శ్రీమహాలక్ష్మి దండకము
శ్రీమన్మహాలక్ష్మి శ్రీదేవి శ్రీరంగ
ధామేశ్వరీ! శ్రీకరీ మాధవీ హేమ
రూపంధరీ లోక రక్షాకరీ పూజ్య
నారాయణీ పద్మసింహాసినీ దేవి
క్షీరాబ్ది కన్యామణీ శ్రీరమా దేవి
శ్రీవత్సుఁ బెండ్లాడి శ్రీలక్ష్మి వైతీవు
శ్రీవిష్ణు వక్షస్స్థలమ్మే నివాసంబుగా
శేషతల్పంబుపై నున్న మాతల్లి
దారిద్ర్య దుఃఖమ్ము దీర్చంగ రావమ్మ
నీరాక తో జన్మ ధన్యంబు మాకమ్మ
ఏరీతిఁబూజింతు నేరీతి సేవింతు
నీదివ్య రూపంబు నిత్యంబు పూజింతు
శుభ్రమ్ము గానున్న నన్మెత్తు వీవంట
శీఘ్రమ్ము సంపత్తి నీవీవె మాకంట
కష్టాలు దీరంగ నైశ్వర్య మీరావె
పద్మాలు నేఁదెచ్చి పూజింతు నోతల్లి
పచ్చంగ చేనంత పండించు మాలక్ష్మి
మందార పుష్పాల పూజింతు నోతల్లి
ముత్తైదు సౌభాగ్య మీవమ్మ మాలక్ష్మి
పద్మమ్ము లీ ముగ్గులన్ జూడఁగా లక్ష్మి
పారాణి పాదాలు మోపంగ మాయింట
నీదివ్య హస్తంబు చూపించు చాలంట
నీపాద మానించ మోదంబు మాతల్లి
నట్టింట నాట్యంబు నాడంగ మాలక్ష్మి
నీరాజనాలిచ్చి పూజింతు నో తల్లి
ముత్యాలహాసాలు మాకివ్వు మాతల్లి
సౌభాగ్య మీవమ్మ సౌభాగ్య మీనాక్షి
సంతాన శంపాంగి నీవౌదు మాలక్ష్మి
తల్లీ నమస్తే నమస్తే నమస్తే నమః