే అగ్నియు , ధూళిచే అద్దము , మావి చే గర్భము కప్పివేయబడునట్లు , జ్ఞానము , కామము చే ఆవృతమై ఉండును.
39 . ఓ అర్జునా ! కామము అగ్నితో సమానమైనది . ( అగ్ని వంటిది ) . అది ఎన్నటికిని చల్లారదు . జ్ఞానులకు అది నిత్యవైరి . అది మనుష్యుని విజ్ఞామును కప్పివేయుచుండును .
40 . ఇంద్రియములు , మనసు , బుద్ధి ఇవి కామమునకు. నివాసస్థానములు . ఇది( ఈ కామము) మనోబుద్ధిఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి , జీవాత్మను మోహితునిగా చేయును .
41 . కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము . పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహా పాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులు నొడ్డి రూపుమాపుము
42 . స్థూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, అని పేర్కొందురు . ఇంద్రియముల కంటెను మనసు , దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి . ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది , సూక్ష్మమైనది ఆత్మ.
43 . ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మపరమైనదని అనగా సూక్ష్మము , బలీయము , మిక్కిలి శ్రేష్ఠము అయినదని తెలిసి కొని ఓ మాహాబాహూ! బుద్ధి ద్వారా మనసునువశపరుచుకొని , దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము .
ఓమ్ తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే ,
శ్రీ కృష్ణార్జున సంవాదే కర్మ యోగో నామ తృతీయో అధ్యాయః