Thursday 29 November 2018

పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు



శ్రీవారి 
తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు  జరిగితే

అమ్మవారికి కార్తిక మాసంలో జరుగుతాయి.

అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి డిసెంబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. తిరుమలలో మాదిరిగానే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

* ప్రారంభానికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ప్రారంభం నాటి ఉదయం తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి అమ్మవారు తిరు వీధుల్లో ఊరేగి ఆలయం చేరుకున్నాక ద్వజారోహణం జరుగుతుంది. ఆ నాటి రాత్రి నుంచి వాహన సేవలు జరుగుతాయి.

* బ్రహ్మోత్సవాల్లో తొలినాటి రాత్రి చిన్న శేషవాహనంపై, రెండోరోజు ఉదయం పెద్ద శేషవాహనంపై అమ్మవారు ఊరేగుతారు.

* అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు అత్యంత ముఖ్యమైన గజ వాహన సేవ జరుగుతుంది. లక్ష్మీదేవి ఏనుగు కుంభ స్థలంలో నివసిస్తూ ఉంటుందని చెబుతారు. తాను నిత్యం నివసించే ఏనుగునే వాహనంగా చేసుకుని ఊరేగే అమ్మవారిని దర్శించడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.

తిరుమల నుంచి సారె...
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.
తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
అయ్యవారు - వేంకటేశ్వరుడు
అమ్మవారు -  పద్మావతీదేవి

ఆమె వ్యూహలక్ష్మి...
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు.

 శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది.

వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం.

శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి.
ఆ సరోవరంలో...
లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు.

మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు.

అలమేలు మంగ అమ్మవారు
పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు.

పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్‌మేల్‌ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి.

తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం.

పంచమీ తీర్థం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్‌ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు..

రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.