అశ్వ రూపం విశ్వ తేజం
చదువున్నచోట జ్ఞానముంటుంది.
జ్ఞానం ధనాన్ని సంపాదిస్తుంది.
ధనం ఆనందానికి మూలమవుతుంది.
అందుకే చదువు రావాలన్నా, జ్ఞానం వృద్ధి చెందాలన్నా, సంపదలు చేకూరాలన్నా జ్ఞానానందమయుడైన హయగ్రీవుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.
‘జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికా కృతిం
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే’
ఇది హయగ్రీవ స్తోత్రంలోని మొదటి శ్లోకం. ఇందులోనే స్వామితత్త్వం అంతా ఇమిడి ఉంది.
హయగ్రీవుడు చదువులకు అధిదేవుడు. సృజనాత్మకత, సందర్భానుసారంగా నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుకురావడం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి వృద్ధిచెందడంలాంటి వాటికోసం ఆయనను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తెలుగు సాహితీ ప్రక్రియల్లో విశేషమైన అవధానం, ఆశు కవిత, సభారంజకంగా ఉపన్యసించడంలో పేరుపొందిన పండితులంతా హయగ్రీవ ఉపాసన చేస్తుంటారు.
ధర్మరక్షణ కోసం మహావిష్ణువు ఎత్తినవి దశావతారాలని అందరికీ తెలుసు.
కొందరు అవి 21 అని చెబుతారు.
వాటిలో ఒకటి హయగ్రీవ రూపం.. శ్రవణానక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ స్వామి అవతరించినట్లు చెబుతారు.
మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం. లక్ష్మీదేవి పుట్టిన తిధి శ్రావణ పౌర్ణమి.
వారిద్దరి జన్మ నక్షత్ర తిధులతో కలిసి ఉంటుంది కాబట్టి ఆనాడు
లక్ష్మీసహిత హయగ్రీవ ఆరాధన మంచిదని చెబుతారు.
హయగ్రీవ అవతరణ వివరాలు మహాభారతం, దేవీ భాగవతంలో ఉన్నాయి.
సకల చరాచర సృష్టికి కర్తయిన బ్రహ్మకు శక్తినిచ్చేవి వేదాలు.
ధర్మమూలాలైన వేదాల సంరక్షణ బాధ్యత శ్రీ మహావిష్ణువుది.
మధుకైటభులనే రాక్షసులు సృష్టి ప్రారంభ పనిలో నిమగ్నమై ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించి, రసాతలానికి చేరుకున్నారు.
దాంతో బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలియకుండా పోయింది.
అప్పుడు మహావిష్ణువు వేద సంరక్షణ కోసం హయగ్రీవుని అవతారం ధరించాడు.
గుర్రం ముఖం, మానవ శరీరంతో ఈ అవతారం ఉంది.
అది విశ్వమంతా నిండి మహోన్నతంగా కనిపించింది.
నక్షత్రాలతో నిండిన ఆకాశం తల భాగంగా, సూర్యకిరణాలు కేశాలుగా, సముద్రాలు కనుబొమలుగా, సూర్యచంద్రులు కళ్లుగా, ఓంకారం అలంకారంగా, మెరుపులు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం, బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి మెడ భాగంగా కనిపించాయి.
ఈ దివ్యరూపంలోని హయగ్రీవుడు క్షణకాలంలో బ్రహ్మముందు అంతర్థానమై రసాతలాన్ని చేరాడు.
అక్కడ ప్రణవనాదం చేశాడు.
ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా సామ వేదాన్ని గానం చేశాడు.
ఆ మధుర గానవాహిని రసాతలమంతా మార్మోగింది.
అది విన్న మధుకైటభులిద్దరూ వేదాలను వదిలి ఆ నాదం వినిపిస్తున్న వైపు పరుగులు పెట్టారు.
అప్పుడు హయగ్రీవుడు రాక్షసులు, వేదాలను దాచి ఉంచిన చోటికి వెళ్లి వాటిని తీసుకుని వచ్చి బ్రహ్మకు ఇచ్చాడు.
అక్కడ రాక్షసులకు వేదనాదం చేసిన వాళ్లెవరూ కనిపించలేదు.
వెనక్కి తిరిగి వచ్చి చూస్తే వేదాలు లేవు. వాటిని తీసుకెళ్లింది శ్రీమహావిష్ణువేనని గ్రహించిన వాళ్లిద్దరూ ఆయనతో యుద్ధానికి దిగారు.
ఆ స్వామి రాక్షసులిద్దరినీ సంహరించి మధుకైటభారిగా అందరి స్తుతులందుకున్నాడు.
వేదాలు జ్ఞానానికి చిహ్నాలు, అలాంటి జ్ఞానాన్ని రక్షించి తిరిగి బ్రహ్మకు ప్రసాదించిన అవతారం కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞానానందావతారంగా చెబుతారు.
హయం అంటే గుర్రం.
గర్రుపు తలతో కనిపించే హయగ్రీవుడి రూపాన్ని
ఓ జ్ఞానదీపంగా భావిస్తారు సాధకులు.
గుర్రపు సకిలింతలో ఉన్న
క్లీం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరధ్వని
అశ్వ వేగంలోని యోగ రహస్యంగా గుర్తించారు.
ఇందులో క్లీం అనే అక్షరాన్ని కామరాజ బీజమని కూడా పిలుస్తారు.
యోగమార్గంలో త్వరగా కోర్కెల సాధనకు ఇది గొప్ప సాధకం.
క్లీంలో వినిపించే ‘ఈ’ కారానికి కూడా విశేషముంది.
దీన్ని ‘కేవలా’ అంటారు. కేవలా అంటే మాత్రమే అని అర్థం.
లలితా సహస్రనామంలోని ‘కేవలా’ ఇదేనని చెబుతారు.
సృష్టి మొత్తానికి మూలం ఆమె శక్తి మాత్రమే అని భావం.
అగస్త్య మహర్షి హయగ్రీవుడిని గురించి తపస్సు చేశాడు.
అప్పుడా స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అగస్త్యుడు
లలితా పరమేశ్వరి గురించి వివరించమని అడిగాడు.
అప్పుడు హయగ్రీవుడు అమ్మ సహస్రనామాలను అంగన్యాస కరన్యాస పూర్వకంగా మహర్షికి ఉపదేశించాడు. లోకక్షేమం కోసం లలితా పరమేశ్వరి సంకల్పంతో వీటిని చెప్పినట్లు వివరిస్తాడు.
హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల,
గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు.
హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చుదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట.
హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని
వింటే చాలు వైకుంఠంయొక్క
తలుపులు తెరుచుకుంటాయి.
హయగ్రీవుని పూజించడంవల్ల
విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.
పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.
హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి.
ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.
హయగ్రీవస్తోత్రం
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||
ఫలశ్రుతి
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||