Monday 17 February 2020

ఉసిరి మెంతికాయ


ఉసిరి మెంతికాయ
కావలసిన పదార్థాలు
1. ఉసిరి కాయలు 500 గ్రాములు
2. ఎర్ర కారం పొడి 250 గ్రాములు
3. ఆవాలు 2 స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5. నువ్వుల నూనె 250 గ్రాములు
6. ఇంగువ కొద్దిగా
7. ఉప్పు తగినంత
8. పసుపు కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఆర బెట్టుకోవాలి.
ఆరిన ఉసిరికాయలకు గాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నూనె వేసుకుని మెంతులు , ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి దోరగా వేపుకుని
చల్లార్చుకోవాలి.
చల్లారిన వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
మరల స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 5 స్పూన్స్ ఆయిల్ వేసి గాట్లు పెట్టిన ఉసిరికాయలను వేసి , కొద్దిగా పసుపు వేసి ఒక 15 నిమిషాలు వేగనిచ్చి , వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
తిరిగి అదే బాణలి లో నువ్వుల నూనె , ఇంగువ వేసి వేడెక్క నివ్వాలి .
నూనె బాగా వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈనూనెలో కారం , ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి, ఆవపొడి , ఉప్పు వేసి బాగా కలిపి, దీనిలోముందుగా మనం వేపుకుని పెట్టుకున్న ఉసిరికాయలను వేసి
బాగా కలిపి పొడి సీసాలో గాని
జాడీలో గాని పెట్టుకుని 3 రోజులపాటు బాగా ఊర నివ్వాలి.
ఇలా 3 రోజులు ఊరిన తరువాత బాగాకలుపుకుని వాడుకుంటే ఘుమఘుమలాడే ఉసిరి మెంతి కాయ రెడి.
ఇది ఒక 6 నెలలపాటు నిలువ ఉంటుంది.

సూచన :

ఉసిరి ఆదివారం, మరియు రాత్రులు తినడం నిషేధం అని పెద్దలు చెపుతారు..

Subha's Kitchen
Rachana: Subha Achanta
Facebook page: Achanta Kadhalu