Sunday, 15 March 2020

ఇంటిదగ్గరే కల్తీని కనిపెట్టడానికి తేలికపాటి పరీక్షలు

ఆహార భద్రత, ప్రమాణాల శాఖ
ఇంటిదగ్గరే కల్తీని కనిపెట్టడానికి తేలికపాటి పరీక్షలు ఎలా చేయొచ్చో చెప్పే ఒక మాన్యూల్‌ని రూపొందించింది.
‘డిటెక్ట్‌ అడల్టరేషన్‌ విత్‌ రాపిడ్‌ టెస్ట్‌’ అనే ఈ పుస్తకాన్ని 41 పరీక్షల వివరాలతో తమ వెబ్‌సైట్‌లో పెట్టింది.
అందులో కొన్ని...
* చిన్న సీసాలోకి కొద్దిగా పాలు తీసుకునిగిలకొట్టాలి. డిటర్జెంట్‌లాంటివి ఏమైనా కలిపితే నురగ ఎక్కువగా వస్తుంది.
* తెల్లని బ్లాటింగ్‌పేపర్‌ని తడిపి కానీ తడి దూదితో కానీ కూరగాయలూ పండ్లూ తుడిస్తే కృత్రిమరంగు ఉంటే తెలిసిపోతుంది.
* ఐస్‌క్రీమ్‌ కొంచెం విడిగా తీసి దానిమీద రెండు చుక్కలు నిమ్మరసం పిండాలి. నురగలు వస్తే వాషింగ్‌పౌడర్‌లాంటి పదార్థమేదో కల్తీ జరిగినట్లు.
* మిరియాలను ఆల్కహాల్‌లో వేయాలి. మిరియాలు మునిగిపోతాయి. బొప్పాయి గింజలు కలిసినట్లయితే అవి తేలతాయి.
* కాసిని ఆవగింజల్ని దంచి చూడాలి. ఆవగింజలైతే పైన నున్నగా ఉండి లోపల పసుపు పచ్చగా ఉంటాయి. వేరే గింజలు కల్తీ చేస్తే అవి పైన గరుగ్గా ఉండి లోపల తెల్లగా ఉంటాయి.
* పంచదార, ఉప్పుల్లో కల్తీ జరిగినట్లు అనుమానమొస్తే చెంచాడు తీసుకుని నీటిలో వేయాలి. ఉప్పైనా పంచదార అయినా కరిగిపోతాయి. కల్తీ చేసిన చాక్‌పొడి అడుగున పేరుకుంటుంది.
* కాస్త తేనెలో దూదిని ముంచి తీసి వెలిగిస్తే మంచి తేనె అయితే మండుతుంది. కల్తీ అయితే చిటపటలాడుతుంది.
* టీపొడిని పేపరు మీద పోసి దానిలో అయస్కాంతం పెడితే ఇనుపరజను కలిపినట్లయితే తెలిసిపోతుంది. తడిగా ఉన్న ఫిల్టర్‌ పేపర్‌మీద కాస్త టీపొడి చల్లితే- ఒకవేళ వాడేసిన టీపొడికి రంగువేసి అమ్మినట్లయితే ఆ రంగు పేపరుకు అతుక్కుంటుంది.
* కరిగిన నెయ్యిలో ఒక స్పూను చక్కెర వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు.
* కారం పొడిని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు అందులో ఇటుకపొడి కలిసినట్లయితే అది అడుగున పేరుకుంటుంది.
* పసుపు కానీ పప్పు కానీ కొద్దిగా నీళ్లలో వేసి దాంట్లో కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ వేయాలి. మెటానిల్‌ ఎల్లో కల్తీ జరిగినట్లయితే నీరు ఊదా రంగులోకి మారుతుంది. పసుపులో లెడ్‌ క్రొమేట్‌ కలిసినట్లయితే నీళ్లు మరీ ఎక్కువ పచ్చగా మారతాయి. మంచి పసుపు నీళ్లలో కరగకుండా అడుగున పేరుకుంటుంది.
* మంచి ఇంగువ వెలిగిస్తే కర్పూరంలా మండుతుంది. కల్తీ జరిగితే అలా మండదు.

సేకరణ....