Friday, 26 June 2020

అమ్మలగన్నయమ్మ


" అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ "

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం.


*అమ్మలగన్నయమ్మ* అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు?

మనకి లలితాసహస్రం *శ్రీమాతా* అనే నామంతో ప్రారంభమవుతుంది. 'శ్రీమాతా’ అంటే 'శ’కార 'ర’కార 'ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికీ అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ అంటే 'లలితాపరాభట్టారికా స్వరూపం’ ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు అందుకని 'అమ్మలగన్నయమ్మ’ 'ముగ్గురమ్మల మూలపుటమ్మ’ ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 'చాల పెద్దమ్మ’ ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం.
ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది.

అలా ఉండడం అనేదే మాతృత్వం.
ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు.
అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

'తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

*బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మహేంద్ర, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి*

మనకి సంప్రదాయంలో 'అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. *బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి*.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని 'అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

'రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’.

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక ఆవిడ లలితా పరాభట్టారిక ఆ అమ్మ మాయమ్మ.

'మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.
అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. *ఓం ఐం హ్రీం శ్రీ క్లీం సౌః* ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము 'ఓం’, కవిత్వమునకు బీజాక్షరము 'ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము 'హ్రీం', ఆ తర్వాత్ సంపదల్ లక్ష్మీదేవి 'శ్రీం’.

ఇపుడు *'ఓం ఐం హ్రీం శ్రీం’* అమ్మలగన్నయమ్మ *'శ్రీమాత్రేనమః’*.

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో *'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’* *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః* అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు *'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’* అనలేకపోవచ్చు.

కానీ 'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ' అనడానికి కష్టం ఏమిటి ?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.
ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ....

సేకరణ

Friday, 12 June 2020

భగవద్గీత తృతీయోధ్యాయః- కర్మ యోగహా


ఓం  శ్రీ పరమాత్మనే నమః
అధ తృతీయో అధ్యాయః- కర్మ యోగహా
అర్జున  ఉవాచ
1 . అర్జునుడు పలికెను - ఓ జనార్దనా ! కేశవా !  నీ  అభిప్రాయమును బట్టి  కర్మ కంటెను జ్ఞానమే  శ్రేష్ఠమైనచో , భయంకరమైన ఈ  యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు .

2 . కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు . కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా  తెల్పుము .

శ్రీ భగవాన్ ఉవాచ

3 . శ్రీ భగవానుడు పలికెను- ఓ అనఘా ! ఓ అర్జునా ! ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకుముందే చెప్పియుంటిని . వానిలో సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా , యోగులకు కర్మ యోగము ద్వారా నిష్ఠ కలుగును .

4 . మనుష్యుడు  కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము  అనగా యోగనిష్టా సిద్ధి  అతనికి  లభింపదు . అట్లే కేవలము కర్మలను త్యజించినంత  మాత్రమున సిద్ధిని  అనగా సాంఖ్య నిష్ఠను అతడు పొందజాలడు.

5 . ఏ  మనుష్యుడైనను ఏ కాలమునందైనను  క్షణమాత్రము గూడ  కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు  తావులేదు . ఏలనన మనుష్యులందరును  ప్రకృతిజనితములైన  గుణములకు  లోబడి  కర్మలను చేయుటకు భాధ్యులగుదురు . ప్రతి  వ్యక్తియు  కర్మను ఆచరింపవలసియే యుండును .

6 . బలవంతముగా , బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను  నిగ్రహించి , మానసికముగా ఇంద్రియ విషయములను చింతించు నట్టి మూఢుని మిధ్యాచారి  అనగా దంభి అని యందురు .

7 . కానీ , అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని , అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా  కర్మయోగచరణమును  కావించు  పురుషుడు. శ్రేష్ఠుడు .

8 . నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము . ఏలనన కర్మలను చేయకుండుట  కంటెను చేయుటయే ఉత్తమము . కర్మలను ఆచరింపనిచో  నీ శరీర నిర్వహణము గూడ సాధ్యము కాదు .

9 . ఓ  అర్జునా ! యజ్ఞార్ధము  చేయబడు  కర్మలలో గాక ఇతర  కర్మలయందు నిమగ్నులగుటవలన  మనుష్యులు  కర్మ బంధములలో    చిక్కుపడుదురు . కనుక నీవు ఆసక్తి  రహితుడవై  యజ్ఞార్ధమే  కర్తవ్య కర్మలను  చక్కగా ఆచరింపుము

10 . కల్పాదియందు  బ్రహ్మదేవుడు  యజ్ఞ సహితముగ ప్రజలను సృష్టించి , " మీరు ఈ  యజ్ఞముల.  ద్వారా    వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె  కోరిన కోర్కెల నెల్ల తీర్చును ."అని పల్కెను.

11 ." ఈ .యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తి పరచుడు.  మరియు ఆ దేవతలు  మిమ్ములను  అనుగ్రహింతురు . నిస్వార్ధ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు  పరమశ్రేయస్సును పొందగలరు "  అని పల్కెను.

12 . యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు ( మానవులకు ) అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు . ఈ విధముగ దేవతలచే అనుగ్రహింపబడిన  ఈ భోగములను ఆ దేవతలకు  నివేదన చేయక తానే అనుభవించేవాడు  నిజముగా దొంగయే .

13 . యజ్ఞశిష్టాన్నమును  తిని శ్రేష్ఠపురుషులు అన్ని  పాపములనుండి ముక్తులయ్యెదరు . తమ శరీర పోషణకొరకే  ఆహారమును సిద్ధపరచు ( వండు ) కొను పాపులు పాపమునే భుజింతురు.

14 , 15 . ప్రాణులన్నియు అన్నము ( ఆహారము ) నుండి జన్మించును . అన్న ఉత్పత్తి వర్షము వలన ఏర్పడును . యజ్ఞముల వలన వర్షములు  కురియును . విహిత కర్మలు యజ్ఞములకు మూలములు . వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము . అందువలన సర్వవ్యాపియు , అవ్యయుడును ఐన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై యున్నాడు .

16 . ఓ  అర్జునా ! ఇట్లు  పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు  అనుకూలముగా ప్రవర్తింపనివాడు , అనగా తన కర్తవ్యములను  పాటింపక , ఇంద్రియ సుఖలోలుడైన  వాడు  పాపి . అట్టివాని యొక్క జీవితము వ్యర్ధము,.

17 . సచ్చిదానందమను పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని  ఐన పరమాత్ముడు  నిత్యమైన ఆత్మయందే  రమించును . అతడు పూర్ణకాముడు . కనుక ఆత్మ యందే తృప్తి నొందును,. అతడు ఆత్మ యందే నిత్య సంతుష్టుడు . అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు .


18  అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన , చేయకుండుట వలనను అతనికి  ఎట్టి ప్రయోజనమూ  ఉండదు .అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థ పరమైన సంబంధము ఏ విధముగను ఏ మాత్రము ఉండదు.

19 . అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను  చక్కగా ఆచరింపుము . ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు  పరమాత్మ ప్రాప్తి కలుగును .

20 . జనకుడు మొదలగు  జ్ఞానులు గూడ  ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుటవలననే  పరమసిద్ధిని  పొందిరి . కావున నీవును. లోకహితార్ధమై    కర్మలను ఆచరించుటయే  సముచితము .

21 . శ్రేష్ఠుడైన  పురుషుని ఆచరణమునే ( ప్రవర్తననే ) ఇతరులును అనుసరింతురు . అతడు  నిల్పిన ( ప్రతిష్టించిన ) ప్రమాణములనే లోకులందరు పాటించెదరు .

22 . ఓ  అర్జునా ! ఈ ముల్లోకములయందును  నాకు  కర్తవ్యము   అనునదియే  లేదు . అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను  పొందనిదియును లేదు. ఐనను. నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను  .


23 . ( ఏలనన ) ఓ  పార్ధా ! ఎప్పుడైనను నేను  సావధానుడనై. కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు. గొప్ప  హాని సంభవించును . ఎందుకనగా మనుష్యులందరును  అన్ని విధముల నా మార్గమునే  అనుసరింతురు .

24 . నేను కర్మలను. ఆచరించుట మానినచో ఈ లోకములన్నియు. నశించును . అంతే గాదు, లోకములందు  అల్లకల్లోలములను ( సాంకర్యములు ) చెలరేగును . ప్రజానష్టము వాటిల్లును . అప్పుడు  అందులకు  నేనే   కారకుడనయ్యెదను .

25 . ఓ భారతా ( అర్జునా) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటినే ఆచరించినట్లుగా  విద్వంసుడు ( జ్ఞాని ) కూడా లోకహితార్ధమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను .

26 . పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత,కర్మలను ఆసక్తితో ( ఫలాసక్తితో ) ఆచరించు  అజ్ఞానుల  బుద్ధులను భ్రమకు లోను   చేయరాదు . అనగా కర్మలయందు వారికి  అశ్రద్ధ  ను  కలిగింపరాదు  . పైగా తాను కూడా       శాస్త్ర విహితములైన  సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో. గూడ అట్లే. చేయింపవలెను .

27 . వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి గుణముల  ద్వారానే చేయబడుచుండును . అహంకార విమూదాత్ముడు ( అహంకారముచే మోహితమైన అంతః  కరణము గల అజ్ఞాని  ) ' ఈ కర్మలకు నేనే కర్తను ' అని భావించును.

28 . కాని, ఓ మహాబాహూ ! ( అర్జునా) గుణవిభాగ తత్వమును , కర్మ  విభాగ  తత్వమును తెలిసి కొన్న జ్ఞానయోగి గుణములే  గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని  భావించి , వాటి యందు. ఆసక్తుడు కాడు.

29  .ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ  గుణములయందును , కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు . అట్టి  మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన  జ్ఞాని అయినవాడు భ్రమకు ( ఊగిసలాటకు ) గురి చేయరాదు. .

30 . అంతర్యామిని , పరమాత్మను అయిన నా యందే నీ  చిత్తమును  ఉంచి , కర్మలనన్నింటినీ నాకే  అర్పించి , ఆశా మమతా  సంతాపములను వీడి , యుద్ధము. చేయుము .

31  . దోష దృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు  గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు .


H౩౨  కానీ నా యందు దోషారోపణ చేయుచు , నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు  సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై ( విపరీత జ్ఞానోపహతులై ) భ్రష్టులై , కష్టనష్టములు పాలయ్యెదరని ఎఱుంగుము.

33 . సమస్త ప్రాణులును  తమ తమ ప్రకృతులను అనుసరించి ( స్వభావములకు  లోబడి ) కర్మలు  చేయుచుండును . జ్ఞానియు తన ప్రకృతిని ( స్వభావమును ) అనుసరించియే క్రియలను ఆచరించును . ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను  ఎట్లు  త్యజింప గలరు .

34 . ప్రతి ఇంద్రియార్ధమునందును ( ప్రతి ఇంద్రియ విషయము నందును ) రాగ ద్వేషములు దాగియున్నవి . మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు . ఏలనన ఈ రెండే మానవుని  శ్రేయస్సునకు  విఘ్నకారకములు , మహా శత్రువులు .

 35 .పరధర్మమునందు ఎన్నో సుగుణములు  ఉన్నను స్వధర్మమునందు  అంతగా. సుగుణములు లేకున్నను చక్కగా  అనుష్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే  ఉత్తమము  . స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరమే . పరాధర్మాచరణము భయావహం .

అర్జున ఉవాచ
36 .అర్జునుడు పలికెను ! ఓ కృష్ణా ! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు  బలవంతము  చేసినట్లుగా  దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను. చేయుచుండును ?

శ్రీ భగవాన్  ఉవాచ

37 . శ్రీ భగవానుడు పలికెను -- రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము .ఇది క్రోధరూపమును దాల్చును . ఇది మహాశనము . భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా  అంతులేని పాపకర్మాచరణములకు  ఇదియే ప్రేరకము . కనుక ఈ విషయమున దీనిని పరామశత్రువుగా  ఎరుంగుము .

38 . పొగచే అగ్నియు , ధూళిచే  అద్దము , మావి చే గర్భము కప్పివేయబడునట్లు ,  జ్ఞానము , కామము చే ఆవృతమై  ఉండును.

39 . ఓ అర్జునా ! కామము అగ్నితో  సమానమైనది . ( అగ్ని వంటిది ) . అది ఎన్నటికిని చల్లారదు . జ్ఞానులకు అది నిత్యవైరి . అది మనుష్యుని విజ్ఞామును  కప్పివేయుచుండును .

40 . ఇంద్రియములు , మనసు , బుద్ధి ఇవి కామమునకు. నివాసస్థానములు . ఇది( ఈ కామము) మనోబుద్ధిఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి , జీవాత్మను మోహితునిగా  చేయును .

41 . కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము . పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహా పాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులు నొడ్డి  రూపుమాపుము

42 . స్థూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, అని పేర్కొందురు . ఇంద్రియముల కంటెను మనసు , దానికంటెను బుద్ధి శ్రేష్టమైనవి . ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది , సూక్ష్మమైనది  ఆత్మ.

43 . ఈ విధముగా  బుద్ధి కంటెను ఆత్మపరమైనదని  అనగా సూక్ష్మము , బలీయము , మిక్కిలి శ్రేష్ఠము అయినదని తెలిసి కొని ఓ మాహాబాహూ! బుద్ధి ద్వారా మనసునువశపరుచుకొని , దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము .

 ఓమ్ తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మ విద్యాయాం  యోగ శాస్త్రే ,
 శ్రీ కృష్ణార్జున సంవాదే  కర్మ యోగో  నామ తృతీయో అధ్యాయః

Tuesday, 9 June 2020

దీపం తో చేసే కొన్ని జప మంత్రాలు

దీపం తో చేసే కొన్ని జప మంత్రాలు

1.
శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరీ!
శుభం దేహి ధనం దేహి శోభనం దేహి మే సదా||

గృహంలో శుభకార్యాలు జరగాలి అని కోరుకొని ఈ నామాన్ని 10 నిముషములు అయిన దేవుని ముందు దీపం వెలిగించి జపించాలి , శుభకార్యాలకు ఉన్న ఆటంకాలు తొలగి మంచి జరుగుతుంది.

2.
భూమిలక్ష్మీ నమస్తేస్తు సర్వ సస్య ప్రదాయినీ|
మహీం దేహిం శ్రియం దేహి మహా మహిమా శాలినీ||

భూమి కొనాలి అనుకునే వారు,
భూ సంబంధిత సమస్యలు, పంట వేసే ముందు కోతకు ముందు, దీపం ముందు కూర్చుని ఒక 20 నిముషములు
ఈ మంత్రాన్ని జపించాలి ..

3.
బిల్వలక్ష్మీ నమస్తుభ్యం అచ్యుత ప్రాణనాయకే |
సౌఖ్యం దేహి ధృవం దేహి ఆరోగ్యం దేహి మే సదా||

దీపం పెట్టి ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు జపం చేయాలి...అనారోగ్యంతో ఉన్నవారు కానీ లేదా వారి కొసం ఇంట్లో ఎవర్సినైనా జపించ వచ్చు

4.
స్వర్ణ లక్ష్మీ నమస్తుభ్యం హేమాలంకార శోభితే
స్వర్ణం దేహి ధనం దేహి స్వతంత్రం దేహిమే సదా ॥

బంగారు కొనాలి అనుకున్నా, లేదా ఉన్న బంగారు ఏదైనా తాకట్టులో ఉన్నా ఈ మంత్రాన్ని జపం చేస్తే ఆ సమస్య తీరి బంగారు చేరుతుంది...

5.
విద్యాలక్ష్మీ నమస్తేస్తు సర్వ విద్యా ప్రదాయినీ|
విద్యాం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా||

విద్యార్థులు బాగా చదవాలి అభివృద్ధి కి రావాలి అని మంచి భవిష్యత్తు కోసం కోరుకొని ఈ మంత్రాన్ని దీపం పెట్టి వీలైనంత ఎక్కువ సార్లు జపించాలి.

6.
సీతాలక్ష్మీ నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ
పతిం దేహి ప్రియం దేహి భర్తారం దేహిమే సదా||

మంచి లక్షణాలు కలిగిన భాగస్వామి గురించి , మంచి కుటుంబంతో సంబంధం. కుదరాలి అని కోరుకొని ఈ మంత్రాన్ని దీపం పెట్టి 108 సార్లు రోజు జపం చేయాలి..


7.
ఐశ్వర్య లక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళ కారిణీ
రూపం దేహి రసం దేహి సౌభాగ్యారోగ్య సంపదాం

ఐశ్వర్యo కోసం వృద్ధి కోసం.... క్షేమం కోసం గొప్పగా ఎడగటం కోసం ఈ మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా దీపం ముందు కూర్చుని జపం చేయాలి..

8.
బుద్ధి లక్ష్మీ నమస్తుభ్యం బుద్ధి చాతుర్య వర్ధినీ |
వృద్ధిం దేహి శుభం దేహి బుద్ధి సిద్ధి ప్రదాయినీ!

దీపం పెట్టి వీలైనంత ఎక్కువగా ఈ మంత్రాన్ని జపిస్తే జ్ఞానం పెరగడం కోసం బుద్ది కుసలతతో పని చేయడం కోసం, ఈ మంత్రం ఎందులో పెట్టిబడి పెట్టాలి లేదా ఎలా చదివి అభివృద్ధికి రావాలి అనే జ్ఞానం లభిస్తుంది వివేకం పెరుగుతుంది..

9.
సంతాన లక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌభాగ్య దాయినీ!
పుత్రాన్ దేహి ధనం దేహి పౌత్రాన్ దేహి సుధేశ్వరీ||

దీపం పెట్టి , సంతానం కోసం ఈ శ్లోకాన్ని జపిస్తూ కుంకుమ పూజ చేసిన జపం చేసిన త్వరగా సిద్ధిస్తుంది.



సేకరణ

Friday, 5 June 2020

అధ ద్వితీయో అధ్యాయః --- సాంఖ్య యోగః


ఓం శ్రీ కృష్ణపరమాత్మనే  నమః 
అధ ద్వితీయో  అధ్యాయః ---  సాంఖ్య యోగః
సంజయ ఉవాచ
1 . సంజయుడు పలికెను -- ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని  కనులలో అశ్రువులు  నిండియుండెను . అవి అతని వ్యాకులపాటును , శోకమును తెలుపుచుండెను . అట్టి అర్జునుని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను .

శ్రీ భగవాన్ ఉవాచ

2 . శ్రీ భగవానుడు ఇట్లనెను - ఓ అర్జునా ! తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించింది ? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునదియు కాదు . స్వర్గమును    ఇచ్చునదియు  కాదు, కీర్తిని కలిగించునదియు  కాదు.

3 . కావున  ఓ అర్జునా! పిరికితనమునకు  లోను కావద్దు . నీకిది  ఉచితము కాదు. ఓ పరంతపా ! తుచ్ఛమైన ఈ హృదయ  దౌర్బల్యమును  వీడి , యుద్ధమునకై నడుము  బిగింపుము .

4 . అర్జునుడు పలికెను -- ఓ మధుసూదనా ! పూజ్యులైన భీష్మ పితామహుని , ద్రోణాచార్యులను యుద్ధమున  ఎదురించి బాణములతో ఎట్లు పోరాడగలను ? ఏలనన ఓ అరిసూదనా , ఈ ఇరువురును నాకు  పూజ్యులు .

5 . మహానుభావులైన ఈ గురుజనులను  చంపకుండా బిచ్చమెత్తుకొనిఅయినను  ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను , రక్తసిక్తములైన రాజ్యసంపదలను , భోగములను నేను మాత్రమే అనుభవింపవలసి యుండును గదా !

6 . ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా ? లేక చేయకుండుట శ్రేష్టమా? అనునది ఎరుగము . యుద్ధమున వారిని మనము జయింతుమా ? లేక మనలను  వారు జయింతురా ? అను విషయమును గూడ ఎరుగము.మనకు ఆత్మీయులైన ధార్తరాష్త్రులే ఇచ్చట మనలను ఎదిరించి ( పోరాడుటకు) నిలిచి యున్నారు . వారిని చంపి , జీవించుటకును మనము ఇష్టపడము .

7 . కార్పణ్యదోషము( పిరికితనం ) నకు లోనై , నా స్వభావమును కోల్పోయి  గిలగిలలాడుచున్నాను . ధర్మాధర్మముల విచక్షణకు  దూరమై,  నా కర్తవ్యమును  నిర్ణయించు కొనలేకున్నాను . నాకునిజముగా శ్రేయస్కరమైన దానిని  తెలుపుము . నేను నీకు శిష్యుడను . శరణాగతుడను , ఉపదేశింపుము .


8 . ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది . సిరిసంపదలతో  గూడిన తిరుగులేని  రాజ్యాధికారము లభించినను , కడకు సురాధిపత్యము ప్రాప్తిమ్చినను  ఈ శోక దాహము చల్లారును పాయమును  గాంచ లేకున్నాను.

సంజయ ఉవాచ

9 . సంజయుడు పలికెను - ఓ రాజా ! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన  అర్జునుడు, " నేను యుద్ధము చేయనే చేయను " , అని స్పష్టముగా నుడివి, మౌనము వహించెను .

10 . ఓ ధృతరాష్ట్రా! ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునిని  జూచి,శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు  పలికెను.


శ్రీ  భగవాన్ ఉవాచ
శ్రీ భగవానుడు  పలికెను -- ఓ  అర్జునా ! శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు . పైగా  పండితుని( జ్ఞాని ) వలె మాట్లాడుచున్నావు . పండితులైనవారు ప్రాణములు  పోయిన వారిని గూర్చి గాని , ప్రాణములు  పోని వారిని గురించిగాని శోకింపరు.

12 . నీవు గాని , నేను గాని, ఈ  రాజులు గాని ఉండని కాలమే లేదు . ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు . ( అన్ని కాలములలోను  మనము ఉన్నాము . ఆత్మ శాశ్వతము . అది  అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు .

13 . జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము , యవ్వనము , వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తి  కలుగును .ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు.

14 . ఓ కౌంతేయా ! విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు , సుఖ దుఃఖములు  కలుగుచున్నవి . అవి ఉత్పత్తి వినాశ శీలములు . అనిత్యములు . కనుక భారతా ! వాటిని సహింపుము ( పట్టించుకొనకుము ) .

15 .ఏలనన ఓ పురుష శ్రేష్టా !ధీరుడైనవాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును . అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు .అతడే మోక్షమును పొందుటకు  అర్హుడు .

16 . అసత్తు  అనుదానికి ( అనిత్యమైన దానికి ) ఉనికియే  లేదు. సత్తు అనుదానికి లేమి  లేదు. ఈ విధముగ ఈ రెండిటి యొక్క వాస్తవస్వరూపములను తత్వజ్ఞాని  అయినవాడే ఎరుంగును .

17 .నాశ రహితమైన  ఆ సత్యము ( పరమాత్మ తత్వము) జగత్తు నందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము . శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు .

18 . ఈ శరీరములు  అన్నియును నశించునవియే . కానీ జీవాత్మ నాశ రహితము , అప్రమేయము ( అనిర్వచనీయము ) , నిత్యము. కనుక( ఈ విషయమును  ఎరింగి ) ఓ భరతవంశీ ! అర్జునా ! నీవు యుద్ధము  చేయుము .

19 . ఆత్మ ఇతరులను  చంపునని భావించువాడును , అది( ఆత్మ) ఇతరులచే చంపబడునని  భావించు వాడును , ఆ ఇద్దరును అజ్ఞానులే . ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు .

20 . ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు . పుట్టి ఉండునది కాదు.ఇది భావ వికారములు లేనిది ( ఉత్పత్తి, అస్థిత్వము , వృద్ధి , విపరిణామము , అపక్షయము, వినాశము  అను ఆరును భావవికారములు ) . ఇది జన్మ లేనిది. నిత్యము, శాశ్వతము , పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు .

21 . ఓ పార్ధా ! ఈ ఆత్మ నాశ రహితము, నిత్యము అనియు , జనన మరణములు లేనిదనియు , మార్పులేనిదనియు  తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ? ఎవరిని ఎట్లు చంపును.

22 . మానవుడు జీర్ణవస్త్రములను త్యజించి , నూతన వస్త్రములను ధరించినట్లు , జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును .

23 ఈ ఆత్మను  శస్త్రములు చేధింపజాలవు . అగ్ని దహింపజాలదు . నీరు తడుపజాలదు. వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు .

24 . ఈ ఆత్మ చేధించుటకును , దహించుటకును, తడుపుటకును , శోషింపచేయుటకును సాధ్యము కానిది . ఇది నిత్యము. సర్వవ్యాపి , చలింపనిది ( అచలము ) స్థాణువు ( స్థిరమైనది )  సనాతనము ( శాశ్వతము) .


25 . ఈ ఆత్మ అవ్యక్తమైనది , ( ఇంద్రియగోచరము గానిది ) అచింత్యము ( మనస్సునకును అందనిది ) వికారములు లేనిది. దీనిని  గూర్చి ఇట్లు తెలిసికొనుము . కనుక ఓ అర్జునా! నీవు దీనికై  శోకింప దగదు.


26 . ఓ అర్జునా! ఈ ఆత్మకు జననమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికిని దీనికై నీవు శోకింప దగదు.

27 . ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు . మరణించిన వానికి పునర్జన్మ  తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.

28 . ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియగోచరములు గావు -( అవ్యక్తములు ) మరణానంతరము గూడ అవి అవ్యక్తములే - ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే  అవి ప్రకటితములు ( ఇంద్రియ గోచరములు ) అగుచుండును .ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.

29 .ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును.మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును . వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరముగా  దీనిని వినును . ఆ విన్నవారిలో కూడ  కొందరు  దీనిని గూర్చి ఏమియు ఎరుగరు .

30 . ఓ అర్జునా! ప్రతి దేహమునందును  ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది .కనుక  ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు.

31 . అంతేకాక స్వధర్మమును బట్టియు నీవు భయపడనక్కరలేదు . ఏలనన క్షత్రియునకు  ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏదియు లేదు .

32 . ఓ పార్ధా ! యాదృచ్చికంగా  అనగా అనుకోకుండా  తటస్థించిన  ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును . ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది .

33 . ఈ  యుద్ధము నీకు ధర్మబద్ధము . ఒకవేళ నీవు  దానిని ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పారిపోయినవాడవు అగుదువు . దానివలన కీర్తిని కోల్పోయెదవు . పైగా నీవు పాపము చేసినవాడవు అగుదువు.

34 . లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తిని గురించి చిలువలు పలువలుగా  చెప్పికొందురు . మాన్యుడైన పురుషునకు  అపకీర్తి మరణము కంటెను భాధాకరమైనది .

35 . ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మాన్యుడవు . యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు . అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధమునుండి పారిపోయినట్లు వీరు భావింతురు .

36 . నీ శతృవులు నీ సామర్ధ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందురు . అంతకంటె విచారకరమైన  విషయమేముండును

37 ఓ అర్జునా  ! రణరంగమున మరణించినచో  నీకు వీర స్వర్గము ప్రాప్తించును. యుద్ధమును జయించినచో  రాజ్య భోగములను అనుభవింపగలవు . కనుక కృతనిశ్చయుడై యుద్ధమునకు లెమ్ము .

38 . జయాపజయములను , లాభనష్టములను , సుఖదుఃఖములను. సమానముగా  భావించి , యుద్ధ సన్నద్ధుడవు కమ్ము  అప్పుడు నీకు పాపములు  అంటనే అంటవు.

39 . ఓ పార్ధా! ఈ ( సమత్వ ) బుద్ధిని ఇంతవరకును జ్ఞాన యోగ దృష్టితో తెల్పితిని . ఇప్పుడు దానినే  కర్మయోగ దృక్పధముతో వివరించెదను   వినుము . దానిని ఆకళింపు చేసుకుని , ఆచరించినచో  కర్మబంధములనుండి  నీవు ముక్తుడవయ్యెదవు .
40 . ఈ ( నిష్కామ ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి  ఎన్నటికిని బీజనాశము  లేదు . దీనికి విపరీత ఫలితములే యుండవు . పైగా ఈ( నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయమునుండి  కాపాడును .

41 . ఓ అర్జునా ! ఈ ( నిష్కామ) కర్మయోగమునందు  నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే  ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై , ఒక దారీ  తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును .

 42 , 43 ,44 . ఓ అర్జునా! వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునకలై యుందురు . వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క  బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు . వాటి  అంతరార్ధముల జోలికే పోరు . స్వర్గమునకు మించినదేదియును లేదనియు , అదియే  పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదరు . ఆ ఇచ్చకపుమాటల ఉచ్చులలోబడిన భోగైశ్వర్యఆసక్తులైన  అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు . .

45 . ఓ. అర్జునా! వేదములు సత్వ రజస్తమో గుణముల కార్య రూపములైన  సమస్త భోగములను గూర్చియు , వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును . నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆసక్తిని త్యజింపుము . హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము . నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు.  అంతఃకరణమును వాసమునందుంచుకొనుము .

46 . అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము  అందుబాటులో ఉన్నవానికి  చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనకరమో , పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము .

47 . కర్తవ్యకర్మమునాచరించుటయందే  నీకు అధికారము కలదు . ఎన్నటికినీ దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు . కర్మలనుమానుటయందు  నీవు ఆసక్తుడవు కావలదు . అనగా ఫలాపేక్ష రహితుడవై  కర్తవ్య బుద్ధితో  కర్మలను ఆచరింపుము .

48 .ఓ ధనంజయా ! యోగస్థితుడవై ఆసక్తిని వీడి , సిద్ధి - అసిద్ధుల యెడ సమత్వభావమును  కలిగి యుండి , కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావననే  యోగమందురు .

ఈ సమత్వబుద్ధియోగముకంటెను  సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి  చెందినది .కావున ఓ ధనంజయా!  నీవు సమస్త బుద్ధి యోగమునే  ఆశ్రయింపుము . ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు , కృపణులు.

50 . సమత్వ బుద్ధి యుక్తుడైనవాడు  పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును .అనగా కర్మఫలములు  వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూప యోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు  కౌశలము,. అనగా కర్మ బంధములనుండి ముక్తుడగుటకు  ఇదియే  మార్గం

51 . ఏలనన సమబుద్ధి యుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి , జనన మరణ బంధములనుండి
ముక్తులయ్యెదరు . అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు .

52 .మోహమనెడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన , వినబోవు ఇహపర లోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు .

53 . నానా  విధములైన మాటలను వినుటవలన విచలితమైన ( అయోమయమునకు గురయిన)నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య ( శాశ్వత ) సంయోగము ఏర్పడును .

అర్జున ఉవాచ
54 . అర్జునుడు  పలికెను . ఓ కేశవా ! సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని  యొక్క లక్షణములెవ్వి ? అతడు  ఎట్లు భాషించును? ఎట్లు కూర్చొనును ? ఎట్లు నడుచును ?

శ్రీ భగవాన్ ఉవాచ

55 . శ్రీ భగవానుడు పలికెను- ఓ అర్జునా ! మనసునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి , ఆత్మ ద్వారా ఆత్మ యందు సంతుష్టుడైన వానిని , అనగా పరమాత్మ సంయోగమువలన  ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని  యందురు .

56 . దుఖఃములకు కృంగిపోని వాడును , సుఖము లకు  పొంగిపోని వాడును, ఆసక్తిని , భయక్రోధములను  వీడినవాడును ఐనట్టి  మననశీలుడు ( ముని) స్థితప్రజ్ఞుడనబడును .

57 . దేనియందును మమతాసక్తులు లేనివాడును ,అనుకూల పరిస్థితులయందు హర్షము , ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము  మొదలగు. వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును .


58 . తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా , ఇంద్రియములను ఇంద్రియార్ధముల ( విషయాదుల ) నుండి  అన్ని విధముల  ఉపసంహరించుకొనిన  పురుషుని యొక్క బుద్ధి  స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను

59 . ఇంద్రియముల ద్వారా   విషయములను  గ్రహింపని వాని నుండి ఇంద్రియార్ధములు  మాత్రమే వైదొలగును . కానీ వాటిపై ఆసక్తి మిగిలి యుండును . స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారమైనందు. వలన వాని నుండి ఆ ఆసక్తి  గూడ తొలగిపోవును .

60 . ఓ అర్జునా ! ఇంద్రియములు ప్రమధనశీలములు . మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను , ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా  లాగికొనిపోవుచునే యుండును .
61 .కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని  ,సమాహితచిత్తుడై ( చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసినవాడై ) మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను . ఏలనన ఇంద్రియములను  వశమునందుంచుకొను  వాని బుద్ధి స్థిరంగా ఉండును.
62.
విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన ఆ విషయములు పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.
63.
అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగుతుంది. దాని ప్రభావమున
స్మృతి చిన్నా భిన్న మగును. స్మృతి భ్రష్ట మైనందు వలన బుద్ధి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనం అగును.
64.
అంతః కరణమును వశమందు ఉంచు కొనిన సాధకుడు రాగ ద్వేష రహితుడై ఇంద్రియాలు ద్వారా విషయములను గ్రహించు చున్ననూ మనః శాంతి పొందును.
65 . మనఃప్రసన్నతను  పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి  అన్ని విషయములనుండియు  వైదొలగి , పరమాత్మయందు మాత్రమే  పూర్తిగా స్థిరమగును .

66 .ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక  బుద్ధి ఉండదు . అట్టి. అయుక్తమనుష్యుని  అంతఃకరణమునందు ఆస్తిక  భావమే  కలుగదు . తద్భావనా హీనుడైన వానికి  శాంతి  లభింపదు . మనశాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును .

67 . నీటిపై తేలుచున్న నావను గాలినెట్టివేయును . అట్లే ఇంద్రియార్ధములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క  ఇంద్రియముతో కూడి యున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును .
68  కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములగ పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగానుండును .

69 .నిత్యజ్ఞాన స్వరూప పరమానందప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును . అది ఇతర ప్రాణులన్నిటికిని  రాత్రితో  సమానం . నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు   ప్రాణులన్నియు మేల్కొని యుండును. అది పరమాత్మ తత్వమునెరిగిన మునికి ( మననశీలునికి ) రాత్రి తో సమానం.

70  సమస్తదిశలనుండి పొంగి  ప్రవహించుచు వచ్చి చేరిన  నదులన్నియును  పరిపూర్ణమై నిశ్చలముగానున్న  సముద్రమును  ఏ మాత్రము చలింపజేయకుండానే  అందులో  లీనమగును . అట్లే సమస్తభోగములను  స్థితప్రజ్ఞుని యందు  ఎట్టి వికారములను కల్గింపకయే  వానిలో  లీనమగును. అట్టి పురుషుడే పరమ శాంతిని. పొందును. భోగాసక్తుడు శాంతిని. పొందజాలడు.


71 . కోరికలన్నిటిని  త్యజించి , మమతా - అహంకార ,స్పృహ  రహితుడై చరించునట్టి పురుషుడే శాంతిని పొందును.


72 . ఓ అర్జునా ! బ్రాహ్మీస్థితి అనగా  ఇదియే  . ( ఇదియే బ్రహ్మ ప్రాప్తి  కలిగిన పురుషుని స్థితి) .ఈ బ్రాహ్మీస్థితిని  పొందిన యోగి ఎన్నడును మోహితుడు  కాడు.  అంత్యకాలము నందును. ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగా నున్నవాడు  బ్రహ్మానందమును పొందును .



ఓం తత్సదితి  శ్రీ మద్బగవద్గీతాసూపా నిషత్సు

బ్రహ్మ విద్యాయామ్ యోగాశాస్తే శ్రీకృష్ణార్జున  సంవాదే , సాంఖ్యయోగో నామ  ద్వితీయో యాధ్యాయః




శ్రీ మద్భగవద్గీత /మొదటి అధ్యాయము


శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 
 శ్రీ మద్భగవద్గీత

మొదటి  అధ్యాయము

అర్జున విషాదయోగం

ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ----
 1  సంజయా ! ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో  యుద్ధం చేసేందుకు సమకూడుకొనిన  మా దుర్యోధనాదులును , ఆ పాండవులనూ ఏమి చేశారు .
సంజయుడు చెబుతున్నాడు
2      ధృతరాష్ట్ర  మహారాజా ! మరి కాసస్సేపటిలో యుద్ధం ప్రారంభమవుతుందీ అనగానే    నీ కొడుకైన దుర్యోధనుడు , పాండవుల సైన్య వ్యూహమును చూసి , ఆచార్యులైనా  ద్రోణుణ్ణి  సమీపించి ఇలా  అన్నాడు

౩ ఆచార్యా , బుద్ధిశాలీ , మీ శిష్యుడూ అయినా ద్రుపదానందనుడు అగు ద్రుష్టద్యుమ్నునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి .

4 . ఆ పాండవ సైన్యంలో, భీమార్జునల కే మాత్రమూ తీసిపోని వారైన యుయుధాన (సాత్యకి ) విరాట , ద్రుపదాదులు---

5  మరియు - ధృష్టకేత , చేకితాన , కాశీరాజ, పురుజిత్ , కుంతిభోజ , శైబ్యదులు

6  యుధామన్యుడు,ఉత్తమౌజుడు , అభిమన్యుడు , ద్రౌపదీ తనయులైన ఉప పాండవులూ మొదలైన వారంతా కూడా వారి పక్షాన  మహారధులే ( మహారథి -  పదివేలమంది విలుకాండ్రతో ఏకాకిగా , ఏకకాలంలో  యుద్ధం చేసి గెలవగల వీరుడు.)

7  బ్రాహ్మణోత్తముడవైన ద్రోణాచార్యా ! ఇక మన సైన్యం లో ఉన్న మహావీరులను చెబుతాను విను .

8  మీరు , భీష్ముడు ,కర్ణుడు , కృపాచార్యుడు , అశ్వద్ధామ , వికర్ణుడు , సౌమదత్తి , జయద్రధుడు  మరియు

9  నా కొరకు తమ ప్రాణాలనైనా విడువగలవాళ్ళు , అస్త్ర శస్త్ర సంపన్నులు , యుద్ధ  విద్యా విశారదులును ఐన అనేకమంది ఇతర శూరులు  మన వైపున ఉన్నారు .

10  అపరిమితమైన మన సైన్యం భీష్ముడి  చే రక్షింపబడుతూ  ఉంది . పరిమితమైన ఆ పాండవసైన్యం భీముడి సంరక్షణ  లో ఉంది.

11  కాబట్టి , మన పక్షాన గల మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను  విడువకుండా నిలిచి  మన నాయకుడైన భీష్ముణ్ణి  రక్షిస్తూ  ఉండండి .

12  ఆ మాటలు వినిన కురువృద్ధుడూ , తాతగారూ  ఐన భీష్ముడు రారాజును సంతోషపరచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని  పూరించాడు.

13  అది వినిన కౌరవ వీరులందరు  కూడా శంఖాలను పూరించారు . భేరీ  , ఫణవానక, గోముఖాదులను మ్రోగించారు . ఆ శబ్దాలు దిక్కులన్నింటా  నిండిపోయాయి .

14  , 15  . అప్పుడు , శ్వేతాశ్వాలను పూంచిన రధం మీద ఉన్నవారై కృష్ణాఅర్జునులు దివ్య శంఖాలను పూరించారు. శ్రీకృష్ణుడు " పాంచజన్యం " ను , అర్జునుడు " దేవదత్త"  మనే శంఖమును , భీముడు భయంకరమైన " పౌండ్ర " మనే శంఖాన్ని పూరించారు .

16 . పాండవ పక్షాన రాజైన కుంతీ పుత్రుడు యుధిష్ఠిరుడు " అనంత విజయం " నకులుడు " సుఘోషము " , సహదేవుడు " మణిపుష్పకము ". అనే శంఖాలను  పూరించారు.

17  మేటి విలుకాడైన కాశీరాజు , మహారథి అయిన శిఖండి --- ఓడిపోవడం అనేది ఏనాడూ  ఎరుగని మహావీరులైన దృష్టద్యుమ్న , విరాట, సాత్యకులు .

18  ద్రుపదుడూ , ద్రౌపది  కొడుకులైన  ఉప పాండవులైదుగురు - ఇతరులైన రాజులు - యోధా గ్రేసరుడైన  సుభద్ర  కొడుకు అభిమన్యుడు వీళ్లంతా  వేరువేరుగా తమ తమ శంఖాలను  అనేక పర్యాయాలు  ఊదారు.

19  ఆ శంఖ ధ్వని కౌరవుల గుండెలను  చీల్చి వేస్తూ , భూమ్యాకాశాలను  నిండి ప్రతిధ్వనించింది .

20 ,  21  ఓ రాజా  ఆ  వ్యవస్థ పిమ్మట , కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను  చూస్తూ -శస్త్రాదులనూ, ధనుస్సులను  ధరించి , కృష్ణునితో   ఓ అచ్యుతా ! మన రధాన్ని  ఒకసారి రెండు  సేనల మధ్య నిలుపుమని  అడిగెను .

22 , 23  కృష్ణా !  దుష్టబుద్ధియైన ఆ దుర్యోధనుడిని గెలిపించడం కోసం మాతో సమరానికి  సంసిద్ధులై  వచ్చి నిలిచిన వారెవరో మనలోని ఎవరెవరు - వారిలోని ఎవరెవరితో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరిని చేరువగా  చూడాలని  అర్జునుడు పలికెను .

సంజయుడు చెబుతున్నాడు:-

24 , 25  అర్జునుడలా కోరగానే శ్రీకృష్ణుడు రధాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు . భీష్ముడు, ద్రోణుడు  మొదలైన మహావీరులకు అభిముఖంగా రధాన్ని నిలిపి -" అదిగో  కౌరవ కూటం . చూడవయ్యా అర్జునా " అన్నాడు శ్రీకృష్ణుడు.

26  , 27  . రెండు సేనలకి మధ్య రథారూఢులై యున్న అర్జునుడు - ఆ రెండు సేనలలోను యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను , తాతలను , గురువులను ,మేనమామలను, సోదరులను , కుమారులను , మనుమలను, స్నేహితులను , బావలను- ఇతరులైన స్వజనులనూ అందరిని  చూసాడు .


28 .సమర భూమికి వచ్చియున్న  బంధువులను  అందరిని  చూచి , కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోకసంతప్తుడై  ఇట్లు పలికెను.

29 . అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! సమరోత్సాహం తో రణరంగమున నిలిచియున్న ఈ స్వజనసమూహమును జూచి , నా అవయములు
శిధిలమగుచున్నవి . నోరు ఎండిపోవుచున్నది . శరీరమునందు వణకు, గగుర్పాటు కలుగుచున్నవి .

30 . గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది . చర్మము తపించిపోవుచున్నది . మనస్సు భ్రమకు  గురిఅయినట్లు అనిపించుచున్నది .కనుక ఇక్కడ నిలబడలేక పోవుచున్నాను .

31  . ఓ కేశవా ! పెక్కు అపశకునములు కనబడుచున్నవి .యుద్ధమున స్వజనసమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు .

32  ఓ కృష్ణా ! నాకు విజయము గాని, రాజ్యము గాని , సుఖములు గాని అక్కరలేదు . గోవిందా ! ఈ రాజ్యము వలనగాని , ఈ భోగములవలన గాని, ఈ జీవితము వలన గాని ప్రయోజనము లేదు .

33 . మనము ఎవరికై ఈ రాజ్యమును , భోగములను , సుఖములను కోరుకున్నామో, వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు .

34 . గురువులు ,తండ్రులు , తాతలు ,కొడుకులు , మనుమలు , మేనమామలు , మామలు , బావమరుదులు , ఇతర బంధువులు మొదలగువారు అందరును ఇచ్చటికి చేరి యున్నారు .

35  .ఓ మధుసూదనా ! ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై  చెప్పనేల ? అట్లే వీరిలో ఎవ్వరినైనను నన్ను చంపబూనిననూ , నేను మాత్రము వీరిని చంపనే  చంపను.

36 . ఓజనార్దనా ! ఈ ధార్తరాష్ట్రులను   చంపి  మనము బావుకొనునది  ఏమి ? ( మనము మూట కట్టుకొనునది  ఏమి) ఈ ఆతతాయులను చంపుటవలన మనకు పాపమే కలుగును .

37 . కనుక ఓమాధవా !  మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు . స్వజనులను చంపిన మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును .
38 , 39 . లోభకారణముగ భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను , మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో , ఓ జనార్దనా! కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఏలఆలోచింపరాదు .

40 . కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియును నశించును . ధర్మము అంతరించి పోయినప్పుడు కులము నందు అంతటను పాపమే వ్యాపించును .

41 .ఓ కృష్ణా! అధర్మము ( పాపము ) పెచ్చుపెరిగి పోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితలు అగుదురు . ఓ వార్ష్ణేయా ! స్త్రీలు దూషితలు అయినచో వర్ణసాంకర్యము  ఏర్పడును .

42 . వర్ణసాంకర్యము కులఘాతకులను , కులమును నరకమునందు  పడవేయును. పిండోదకములు  ( శ్రాద్ధతర్పణములు ) లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు .

43 . వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు  , జాతిధర్మములు నష్టమగును .

44 . ఓ జనార్దనా! కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా ( కలకాలము) నరకప్రాప్తి తప్పదని ప్రతీతి .

45 . అయ్యో ! మనము బుద్ధిమంతులమైఉండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తలమై, ఈ ఘోరపాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము - ఇది ఎంత  దారుణము ?

46 . శస్త్రరహితుడనై. ఎదురింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను ,  అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును .

సంజయ  ఉవాచ
47 . సంజయుడు పలికెను - అర్జునుడు ఈ విధముగా పలికి  శోకసంవిగ్నమానసుడై , యుద్ధభూమియందు ధనుర్భాణములను త్యజించి , రథము వెనుక భాగమున చతికిలబడెను .

ఓం తత్సదితి శ్రీ మద్భాగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగోనామ ప్రధమో అధ్యాయః .