శ్రీ వెరంబదూరు...
కేరళలోని కాలడి సమీపంలో, పూర్ణానదీ తీరంలో శ్రోత్రియులు ఎక్కువగా నివసించే చిన్న గ్రామం...
కార్తీకమాసం, శుక్లపక్ష ద్వాదశి, మధ్యాహ్న సమయం...
ఓ ఇంటి ముందు నిల్చుని
‘భవతీ భిక్షాందేహి...’
అడిగాడు ఎనిమిదేళ్ల బాలుడు...
ఈ మాట వినిపిస్తూనే బయటకు వచ్చి తొంగిచూసిందా ఇల్లాలు...
బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఆ పిల్లాడి ముఖం చూసి ఇంట్లోకి వెళ్లిందామె.
మధ్యాహ్నం... భోజన సమయం...
అందులోనూ ద్వాదశినాడు అతిథి వచ్చాడు.
తన చీర చిరుగులు కనబడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ..
ఏమీ ఇవ్వలేని తన దురదృష్టానికి, పేదరికానికి దుఃఖిస్తూ..
ఇంట్లో ఉన్న ఒక ఎండిపోయిన ఉసిరికాయను తెచ్చి ఆ పిల్లవాడికి భిక్షగా
సమర్పించిందా ఇల్లాలు..
తనకు భిక్ష వేసిన ఆ ఇల్లాలి ముఖం చూస్తూనే ఆమె దుఃఖం, పేదరికం
ఆ పిల్లవాడికి అర్థమయ్యాయి.
అంతే... ఆ ఇంటి ముందే నిల్చుని
‘అంగం హరేః పులక భూషణ మాశ్రయంతే
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః’
‘మొగ్గలతో నిండి ఉన్న చీకటి చెట్టుకు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్లుగా,
పులకాంకురాలతో శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించి ఉన్న సకల శుభాలకు స్థానమైన లక్ష్మీదేవి చల్లని చూపు శుభాలను ప్రసాదించుగాక..’
అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ
ఆశువుగాశ్లోకాలు గానం చేశాడు.
అంతే... ఆ ఇంటి ముందు
బంగారు ఉసిరికల వర్షం కురిసింది.
ఆ ఇల్లాలి పేదరికం తొలగిపోయి సకల శుభాలు కలిగాయి.
ఇలా జాతికి లక్ష్మీ దయను వర్షింపజేసిన ఆ బాలుడే
అద్వైత సిద్ధాంతకర్తగా,
జగద్గురువుగా అవతరించిన
ఆది శంకరాచార్యులు.
ఆయన చేసిన స్తోత్రమే కనకధారా స్తోత్రం.
ఆది శంకరులు అనేక స్తోత్రాలు రచించి
జాతికి అందించారు.
వాటి ద్వారా జీవన మార్గాన్నీ నిర్దేశించారు.
వాటిలో కనకధారా స్తోత్రం ఒకటి.
జగద్గురు ప్రవచించిన వాటిలో ఇది మొదటి స్తోత్రంగా చెబుతారు.
ఇందులో మొత్తం 21 శ్లోకాలు ఉన్నాయి.
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తట్పిదంగనేవ
మాతాస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః’
ఆకాశంలో మబ్బులు కమ్మిన సమయంలో వచ్చే మెరుపు ఎలా కాంతిమంతంగా కనిపిస్తుందో...
అలా విష్ణు వక్ష స్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తుంది.
‘గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయ కేళిఘ సంస్థితాయై
తస్మై నమస్త్రిభువనైన గురోస్తరుణ్యై’
ముల్లోకాలకూ గురువైన విష్ణువు పట్టమహిషి...
వాగ్దేవి, గరుడ ధ్వజసుందరి, శాకంబరి, శశిశేఖర వల్లభ అనే పేర్లతో పూజలందుకుంటున్న లక్ష్మీదేవికి నమస్కారం.
మరో శ్లోకంలో వక్షస్థలాన్ని అలంకరించిన మాలలోని ఇంద్రనీలపతకం మెరుస్తున్నట్లుగా లక్ష్మీదేవి ఉందని చెబుతారు.
ఇలా ఏ శ్లోకానికా శ్లోకం ప్రత్యేకంగా ఉండడంతో పాటు అమ్మరూపాన్ని, దయను ఒక దృశ్యంగా కళ్లముందు ఉంచుతుంది.
ఆది శంకరులు ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి ఆశువుగా స్తోత్రం చేశాడు కానీ అందులో ఎక్కడా కనకధార అనే మాట వినిపించదు. అయితే అందులోని
‘దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశే విషణ్ణే!
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయదూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!’
శ్రీమన్నారాయణుని దేవేరి అయిన లక్ష్మీదేవి దృష్టి అనే మేఘం దయావాయు ప్రేరితమై, నాలో చాలాకాలం నుంచి ఉన్న దుష్కర్మ తాపాలను తొలగించి, పేదవాడిని అనే విచారంలో ఉన్న చాతక పక్షి వంటి నాపై ధనవర్ష ధారను కురిసేలా చేయును గాక’
అనే శ్లోకాన్ని బట్టి కనకధార అనే పేరు ఈ స్తోత్రానికి వచ్చినట్లు చెబుతారు.
ఇందులోని ‘ద్రవిణాంబుధార’ అనే పద భాగమే కనకధార అనే పేరుకు కారణంగా భావించాలి.
తనను నమ్మి నిరంతరం స్తోత్రం చేసేవారిపై లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో తన దయను వర్షింపజేస్తుంది.
ఈ విషయాన్ని నిరూపించేదే కనకధారా స్తోత్రం.
శ్రీమహాలక్ష్మి సంపదల తల్లి.
ధనధాన్యాలకు అధినేత.
శ్రీహరి హృదయ రాణి.
కనకధారా స్తోత్రంలో విష్ణువును ప్రార్థించడం,
విష్ణువుతో లక్ష్మీదేవిని అనుసంధానం చేస్తూ స్తోత్రం చేయడం కనిపిస్తుంది.
‘నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్మై్య
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై’
పద్మాలను పోలిన ముఖంతో వర్ధిల్లే దేవికి నమస్కారం.
క్షీర సముద్రం నుంచి జన్మించిన తల్లికి నమస్కారం,
అమృతం, చంద్రుడుల సోదరికి నమస్కారం. నారాయణుని వల్లభ అయిన లక్ష్మీదేవికి నమస్కారం...
శ్రీ కనకధారా స్తోత్రం
వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం
కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః
బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః
సువర్ణ ధారా స్తోత్రం
యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం