" మంచి మనసులు "
" ఏమండీ అబ్బాయి ఏమైనా ఫోన్ చేశాడా "
అంది శాంత.
" లేదే వాడేదో బిజీ గా ఉన్నట్లు ఉన్నాడు... "
" లేకపోతే వాడే చేసే వాడుగా "
అన్నారు రావు గారు.
" పోనీ మీరైనా ఒకసారి చేయొచ్చు గా ,
వాడికి ఖాళీ లేక మర్చిపోతే " అంది..శాంత
" అలాగే లే ,
ముందు నాకో కాఫీ ఒకటి ఇవ్వు " అన్నారు రావు
సరే అంటూ లోపలికి వెళ్ళింది శాంత
" దీనికి ఏం తెలుసు,
నేను వాడికి ఎన్ని సార్లు ఫోన్ చేశానో..
ఒక్కసారి కూడా పలకడు...
పైగా ఫోన్ చేస్తే బిజీ గా ఉన్నా ,
మీటింగ్ లో ఉన్నా అంటూ ,
తరువాత చేస్తా అంటూ విసుక్కుంటున్నాడు..
ఖాళీ అయితే నేనే చేయనా
ఇలా అస్తమాను డిస్టర్బ్ చేయకండి అన్నాడు
అని దీనికి ఎలా చెప్పను...
బాధ పడుతుంది ."..అనుకున్నారు మనసులో...
కాఫీ పట్టుకుని వచ్చింది
" ఈ సారి ఫోన్ చేస్తే ,
ఒక్కసారి వచ్చి వెళ్ళమని చెప్పండి
చూసి రెండు సంవత్సరాలు అవుతోంది.. "
అంది ఆర్తిగా...
" నీ బాధ నేను అర్థం చేసుకోగలను ..
కానీ వాడు అర్ధం చేసుకోవాలి గా...
ఎంత సేపు బిజి అంటాడు.."
అనుకుని
" సరేలే నేను చెబుతా...
నువ్వేమి ఇవేమీ ఆలోచించకు
నీ ఆరోగ్యం కూడా అంత బాగోలేదు..
మళ్ళీ బెంగ పెట్టుకుంటే అదో సమస్య.. "
అన్నారు రావు
" వృద్దాప్యం వచ్చేసింది...గా
పోయే ఆరోగ్యం గాని వచ్చేది కాదుగా ..
ఏవో ఉంటూనే ఉంటాయి..." అంది..
అబ్బో దీనికేం తక్కువ లేదు...
అనుకుని
కాఫీ తాగేసి కప్ ఇచ్చారు...
" నిజానికి వాళ్ళ తప్పు ఏమి ఉండదు... "
" బాగా చదువుకోవాలి
మంచి ఉద్యోగం చేయాలి
బాగా స్థిరపడాలి అనేగా
కష్టపడి చదివిస్తాం..."
" బాగా చదువు కున్నాక..
మరి పట్నాలలో నేగా ఉద్యోగాలు...
మరి అంతంత జీతాలు ఇస్తూ
వాళ్ళు ఉరుకుంటారా ...
దానికి తగ్గ పని చేయించుకుంటారు...
మరి.."
" అన్ని మనమే అనుకుంటే ఎలా
పరిస్థితులు అర్ధం చేసుకుని అలవాటు చేసుకోవాలి... దీని తాపత్రయం దీనిదే గాని...
మరి దీనికి ఎప్పుడు అర్ధం అవుతుందో... మరి " అనుకున్నారు స్వగతం గా...అలా పడకుర్చీ లో వెనక్కి వాలి కళ్ళు ముసుకుని..రావుగారు
" ఏది ఏమైనా కనీసం 3 నెలలకి ఒకసారి ..
అయినా కాస్త ముఖం చూపిస్తే ..
కాస్త సంతృప్తి గా ఉంటుంది..
మనవలు పెద్దవాళ్ళు అయి పోతున్నారు... వాళ్ళతో కాస్త సరదాగా గడిపే సమయము
వస్తుందో రాదో... "
అంటూ ఆలోచిస్తూ అలాగే
నిద్రలోకి జారి పోయారు రావు...
****
రమేష్ పెద్ద కార్పొరేట్ కంపెనీ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు..
కష్ట పడి పనిచేసే తత్వం కావడం తో తొందరగా నే ప్రమోషన్ లు వచ్చేసాయి...
ఇపుడు కీలకమైన పొజిషన్...
పని వత్తిడి ఎక్కువ కావడంతో అలాగే రోజులు గడిచిపోతున్నాయ్...
ఇలా ఉండగా ఒకరోజు తన కూతురు వచ్చింది.. " "నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంది ."
లాబ్ టాప్ లోంచి తల ఎత్తి
" ఏం మాట్లాడాలి " అన్నాడు రమేష్..
" మా కాలేజ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాలి అంటున్నారు.."
" అలా వెడితే ఆ మార్కులు కూడా కలుస్తాయి ట" అంది శైలు..
"ఇపుడు అవసరమా ,
ఏదో చెప్పి మేనేజ్ చేయలేవా "
అన్నాడు రమేష్..
" తప్పదు లేకపోతే నేనే మానేసే దాన్ని... "
అంది శైలు
" ఎన్నాళ్ళు .." అన్నాడు రమేష్
" ఒక వారం " అంది శైలు
" అమ్మో అన్నాళ్లే..
మరి ఏర్పాట్లు " అన్నాడు రమేష్
" అన్ని వాళ్లే చూసుకుంటారు..
పైగా ఈ పక్క ఉరే..
కానీ ప్రాజెక్ట్ కోసం అక్కడే స్టే చేయమంటున్నారు.." అంతే అంది..
" మరి మీ అమ్మని ఆడిగావా" అన్నాడు రమేష్..
" ఆ , నిన్నే అడగమంది..
" నువ్వు ఒప్పు కుంటే సరే అంది... " అన్నది శైలు..
" సరే , డబ్బు కావాలంటే అమ్మని అడుగు .."
"కానీ జాగ్రత్త.. రోజు ఫోన్ చేయాలి ..సరేనా "
అన్నాడు రమేష్..
సరే నాన్న అని అమ్మకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది..
" అమ్మా నాన్న సరే అన్నారు.. "అంది..
" సరే ఆ ఏర్పాట్లు చేసుకో.
జాగ్రత్తగా ఉండాలి ..అర్ధం అయిందా.. "
అంది తల్లి ..
సరేలే అమ్మా అంటూ లోపలికి వెళ్లి ఏర్పాటు చేస్కోసాగింది...
" ఏమండీ మీరు ఊరు వెళ్లమన్నారు ట కదా "
అంది ఇందు...
" అవును తప్పదు ట...
జాగ్రత్తగా వెళ్లి వస్తుంది లే...
అయిన ఒకసారి వెళితే గాని స్వతంత్రం గా ఆలోచించడం రాదు..
ఎంత సేపు మనమే కూడా ఉంటే ఎలా నేర్చుకుంటారు
అన్నీ నేర్చుకోవాలి..
మనం
" వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం " నేర్పించాలి...
" ఏమి పరవాలేదు పంపించు..."
" కాకపోతే రోజూ కాస్త వేళకు తింటోందో లేదో కనుక్కో చాలు "
అన్నాడు రమేష్..
ఆ మరునాడు శైలు కాంప్ కి వెళ్ళింది...
రెండు రోజులు బాగానే గడిచాయి రమేష్ కి తరువాత మొదలయింది
కుతురి మీద బెంగ
ఇంతకాలం ఒంటరిగా ఎక్కడికి పంపలేదు ..
ఇంటికి వస్తే ఏదో వెలితి ...
ఒక్కోరోజు భారంగా గడుస్తోంది...
పాపం రమేష్ కి ..
" కానీ తప్పదు ..అలవాటు చేసుకోవాలి " అనుకున్నాడు...
మరునాడు తన స్నేహితుడు విశ్వం తో
ఇదే విషయాన్ని పంచుకున్నాడు...
" అదేమిటి రమేష్ ,
రేపు దానికి పెళ్లి అయితే ఎలా ..
ఆడపిల్ల అన్నాక తప్పదు గా అత్తవారింటికి పంపించాలి.. "
"పైగా ఇపుడు, ఆడ ఏమిటి మగ ఏమిటి అందరూ ఉద్యోగ కారణం తో ,
తల్లిదండ్రులు కు దూరంగానే ఉంటున్నారు...
ఎవరి దాకా ఎందుకు
మనం లేమా....
ఎన్నాళ్ళు అయింది రా
మీ తల్లిదండ్రులు దగ్గరకు వెళ్లి..
గట్టిగా కార్ లో కొడితే 3 నుంచి నాలుగు గంటల ప్రయాణం...
ఆ కాస్త ఖాళీ కూడా చేసుకోలేకపోతున్నాం...
మన పిల్లల దాకా వచ్చే సరికి
మనం తల్లిదండ్రులు గా ఫీల్ అయిపోతున్నాం... మన తల్లిదండ్రులు కి మనం కూడా పిల్లలమే గా ...వాళ్ళకి కూడా మనలాగే ,
మనలని చూడాలని ఉంటుంది గా ..
పాపం బెంగతో ,
మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని
వాళ్ళ ఫీలింగ్స్ అన్ని
లోపలే అణగ తొక్కు కుని
ఏరోజుకైనా రాక పోతామా అని ఎదురుచూస్తు ఉంటారు.."
" ఈ మాటలు మనసుకి కఠినం కలిగించే విషయం అయినా ఆలోచించ వలసిన విషయం.."
" ఈ స్పీడ్ ప్రపంచంలో పడి మనం
ఎంత తప్పు చేస్తున్నామో గ్రహించలేక పోతున్నాం.. చదువులు చెప్పించారు
ఇంత జీవితాన్ని ఇచ్చారు
ఆఫ్టర్ఆల్ వాళ్ళు మన నుంచి ఎక్సపెక్ట్ చేసేది
" ఒక ప్రేమ పూర్వక పలకరింపు... "
" మనతో కలిసి కొంత సమయం గడిపే అవకాశం..." " ఎందుకంటే చిన్నప్పటి నుండి
మన మీదే అన్ని పెట్టుకుని పెంచారు గా ,
అంటే
ఇపుడు మనం మన పిల్లలని పెంచుతున్నట్లు గా...
" అదే ప్రేమ కదా ఎక్కడైనా , ఏ తరానికైనా..."
అన్నాడు విశ్వం..
" రేపు మన పిల్లలు
ఇదే చూసి నేర్చు కుంటారు
అపుడు మనం తట్టు కోగలమా.. " అన్నాడు విశ్వం
" అవును నిజమే , ఆలోచిస్తూ ఉంటే గుర్తుకు వస్తోంది..
నేను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో...
పాపం నాన్న చాలా సార్లు ఫోన్ చేశారు..
కానీ ఏదో టెన్షన్ వలన సరిగ్గా ఆన్సర్ చేయలేక పోయాను..
పైగా నేనే ఫోన్ చేస్తానని విసుక్కున్నా...
నిజానికి ఆయన ఎంత ఆపేక్ష తో చేశారో...
పాపం అమ్మ కూడా
ఎదురు చూస్తూ ఉంటుంది కదా
నా పలకరింపు కోసం...
" జీతం ఇచ్చే వాడికి జీవితం ఇచ్చేస్తున్నాం
కానీ జీవితం ఇచ్చిన వాళ్లకోసం కొంత సమయం కేటాయించ లేక పోతున్నాం... "
పిల్లలు " బాగున్నావా , తిన్నావా అని
పలకరిస్తే చాలు ,బోలెడు సంబరపడిపోతారు."
అలాంటి పలకరింపు కోసం ఎదురు చూపులు
చూసే ఖర్మ వాళ్ళకి రాకూడదు..
వాళ్ళకి ఇక ఇలాంటి పరిస్థితి రాకుండా
నేను ఇవాళ్టి నుండి చూసుకుంటా..
ఈ పండగకి మా ఊరు ,భార్య ,
పిల్లలతో వెడతా ..
ఈ రెండు రోజులు మా అమ్మ నాన్న లతో హాయిగా గడువుతా...
ఉద్యోగం ఎంత అవసరమో ,
వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించడం
మన బాధ్యత అని తెలుసుకున్నా రా ,
మరి నే వస్తా...రా విశ్వం "
అన్నాడు రమేష్...
" ఆ మార్పు ఏదో , ఈ క్షణం నుండి
మొదలు పెట్టరా " ..అన్నాడు విశ్వం..
అదెలా రా అన్నాడు రమేష్..
అది కూడా నేనే చెప్పాలా..
" ఫోన్ కొట్టు మీ నాన్నగారికి...."
అన్నాడు విశ్వం..నవ్వుతూ
" ఓహ్ ..నిజమేగా ... ఇపుడే చేస్తా "
అంటూ ఫోన్ చేసాడు..
ఉత్సాహంగా చిన్నపాటి ఉద్వేగం
నాన్న ఏమంటారో అని ...
రావు గారు ఫోన్ తీశారు..
హలో ఎవరు అన్నారు...
నాన్న గొంతు వినగానే ,
రమేష్ కి గొంతులో ఏదో తీయని బాధ
మాట రావట్లేదు రమేష్ కి ..
కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి...
గొంతు గద్గద మైంది...
ఎవరూ ఫోన్ చేసి మాట్లాడరేమిటి
అని మళ్ళీ అడిగి ,
కళ్ళజోడు పెట్టుకుని పేరు చూసారు ..
అబ్బాయ్ రమేష్ అని ఉంది...
ఆనందం తో ఆయన కళ్ళు మెరిసాయి
ఒసేయ్ శాంతా అబ్బాయి ఫోన్ ,అని అరచి
ఫోన్ చేసి మాట్లాడవేరా
అంతా బాగానే ఉంది గా..
కోడలు పిల్లలు బాగున్నారా
అని ప్రశ్నల వర్షం కురిపించారు..."
ఇంతలో
" ఒసేయ్ ఎక్కడ ఉన్నావ్
అబ్బాయి ఫోన్ అంటూ ఆనందం గా మళ్ళీ అరిచారు... "
ఆ ఆ వినబడింది లెండి ,
వస్తున్నా అంది శాంత...
నాన్న మాటల్లో ఆనందం వినిపిస్తోంది రమేష్ కి
" ఈ మధ్య దానికి వినికిడి కొంచెం మందగించింది రా వృద్ధాప్యం కదా ...డాక్టర్ కి చూపిస్తా అంటే నాకేమి చెముడు లేదు ,కొంచెం వినబడదు అంతే అంటుంది పిచ్చిది.. "
అంటూ తన ధోరణి లో ఆనందం గా మట్లాడేస్తున్నారు రావు గారు
" నాన్నా.."
అన్నాడు రమేష్ మొత్తానికి గొంతు పెగుల్చు కుని
" చెప్పరా నాన్నా "
అన్నారు..రావు గారు
" నన్ను క్షమిచగలరా " అన్నాడు ...రమేష్
" అదేమిట్రా
ఏదేదో మాట్లాడు తున్నావ్
నిన్ను క్షమించడము ఏమిట్రా..
నువ్వు అసలు ఏమి తప్పు చేశావని "
అన్నారు ఆప్యాయంగా..
" పనులు వత్తిడి వలన రాలేక పోయా
కనీసం ఫోన్ కూడా చేయలేదు
మీకు నా మీద కోపం లేదా"
అని అడిగాడు... రమేష్
ఆఫీసు అన్నాక సవా లక్ష పనులు ఉంటాయి .."
అవి అన్ని చూసుకునే అప్పటికి
నీకు బహుశ ఖాళీ లేదేమో ..
దానికే అంత ఫీల్ అవ్వాలా " అన్నారు...రావు గారు
అందుకే మీరు " తల్లిదండ్రులు " అయ్యారు..
" క్షమా హృదయం మీది... "
" రేపే నేను బయలుదేరి వస్తున్న "
" ఈ పండగ మీదగ్గరే జరుపుకుంటా.. "
ఈ పండగే కాదు ఇక ఎపుడు అవకాశం దొరికినా మీతోనే గడపడానికి సమయం కేటాయిస్తా...
అమ్మకి ఒకసారి ఇవ్వండి "
అన్నాడు... రమేష్
" ఇదిగో అబ్బాయి నీతో మాట్లాడుతాడుట.."
ఇదిగో ఈ చెవిలో పెట్టుకొని మాట్లాడు ,ఆ చెవి నీకు సరిగ్గా వినబడదు అన్నారు రావు గారు..
నాకు తెలుసు లెండి ...అంటూ
" ఏరా అబ్బాయ్ ఎలా ఉన్నావ్ ,
వేళకి తింటున్నావా లేదా..."
అని అడిగింది ఆప్యాయంగా
అమ్మవి కదా కొడుకు ఆకలి పట్టించుకున్నావ్...
నేనే మొద్దు గాడిని ,
స్పీడ్ ప్రపంచపు మాయలో పడి మిమ్మలిని పట్టించుకోలేదు...క్షమించవే అన్నాడు రమేష్..
అంత మాట అనకు రా అబ్బాయ్ ,
నాకు ఏడుపు వచ్చేస్తుంది... అంది...శాంత
వద్దు తల్లీ ఇప్పుడు నువ్వు టాప్ తిప్పకు...
నీకు దండం పెడతాను...అన్నాడు రమేష్
చిన్నప్పడు ఎప్పుడు అలా అనగానే నవ్వేసేది ఆవిడ...
పోరా నువ్వు ఏమి మారలేదు.. అంటూ నవ్వేసింది..
అన్నట్టు నేను ,
మీ కొడలు , మనవలు తో
రేపు వస్తున్నానే ,
ఆ విషయం చెపుదామని ఫోన్ చేశా ..."
అన్నాడు రమేష్..
" చాలా సంతోషం రా..
జాగ్రత్తగా వచ్చేయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం"
అని పెట్టేసింది ఫోన్.
రమేష్ ఆనందం గా ఇంటికి బయలుదేరాడు..
ఆ పండగ అందరితో సంతోషంగా గడిపాడు..
పిల్లలు తాత , బామ్మ గారి తో సంతోషం గా గడిపారు..
శాంత ,
వాళ్ళకి బోలెడు కథలు చెప్పింది...
వాళ్ళు ఆమెతోనే పడుకున్నారు ...
ఆ రెండు రోజులు...రెండు క్షణాల్లా గడిచిపోయాయి...
బయలుదేరే సమయం వచ్చింది ...
" నాన్నా ఇక్కడ చాలా బాగుంది,
నానమ్మ , తాత గారు లు బోలెడు కబుర్లు, కథలు చెప్పారు... "
" ఇలాంటి అనుభూతి ఇంతకు ముందు ఎన్నడూ లేదు..."
"మళ్ళీ ఇక్కడికి ఎపుడు వస్తాము "
అంది శైలు..
మళ్ళీ నెలలో సెలవులు వస్తాయి గా
అపుడు మళ్ళీ వద్దాం అంటూ
తల్లిదండ్రులు దగ్గర
ఆశీర్వాదం తీసుకొన్నారు..
ఆనందంగా...
మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం అంటూ బాయ్ చెప్పారు రావు గారు శాంత..
" అందరివి మంచి మనసులే ,
కానీ పరిస్థితులు లని అధిగమించి
మన ప్రేమ వాళ్ళని చేరగలిగితే ...
అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు..."
" ఉన్నంత కాలం వాళ్ళు ఉండరు...
ఆ తరువాత కావాలన్నా దొరకరు "
తల్లిదండ్రులు విలువ కట్టలేని
అమూల్యమైన సంపద "
" వాళ్ళు ఉన్నంత కాలం
వాళ్లకోసం వాళ్ళకి కావలిసిన
సమయాన్ని ,ఆనందాన్ని
వాళ్లకి ఇచ్చేద్దాం "
వాళ్ల ఎదురు చూపులు ,
" ఎండమావులు "
కాకుండా చూసుకునే బాధ్యత మనదే..."
అలా చూసుకొనే అందరికి ,
నమః సుమాంజలి తో
మీ రచయిత
ఆచంట గోపాలకృష్ణ
ఇది కేవలం కల్పిత కధ
పాత్రలు , కధ , కథనం అంతా కల్పితం
ఎవరిని ఉద్దేశించినది కాదు..
కధ కోసం పాత్రల చేత అలా ప్రవర్తిచేలా రాయడం జరిగింది.