శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది.
హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. 'శి' అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, 'వ' అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి.
శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం.
విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూతి ధరించిన
వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలకు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన ఆవు పేడను ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జప, తపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయాలి అని శాస్త్రము చెబుతుంది. ఈ కాలములో అలాగ చెయడం వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండె , నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు.
త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధారణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు. ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది. మహి మాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా చేత్తోపట్టుకుని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని 'శాంతికము' అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు. భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.
యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచ్చిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండములో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుబ్రమైన పాత్రలో విభుతిని నింపబడుతుంది.
బిల్వ పత్రం: శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
బిల్వపత్రం కోయకూడని రోజులు: బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి తీయకూడదు. ముక్క పోయిన ఆకులను పెట్టకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి.
కుంకుమ వద్దు: శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధంను మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్నిచ్చే గంధంను ఉపయోగించాలి.
కొబ్బరినీళ్లు వద్దు: కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు.
ఏ పండ్లు సమర్పించాలి? శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్షాయుష్షుని సూచిస్తుంది.
ఇలాంటి పూలు వద్దు: సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లో సమర్పించరాదు. శివుడికి వాటికి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూవులను అడుగుతాడు. దీంతో, బ్రహ్మను, సంపంగి ఇద్దరినీ పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు.
స్టీల్ స్టాండ్ : శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు. ఒకవేళ మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే, జలధార కంపల్సరీ ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా, శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.
పూజించే విధానం: శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు.తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు. శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. సూర్యోదయం సమయంలో ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందవచ్చు.
మంత్రం: పూజలు చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి