Tuesday, 1 April 2025

అభిమానం. కథ

 

ప్రయాణికులకు విజ్ఞప్తి,
ట్రైన్ నెంబర్...
అంటూ మరికొద్ది సేపటిలో 2 వ నెంబర్ ప్లాట్ ఫారం మీదకి వచ్చును...
అంటున్న ప్రకటన వినగానే ఒక్క సారిగా జనం సర్దుకోవడం మొదలు పెట్టారు...
ఆ రోజు ఫ్లాట్ ఫారం అంతా సందడి గా,
కోలాహలం గా ఉంది.
ఎందుకంటే ఆరోజు వాళ్ళ  అభిమాన  హీరో
ఆరోజు అదే ట్రైన్ లో వస్తున్నారు.
షూటింగ్ కోసం.
అభినవ్ ఈమధ్యే రెండు హిట్స్ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
విజయ్ కి కూడా చాలా ఇష్టం ..
తనకి చూడాలని ఉంది ...
అంతమంది జనం , తోపులాట ఎందుకు అనిపించినా...
మనసు ఆగలేక బయకుదేరాడు
రైల్వే స్టేషన్ కి...
అప్పటికే జనాల అరుపులతో,
అంతా హడావుడి గా ఉంది.
కనీసం దూరం నుంచి అయినా చూద్దామని అలా దూరం గా ఒక బెంచ్ మీద కూర్చుని చూస్తున్నాడు. ఇంతలో రైలు వచ్చి ఆగింది...
అందరూ ఉత్సాహం గా ఎగబడి పోయారు.. కంపార్ట్మెంట్ దగ్గరకి....
గేట్ తీయగానే...ఎవరో దిగారు... అతనికి దారి ఇచ్చేసారు...
తరువాత ఒక ముసలి ఆమె దిగారు.... మళ్ళీ ఫాన్స్ లో నిరుత్సాహాం...
ఈసారి ఒక ముసలి ఆయన సంచీ పట్టుకుని దిగాడు....
ఆయనకి దారి ఇచ్చేసారు....ఆయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న బెంచి మీద కూర్చున్నారు.
ఇంతలో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి..
ఆయన లొకేషన్ కి వెళ్లి పోయారు మీరు అందరూ అక్కడి కి వచ్చేయండిి...
లంచ్ తరువాత కలిసే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు...
అందరూ కొంత నిరుత్సాహ పడినా ,
అక్కడికి రమ్మన్నారు కదా అని రెండు గంటలకు అందరూ అక్కడికి చేరుకోవాలి అని ప్లాన్ చేసుకుని ఒక్కో క్కరూ బయలు దేరసాగారు.

బాబు కొంచెం మంచినీళ్లు ఇస్తావా అడిగారు.
చెమట తుడుచుకుంటూ...
అయ్యయ్యో ఇవి నేను తాగాను అండి...
ఉండండి ఒక్క నిమిషం అంటూ ఒక మినరల్ వాటర్ బాటిల్ కొని ఆయనకి ఇచ్చాడు...
అదేమిటి బాబు కొత్తది కొని ఇచ్చావు...
అంటూ అడిగాడు...
ఏమీ పరవాలేదు తాతగారు...
మీరు పెద్దవారు...మీకు దాహం తీర్చడం లో
వాడిన నీళ్లు ఎందుకని... ఇచ్చాను...
ఇంతలో నా ఆస్తులు ఏమీ కరిగి పోవులెండి అన్నాడు నవ్వుతూ...
సంతోషం బాబు...
ఇంతకీ అంతా అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు
అని ఆడిగాడు... నీళ్లు తాగుతూ..
నేను బాగా అభిమానించే హీరో
వస్తున్నారని చెప్పారు...
అందరితో పాటు నేను చూద్దామని వచ్చాను ...
కానీ జన సందోహం చూసి ఇక్కడే ఆగిపోయాను. ఆయన ముందు స్టేషన్ లో దిగి లొకేషన్ కి వెళ్లి పోయారుట...
రెండు గంటలకి అక్కడికి రమ్మని చెప్పారట...అన్నాడు విజయ్ .
మరి వెళుతున్నావా అని అడిగారు పెద్దాయన.
నాకూ వెళ్లాలనే ఉంది కానీ , అక్కడ కి చాలామంది వస్తారు...
పైగా షూటింగ్ హడావిడి స్ట్రిక్ట్ గా ఉంటుంది... కలిసే అవకాశం ఉండదు... ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉంది...అన్నాడు...
సరే అబ్బాయి
ఇంతకీ నీ పేరు ఏమిటన్నావ్ అన్నాడు.
విజయ్ సర్... అని చెప్పాడు.
మీ హీరో గారు నాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు.
తన విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు.
షూటింగ్ కి ఖాళీగా ఉంటే నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు.
ఇదిగో
ఈ కార్డ్ చూపిస్తే ,లోపలికి రానిస్తారు
అని చెప్పాడు.
ఈ వయసులో అలాంటి సరదాలు మాకేముంటాయి .
నీకు కావాలంటే ఈ కార్డ్ ఇస్తా... తీసుకుని వెళతావా అన్నాడు పెద్దాయన .
విజయ్ ఎగిరి గంతేసినంత పని చేసాడు.
మొహం లో ఒక్కసారి గా ఆనందం.
కానీ అంతలో నే మాయమైంది.
కానీ సర్ ఆయన కార్డ్ వలన అక్కడి వరకు వాళ్ళు వెళ్ళనిస్తారు.
కానీ ఆయన కి నేను తెలియదు కదా,
బైటకి పంపేస్తారు... ఇప్పుడు ఎలా మరి అని అడిగాడు.
ఓరి నీ దుంప తెగ... సర్లే నీకోసం నేనూ వస్తా...పద బండి తీయి...
నీకు సంతకం పెట్టించి... నేను వెళతాను సరేనా అన్నాడు పెద్దాయన.
అలా అన్నారు బాగుంది... ఇప్పుడు చూడండి అంటూ హుషారుగా బండి తీసుకుని రావడానికి వెళ్ళాడు.
దూరం గా నుంచుని ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి... నేను ఇతనితో వస్తా...మీరు ఫాలో అవ్వండి... మేకప్ బాగా వేసాడు...ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు....నా క్యారెక్టర్ బాగా పండుతుంది అనడం లో సందేహం లేదు అన్నాడు నవ్వుతూ...
ఇవాళ లంచ్ కూడా నాతోనే ఏర్పాటు చేయండి... అభిమాని థ్రిల్ ఫీల్ అవుతాడు...
వాళ్ళని సంతోష పెట్టడమేగా మన పని...అంటూ నవ్వాడు...
అలాగే సర్..అంటూ లగేజీ, కార్ వ్యాన్ లో పెట్టించి...వెనుకే ఫాలో అవసాగాడు.
ఇద్దరు బయలు దేరారు..
భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ..
ఆ చేయి వేయగానే ఏదో ఆనందం... తెలియదు...ఎందుకో..
తన అభిమాన హీరో ని ,చూడడానికి వెళుతున్నాను కదా అందుకే నేమో...అనుకున్నాడు... విజయ్..
ఇద్దరు షూటింగ్ లొకేషన్ కి చేరుకున్నారు... ...తన అభిమాన హీరో ని కలవ బోతున్నా అన్న ఆనందం చెప్పలేనిది గా ఉంది...సర్ చాలా థాంక్స్ అండీ...
మీ దయ వలన నేను మా అభిమాన హీరో ని కలవ బోతున్నా... అన్నాడు..
అప్పుడే ఏమైంది... ఇంకా చాలా ఉంది.
ముందు ముందు నీ కే తెలుస్తుంది లే అన్నారు .
అర్థం కాలేదు విజయ్ కి
ఏమిటో మరి అనుకుంటూ అక్కడ ఆగాడు...ఆయన బండి దిగుతుంటే...
అందరూ పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చేసారు...
నమస్తే సర్..మీ గురించే ఎదురు చూస్తున్నాము....అంటూ గబగబా దండలు అవి వేయ బోయారు...
వద్దు వద్దు మేకప్ పోతుంది....
ముందు సీన్ చేసేద్దాం... తరువాత మాట్లాడుకుందాం... అన్నాడు.
విజయ్ కి ఏమి జరుగుతోందో అర్ధం కాలేదు... ఇంత సేపు తన బైక్ మీద వచ్చింది తన అభిమాన హీరోనా..
ఆయన తోనే నేను ఇక్కడి కి వచ్చానా.
ఆయనే నన్ను ఇక్కడి కి తీసుకుని వచ్చారా..సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయాడు.
.. ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి ఇవాళ ఇతను నా గెస్ట్ ...లంచ్ కూడా నాతోనే...జాగ్రత్తగా చూసుకోండి... అన్నాడు
సరే సర్ అంటుంటే...
దర్శకుడు వచ్చారు... సర్ షాట్ రెడీ...
మీరు ఒక రిహార్సల్స్ చేసేస్తే...
టేక్ చేస్తాను... అంటూ చెప్పాడు... పదండి...అంటూ...
మిస్టర్ విజయ్ ఇవాళ నాతోనే ఉంటున్నావ్....సరేనా అంటూ భుజం మీద ఆప్యాయంగా తట్టి , నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు అభినవ్.
ఇవాళ షూటింగ్ అంత సేపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు....హీరో గారితో లంచ్... కూడా ఏర్పాటు చేసాను. తరువాత నీకు కావలిసిన ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్లొచ్చు ..సరేనా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్..
చాలా థాంక్స్ అండీ....
ఇవాళ చాలా సంతోషంగా ఉంది..
ముందు లోపలికి వెళ్ళు....
నేను మళ్ళీ కలుస్తాను.
ఇదిగో ఈ పాస్ నీ దగ్గర ఉంచు...
ఎవరు ఆడిగినా చూపించు... ఎవరూ ఆపరు...
అని అతనికి పాస్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆ రోజంతా గడిపి ఆటోగ్రాఫ్ తీసుకుని...
బండి మీద బయలు దేరాడు...
ఆ రోజు నిజంగా జీవితం లో మరచి పోలేని రోజు.... అనుకుంటూ..
గాల్లో తేలి నట్టుంది అంటూ పాడుకుంటూ ...నడువుతున్నాడు...బండి...ఆ థ్రిల్ నించి ఇంకా బైటకి రాలేక పోతున్నాడు... ఇంతలో బండికి అడ్డం గా ఎవరో వచ్చేసారు... చూసుకోలేదు.
సడెన్ బ్రేక్ వేసాడు... కంట్రోల్ తప్పి...దబ్ మని పడిపోయాడు.... ఎవరో తనని లేపుతున్నారు....
కళ్ళు తెరిచి చూసేటప్పటికి...
మంచం కింద ఉన్నాడు...
ఏరా... మళ్ళీ కల వచ్చిందా....
మంచం మీదనించి పడ్డావ్...
అసలు ఈ కలలు కనే మాయ రోగం ఎక్కడి నుంచి వచ్చింది రా.
అర్ధరాత్రి దాకా తిరగటం , బారెడు పొద్దెక్కే దాకా లేవక పోవడం...
అన్ని దిక్కుమాలిన అలవాట్లే వీడికి....
కాలేజీ కి టైం అవుతోంది, తొందరగా లేచి తయారవుదాం...అన్న జ్ఞానం లేదు
ఇంతకీ ఇవాళ కాలేజ్ కి వెళుతున్నారా లేదా దొరగారు, అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాడు విజయ్ వాళ్ల నాన్న.
ఆ ఆ వెళుతున్నాను నాన్నా...ఆంటూ లేచాడు .
ఇదంతా కలా... ఎంత రియల్ గా అనిపించింది...
అభిమానం ఉండొచ్చు కానీ ఇంత ఎక్కువ గా ఉండకూడదు...
ఇంకా నయం మంచం మీదనించి పడ్డాను గాబట్టి సరిపోయింది లేకపోతే అదే బండి మీద నుంచి అయితే...ఎంత ప్రమాదం..తప్పింది.. అనుకుని...తనలో తాను నవ్వుకుంటూ తయారవడానికి బయలు దేరాడు...
విజయ్ టిఫిన్ చేస్తుండగా ఫ్రెండ్ వచ్చాడు బండి మీద...ఒరేయ్ విజయ్ అని అరిచాడు..
అదిగో వచ్చాడు
కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టిందట...
సుబ్బరంగా మెక్కడం....
ఊరి మీద పడి బలాదూర్ తిరగడం...
ఇంక చదువుకోవడాలు ఏవి లేవుట్రా....అంటూ వాడి మీదకుడా అరిచాడు ...
ఆబ్బె అలాంటిదేమి లేదు అంకుల్ ...
కాలేజ్ కే వెళుతున్నాం...
మేము చాలా బాగా చదువుకుంటున్నాం అంకుల్... అన్నాడు..
ఆహా అలాగా మరి ఎన్ని బాక్ లాగ్స్ ఉన్నాయో చెప్పు మరి...అన్నాడు...
అంకుల్ అవి మరి అవి , ఏమిటి అలా నీళ్లు నములుతున్నావ్ చెప్పు మరి అని అన్నాడు,
అవి ఒకటి రెండు మూడు లెక్కపెడుతున్నాడు... చేతి వేళ్ళు సరిపోతాయా , కాలి వేళ్ళు కూడా కలపాలా ..
మీ సంగతి నాకు చెపుతున్నారురా....
ఇక్కడ ఫీజులు లు కట్టేది నేనే నని మర్చిపోయి నట్టున్నారు...
ఒక్కొక్కళ్ళు ఎలా తయారయ్యారో...
ఎప్పుడు మారతారు రా,
జీవితం విలువ ఎప్పుడు తెలుసు కుంటారు రా ...
అని క్లాస్ మొదలు పెట్టాడు.
నాన్నా బాయ్ అంటూ విజయ్ వచ్చి బండి ఎక్కాడు...
తొందరగా ఎక్కరా బాబు....
ఇంకొంచెం సేపు ఉంటే మీ నాన్న
నన్ను చంపే సేలా ఉన్నారు... అంటూ
బండి స్టార్ట్ చేసి.. బై అంకుల్ అంటూ చెప్పాడు...
దీనికేమి తక్కువ లేదు...బాయ్ బాయ్...లు టా టా లు...వేధవల్లారా...
ఆ వెధవ స్పీడ్ తగ్గించి , కాస్త స్లోగా అఘోరించండి....
జాగ్రత్తగా వెళ్లి రండి...అన్నారు.
ఎందుకండి వాడ్ని అలా తిడతారు.
అసలే కాలేజ్ కి వెళ్లే కుర్రాడు...అంటూ అడిగింది భార్య...
తమరి దిక్కుమాలిన సలహా ఇక్కడ ఎవరికి అక్కరలేదు..
ముందు నాకు టిఫిన్ పెట్టు.
ఆఫీస్ కి టైం అవుతోంది.
అసలు నీ గారాబం వల్ల నే కదూ వాడు అలా తయారు అయ్యింది అన్నాడు...
అయ్యో రామా మధ్య లో నా మీద పడతారేమిటి,
ఇదిగో టిఫిన్ తినండి అంటూ ప్లేట్ టేబుల్ మీద పెట్టింది.
వాడిని ఒక్క ముక్క కూడా అననీయవు, మధ్య లో దూరిపోతావ్...మనం కాక పోతే ఎవరు చెపుతారు..

" ఇప్పుడు కష్టపడి చదవక పోతే
జీవితాంతం కష్టపడి పని చేయాల్సి వస్తుంది"

అది నీకు సంతోషమేనా....
నేను కోప్పడేది వాడి భవిష్యత్ కోసమేగా...
కనీసం నువ్వైనా అర్థం చేసుకో
నాన్న మనసుని
అంటూ చేయి కడుక్కోవడానికి లేచాడు..
ఇటు ఎక్కడికి రా ,
కాలేజ్ అటు కదా అని అడిగాడు విజయ్.
ఏరా మరచి పోయావా
ఇవాళ మన అభిమాన హీరో
అభినవ్ షూటింగ్ ఉందని తెలుసుగా....
మనం అక్కడి కే వెడుతున్నాం.
కాలేజ్ కి వెళ్లటం లేదు... అన్నాడు... వేణు.
వద్దు రా , అభిమానం సినిమా చూసే వరకు ఉంచుకుందాం... కాలేజ్ మానేసి...అక్కడికి వెళ్లడం ...ఉహూ...
వద్దు లే...
ఇవాళ క్లాస్ మిస్ అయితే మళ్ళీ చెప్పే వాళ్ళు ఉండరు.
ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం...
ఎప్పుడైనా సెలవులో ఉంటే వెళదాం....
ముందు బండి కాలేజీ కి పోనీ అన్నాడు... విజయ్..
ఇంత జ్ఞానోదయం ఎప్పుడు అయింది బాబూ అని ...వెటకారం గా అడిగాడు వేణు.
ఉదయమే గానీ,
నువ్వు మూసుకుని పద బే...అన్నాడు విజయ్.
సరే ..అలాగే కానీ
ఇలా మర్యాద గా చెపితే ఎవరు కాదంటారు, అలాగే కానీ,
అయినా,
నువ్వు చెప్పింది పాయింటే గా...
చలో కాలేజ్ ...అంటూ
బండి కాలేజ్ వైపు తిప్పేసాడు....

కల్పిత కథ 

కథ కథనం పాత్రలు కల్పితం 


Sunday, 23 March 2025

తెలుగు సంవత్సములు పేర్లు అర్థములు

తెలుగు సంవత్సములు పేర్లు అర్థములు 

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది

సేకరణ 🙏💐