Tuesday, 6 April 2021

ఆమె ఎవరు ? ...కధ

 

ఆమె ఎవరు ?


ఆమె ఎవరు ?

భోజనాలు వడ్డించేసాను రండి అందరూ అంటూ పిలిచింది తులసి.
వస్తున్నాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు నరేష్, కూతురు అను.
నరేష్ బాంక్ లో మేనేజర్ .
ఒక కొడుకు, కూతురు.
ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. కొడుకు ఫైనల్ ఇయర్ కూతురు ఫస్ట్ ఇయర్. చాలా సరదా అయిన కుటుంబం.
ఎక్కడ నీ పుత్ర రత్నం ఇంకా కొంప చేరలేదా అంటూ అడిగాడు నరేష్.
మీరు మరీనూ ఏదో కంబైన్డ్ స్టడీస్ అంటూ వెళ్ళాడు వచ్చేస్తాడు అంది తులసి.
ఆ ఆ ఇలా గారం చేసే వాడిని అడ్డగాడిద లా చేసావు .
వాడొచ్చేసరికి ఎంతవు తుందో .
ఏమే నీకు ఏమైనా చెప్పాడా అని అడిగాడు ఏమో నాకు చెప్ప లేదు నాన్నా అంది అమాయకంగా అను .
ఆహా ఏం నటిస్తున్నావే,
ఉట్టి అప్పుడు కొట్టుకు చచ్చిపోతూ వుంటారు.
ఇలాంటప్పుడు ఐకమత్యం పెరిగిపోతూ ఉంటుంది.
ఇద్దరికిద్దరూ తోడుదొంగలే,
నువ్వు వడ్డించు , వాడు వస్తాడు లే అంటూ కూర్చున్నాడు నరేష్.
వడ్డిస్తుంటే వచ్చాడు విజయ్ .
తొందరగా కాళ్ళు కడుక్కుని రారా నీకూ వడ్డించే స్తాను అంది.
సరే అమ్మ ఆంటూ లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు .
ఇంత ఆలస్యమైంది ఏంట్రా అని అడిగాడు నరేష్ .
రికార్డ్ వర్క్ ఉంది , నా దగ్గర మెటీరియల్ లేదు , అందుకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి రాసుకు వస్తున్నాను అన్నాడు .
సరే కానివ్వండి నువ్వు కూర్చో వే ,
అందరం వడ్డించేసుకుందాము అన్నాడు నరేష్ .
ఉండండి అన్నీ సర్దుతున్నానుగా... ఒక్కొక్కటే తేవాలి..
మీ గారాల కూతురు ఒక్క పనికి సాయం రాదు... అంది...
అమ్మా...అంటూ నీలిగింది అను...
పోనీ లేవే చేస్తుంది లే రేపటి నుంచి... అన్నాడు నరేష్...
అలాగే నాన్నా అంది... అను
చూసావా ఎంత బుద్ధి మంతురాలో, చెప్పగానే ఒప్పేసు కుంది... అన్నాడు నవ్వుతూ...
ఇలా ఎన్ని సార్లు అయ్యింది..
ప్రతీసారి రేపటి నుంచి అంటూనే ఉంటుంది...అంది తులసి..
భోజనాలు చేస్తూ ఏరా అబ్బాయి ఎలా సాగుతోంది నీ చదువు అంటూ అడిగాడు నరేష్ .
బాగానేసాగుతోంది నాన్నా ,
ఈ ఏడాది తో అయిపోతే క్యాంపస్ సెలక్షన్ లో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను అన్నాడు విజయ్ .
ఏమిటి తండ్రి కొడుకుల గుసగుసలు అంటూ వచ్చింది , వేడివేడి చారు గిన్నె టేబుల్ మీద పెడుతూ.
ఆ ఏమీలేదు ఈఏడాదితో వీడి చదువు అయిపోతోంది కదా వీడికి పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాను ,
అదే అడుగుతున్నాను అంటూ నవ్వాడు . వీడికి అప్పుడే పెళ్లి ఏమిటి ఇంకా ఉద్యోగం కూడా లేదు . ఏరా నాకు తెలియకుండా ఏదయినా గూడు పుటా ని చేస్తున్నారా అంది .
అదేం లేదు అమ్మా , నాన్న అంతే ఎప్పుడు జోక్స్ వేస్తూ వుంటారు అన్నాడు.
వారం అంతా మీకు కాలేజీ లతో , నాకు బేంక్ తో సరిపోతుంది , కనీసం ఆదివారమైనా అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పానా, ఎన్నిపనులున్నా ఆది వారం పెట్టుకోకండి రా అన్నాడు నరేష్ .
సరే నాన్నా అన్నారు .
ఇంతకీ రికార్డ్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అన్నాడు నరేష్ .
ఇవాళ 30 కదా 1తేదీ న ఇవ్వాలి ఇంకా రెండు రోజులుంది అన్నాడు.
నీ తలకాయ ఇవాళ 31స్ట్ , 30 కాదు చూసుకో , చవటాయి ,
ఇంకో రోజు ఉంది కదాని నిర్లక్ష్యం చేయకు వెర్రిమాలోకం అన్నాడు నరేష్ .
అయ్యో నేను ఇంకా 30 అనుకుంటున్నాను అన్నాడు .
ఎంత పని జరిగింది ,అంటూ
ఇవాళ కూర్చుని రాసేయాలి అన్నాడు . ఏమిట్రా ఎంత పని జరిగింది అంటూ అడిగింది.
అదా వాడు ఇంకా ఇవాళ 30 అనుకుంటున్నాడు 31 అయితే అన్నాడు నరేష్ .
అయితే ఏమిటి టి చెప్పరా అంటూ గద మాయించింది .
వాడు ఒక అమ్మాయి తో లేచి పోదామని అనుకుంటున్నాడు .
రైల్వే స్టేషన్ దగ్గర వుండమన్నాడుట..
ఆ విషయం మర్చిపోయాడుట అన్నాడు నరేష్ కన్నుకొడుతూ,
నీకెలా చెప్పాలో అర్థంకాక ఇద్దరం ఆలోచిస్తున్నాం అన్నాడు విజయ్ .
ఏరా ఎంత పని చేశావురా అంటూ తిట్లు మొదలుపెట్టింది.
అయ్యబాబోయ్ ఊరికే అన్నా అదేం లేదే బాబు
రికార్డ్ వర్క్ గురించి అన్నా అంతే అన్నాడు కంగారుగా,
నేనేదో జోక్ చేసాను అంతే అన్నాడు .
నాకు తెలుసు మీరిద్దరూ ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా ఏమయినా పిచ్చివేషా లు వేశావో మర్యాద గా ఉండదు అంది తులసి..
నువ్వయినా చెప్పవే అంటూ చెల్లెల్ని అడిగాడు విజయ్ .
ఏమో నాకుతెలీ దు ఇందులో నన్ను
ఇన్ వాల్వ్ చెయ్యద్దు అంది అను.
అమ్మ దొంగ శబరి పొద్దున్న నువ్వు అడిగిన 100 ఇవ్వలేదని ఇప్పుడు సైడ్
అయిపోతావా అన్నాడు.
ఇంతలో ఫోన్ వచ్చిందని వెళ్ళింది ఇంటి అడ్రస్ చెప్పి , మాట్లాడివచ్చింది.
ఎవరే ఫోన్ మన అడ్రస్ చెపుతున్నావు అంటూ అడిగాడు నరేష్.
ఆపిల్లే మీరు చెప్పారుగా రైల్వే స్టేషన్ లో ఎదురుచూసి వీడు రాకపోయేసరికి ఫోన్ చేసింది.
ఇంటి అడ్రస్ ఇచ్చాను . వస్తోంది .
మీరు భోజనాలు కానియ్యండి .
కంగు తిన్నారు అందరూ.
అమ్మా నువ్వు కూడా ఏమిటి అన్నాడు విజయ్ దీనంగా.
ఏమో నాకేం తెలుసు, వస్తోందిగా దాని సంగతి నీ సంగతి తేలుస్తాను అంటూ భోజనం ముగించింది.
విజయ్ గాభరాగా భోజనము ముగించి రూమ్ లోకి పారిపోయాడు.
ఎవరై వుంటారబ్బా , నాన్న జోక్ గా అంటే అమ్మ ఇలా అంటోంది.... నీకు ఏమైనా తెలుసా ఏమిటి అని చెల్లెల్ని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అంది.
నీవంద కోసం నన్ను ఇబ్బంది పెట్టకే కనుక్కునిరా అంటూ వంద చేతి లో పెట్టాడు. ఇప్పుడు రెండు వందలు రేటు మారింది. అంది.
నా బలహీనతను అడ్డు పెట్టుకుని blackmail చెయ్యకే, నీ కు దణ్ణం పెడతాను. ఇస్తాలే ముందు వెళ్లి విషయం కనుక్కుని రా అంటూ గదిలోనుంచి తోసాడు.
అబ్బా వెళతాను వుండరా బాబు అంటూ బయటకు వచ్చి ,
నాన్నా నీకు ఏమైనా తెలుసా అంది.
నాకూ అదే డౌట్ గా ఉంది .
మనం సరదాగా అన్న మాటలు వీడు నిజం చేస్తున్నాడా అని.
ఛ ఛ ...అన్నయ్య అలాంటి వాడు కాదు నాన్నా అంది .
మరి విషయం నాకూ తెలియదు.
ఏదో జరుగుతోంది. రానీ ఆ అమ్మాయిని నిజంగా వస్తే అప్పుడు చూద్దాం.
మీ అమ్మ కూడా నాలా జోక్ వేసిందేమో అన్నాడు.
అవును నాన్నా అదీ నిజమే అంది .
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.
పరిగెత్తుకు వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా అందమైన అమ్మాయి బ్యాగ్ తో నిలబడి ఉంది.
నరేష్ గారి ఇల్లు ఇదేనాండి అంది.
షాక్ అయ్యిపోయింది చెల్లెలు.
అవును రండి లోపలికి అంటూ పక్కకి తప్పుకుంది.
నాన్నోయి నిజంగా నే వచ్చేసింది.
అంటూ లోపలికి పరిగెత్తింది.
అందరూ హాల్లో కి వచ్చారు.
నమస్కారమం డి అంటూ కాళ్లకు దణ్ణం పెట్టింది.
నరేష్ షాక్ లో వున్నాడు ఆ అమ్మాయితో అలా సోఫా లోకూర్చో అంటూ చూపించాడు. ఎంతపనిచేశావురా నువ్వుజోక్ అన్నావు ఇప్పుడు చూడు నిజంగా వచ్చేసింది అన్నాడు.
నాకేం తెలియదు నాన్నా ,
అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఒట్టు అన్నాడు ఇంచుమించు ఏడుపు మొహం తో .
ఒట్టా , గాడిదగుడ్డా ఎదురుగా కనబడుతుంటేను , నిజం చెప్పరా.
ఎవరు ఆఅమ్మాయి . అన్నాడు. నిజంగా నాకేం తెలియదు నాన్నా , నన్ను నమ్ము అంటూ మొర పెట్టుకున్నాడు.
వాడు అలాగే అంటాడు గానీ ముందు భోజనం పెట్టు ఎప్పుడు తిందో ఏమో పాపం .
మిగతావిషయాలు తరువాత చూసుకుందాం అన్నాడు నరేష్.
విజయ్ మేడ మీదకు పారిపోయాడు.
నువ్వు పెట్టవే అంటూ కూతురికి పురమాయించి కోపంగా తనగదిలోకి వెళ్లి పోయింది తులసి.
అను నువ్వు చూడు తల్లీ ఆ విషయం .
మీ అమ్మ చాలా వేడి గా ఉంది అని అన్నాడు నరేష్.
అలాగే అంటూ నువ్వురా వదినా అంటూ తీసుకెళ్లింది.
వీడెక్కడికి పోయాడు అంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు.
మేడమీద వున్నాడు .
వెళ్లి ఒక్క సిగరెట్టు వెలిగించి గట్టిగా పీల్చి వదిలాడు.
పక్కకు వచ్చి కూర్చున్నాడు.
ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు , ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నాను అన్నాడు నరేష్.
నిజం నాన్నా నాకు ఏమి తెలియదు మీరేదో అమ్మ మీద జోక్ వేస్తే ఇంకాస్త ఏడిపిద్దామని నేనూ వంత పాడా ను.
ఇంతకుమించి నాకు ఏమీ తెలియదు.
అని అన్నాడు విజయ్ .
మరి నీకు తెలియకుండా మన ఇంటికి ఎలా వచ్చింది చెప్మా అన్నాడు.
అదే నాకూ అర్థం కావట్లేదు అని అన్నాడు దిగులుగా.
సరేలే చూద్దాం కిందకి రా అంటూ సిగరెట్టు పారేసి ఇద్దరూ కిందకి వెళ్లారు అనూ ని పిలిచాడు.
ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందా అన్నాడు. లేదు నాన్నా ఎంత అడిగినా ఏమీ మాట్లడలేదు.
నా గదిలో రెస్ట్ తీసుకుకోమన్నాను అంది.
ఇంతలో పక్కింటి పంకజం వచ్చింది .
తన కూతురిని విజయ్ కి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఏదో వంకతో ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది.
వదినా, వదినా అంటూ పిలిచింది.
మీ అమ్మ లేదా అల్లుడూ అంది.
ఛ.... అలాపిలవకండి, నాకు చిరాకు ,
అంటూ అమ్మా అంటూ అరిచాడు తులసి బయటకు వచ్చింది.
కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తావా వదినా మళ్లీ రేపు ఇచ్ఛేస్తాను అంది.
లోపలికి వెళ్ళి తీసుకువచ్చి ఇచ్చింది.
అది తీసుకుంటూ ఈ ఏడాది పెళ్లి చేసేస్తారా మీవాడికి అంటూ అడిగింది.
ఇప్పుడు అదొక్కటే తక్కువ మీరు వెళ్ళండి ఇబ్బందిగావుంది అంటూవిసుక్కున్నాడు. అల్లుడికి చిరాకు ఎక్కువ అంటూ నవ్వింది. ఛీ దీనమ్మ జీవితం అంటూ తనని తాను తిట్టుకున్నాడు.
ఇంతలో పక్కింటి అచ్యుత్ వచ్చాడు.
ఏమోయ్ నరేష్ ఎవరో అమ్మాయి వచ్చింది మీ బంధువులా అంటూ అడిగాడు లోపలికి తొంగి చూస్తూ...
అవును అవును , కాదు కాదు అంటూ తడబడ్డాడు నరేష్.
అవునంటావు, కాదంటావు, ఇంతకీ అవునా, కాదా చెప్పవోయి అన్నాడు అచ్యుత్. బంధువులే అంకుల్ అంది అను,
మధ్యలో కల్పించుకుని.
మరి హుషారు గా ఉండక అలా
ఉన్నారేమిటి , మీ వాడు ఎవరినో లేపుకు వచ్చినట్లుగా , కొంపతీసి అలాంటి వ్యవహారమేదైనా నడిపాడా మీ వాడు.
అబ్బెబ్బే అల్లాంటిది ఏమి లేదు.
ఆ అమ్మాయి మా బంధావుల అమ్మాయి అన్న మాట.
ఇవాళ వచ్చింది అన్న మాట ...ఆదన్న మాట.. అన్నాడు నరేష్.
ఇంతకీ ఎందుకు వచ్చినట్టో అన్నాడు గది వైపుకు అనుమానంగా చూస్తూ.
మీకు అక్కర లేని విషయం లేదు కదా ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చిందన్న మాట అన్నాడు నరేష్.
అందుకు అంటే ఎందుకో అన్నాడు అచ్యుత్.
ఇంక మమ్మలిని ఆలోచించుకొనివ్వరా.
అయినాఎందుకు చెప్పాలి మీకు చెప్పం , నాకు కోపం వచ్చింది , నేను అలిగాను అని అన్నాడు నరేష్.
నువ్వు బుంగ మూతి పెడితే బాగుండ దోయ్ నరేష్... అన్నాడు
ఈ చమత్కారాలకేమి తక్కువ లేదు... అన్నాడు నరేష్.
చెప్పకపోయినా పరవాలేదు , ఏదయినా గోడవేమో సాయం చేద్దామని వచ్చాను. అన్నాడు అచ్యుత్ .
మీసాయాని కి ఓ దండం ఇక బయలుదేరండి సార్ అన్నాడు నరేష్.
అలాంటి వ్యవహారేమయినా ఉంటే చెప్పు విజయ్ ఇట్టే సెటిల్ చేసేస్తాను వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఓప్పించేద్దాము.
ఈ రోజుల్లో ఇదంతా మోస్ట్ కామనూ అంటూ
సాగ దీసాడు.
బాబూ అలాంటిది ఏమీ లేదు మీరు బయలుదేరండి అంకుల్ అంటూ భుజం మీద చెయ్యి వేసి బయటకు తీసుకునివచ్చి వదిలేసాడు విజయ్.
లోపలికి వచ్చి అమ్మా ...నీకు దణ్ణం పెడతానే, నిజం గా నాకేం తెలియదు,
ఏదో సరదా గా నాన్న అంటే ,
నేను వంత పాడి కామెడీ ఎక్స్టెండ్ చేసాను.
అది ఇలా నా పీకల మీదకు వస్తుంది అనుకోలేదు .
ఇంకెప్పుడూ నీ మీదజోకులు వేయను , క్షమించు, అంటూ బతిమాలాడు.
తులసి సీరియస్ గా నరేష్ వైపు చూసింది.
దండం పెట్టాడు నేను కూడాఅంటూ.
అప్పుడు ఆమె ముఖం లో నవ్వు వచ్చింది. అదీ అలా రండి దారికి .
అమ్మ అంటే ఆట బొమ్మ కాదు , లాలించడమే కాదు తోలు తీయడం కూడా తెలుసు అంటూ
అమ్మా శైలజా అంటూ పిలిచింది.
ఆ ఆంటీ వస్తున్నా అంటూ బయటకు వచ్చింది.
పిలిచారా ఆంటీ అంటూ అడిగింది.
ఇది శైలజ అని నా చిన్న నాటి స్నెహితురాలి కూతురు.
ఈ ఊరిలో ఏదో పరీక్ష ఉంది అంటే వచ్చింది. మీరు నన్ను ఆట పట్టిస్తుంటే ,
అదే సమయానికి ఫోన్ వచ్చింది.
అంతే ఫోన్ లోఅన్నీ చెప్పి ఇలా ఆక్ట్ చేయించాను, అంది నవ్వుతూ .
నన్ను క్షమించండి అంకుల్ ,
ఆంటీ చెపితే నే ఇలా చేసాను అంటూ చెవులు పట్టుకుంది .
అదేం పరవాలేదు అమ్మా,
మాఇంట్లో జోకులు అలవాటే గానీ,
మా ఆవిడ ప్రాక్టికల్ జోక్ వేసేసరికి షాక్ అయ్యాము అంతే.
మొత్తానికి భలే గడుసుదానివి బోండాం అంటూ తులసిని పొగిడాడు.
పిల్ల ల ముందు బొండాం అనొద్దని చెప్పానా అంటూ మూతి ముడిచింది .
అందరూ నవ్వుకున్నారు.
బ్రతికానురా దేవుడా అంటూ విజయ్ అక్కడ నుండి జారుకోబోయాడు.
ఒరేయ్ విజయ్ రేపు కాస్త ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్ష రాయించి తీసుకు రా అర్థమయ్యిందా అంది తులసి.
అలాగే అమ్మా అంటూ జారుకున్నాడు. అనూ తనని లోపలికి తీసుకుని వెళ్ళు అంది తులసి.
రా శైలూ అంటూహుషారుగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లింది. అమ్మాయి బాగుంది, పైగా మీ ఫ్రెండ్ కూతురు అంటున్నావు.
మనవాడికి ఇచ్చిచేస్తే ఎలా ఉంటుంది అన్నాడు నరేశ్.
ఆ మాటే నా ఫ్రెండ్ కూడా అడిగింది. బాగా చదువుకుంటోంది, చాలా నెమ్మదస్తురాలు.. పైగా నా ఫ్రెండ్ కూతురు, నాకూ మనసులో
ఆ ఉద్దేశ్యమే ఉంది... కానీ ఇంట్లో అందరూ ఒప్పుకోవాలిగా...
అందుకే పరీక్ష ఉంది అంటే మన ఇంటికి పంప మన్నాను, మీరు అందరూ కూడా చూస్తారని అంది నవ్వుతూ.
నాకేమీ అభ్యంతరం లేదు.
వాడికా ఇంక ఇప్పుడప్పుడే నీ మాటకి ఎదురు చెప్పే దైర్యం రాదు .
నీ ఇష్టం అలాగే కానీ అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన అను,
వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అన్నయ్యకి ఇచ్చి చేసేయ్ అమ్మా అంది హుషారుగా.
ఆగండి ఆగండి ముందు వాడి చదువు అవ్వాలి,
ఉద్యోగం లో చేరాలి అప్పుడే పెళ్లి. అప్పటివరకు ఎదురు చూడమను
మీ ఫ్రెండ్ ని అన్నాడు నరేష్.
సరే మీ ఇష్టం ,
మీరు ఎలాగంటే అలాగే
అంది తులసి.
చేసిందంతా చేసేసి , చివర్లో నా ఇష్టం అంటోంది చూసావా మీ అమ్మ తెలివితేటలు అంటూ నవ్వాడు.
ఆ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. ....

శుభం...
ఇందులో పాత్రలు ,కధ, కధనం , అంతా కల్పితం... ఎవరినీ ఉద్దేశించినది కాదు...