Thursday, 15 August 2019

హయగ్రీవుడు




అశ్వ రూపం విశ్వ తేజం
చదువున్నచోట జ్ఞానముంటుంది.
జ్ఞానం ధనాన్ని సంపాదిస్తుంది.
ధనం ఆనందానికి మూలమవుతుంది.
అందుకే చదువు రావాలన్నా, జ్ఞానం వృద్ధి చెందాలన్నా, సంపదలు చేకూరాలన్నా జ్ఞానానందమయుడైన హయగ్రీవుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.

‘జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికా కృతిం
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే’


ఇది హయగ్రీవ స్తోత్రంలోని మొదటి శ్లోకం. ఇందులోనే స్వామితత్త్వం అంతా ఇమిడి ఉంది.

హయగ్రీవుడు చదువులకు అధిదేవుడు. సృజనాత్మకత, సందర్భానుసారంగా నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుకురావడం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి వృద్ధిచెందడంలాంటి వాటికోసం ఆయనను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తెలుగు సాహితీ ప్రక్రియల్లో విశేషమైన అవధానం, ఆశు కవిత, సభారంజకంగా ఉపన్యసించడంలో పేరుపొందిన పండితులంతా హయగ్రీవ ఉపాసన చేస్తుంటారు.

ధర్మరక్షణ కోసం మహావిష్ణువు ఎత్తినవి దశావతారాలని అందరికీ తెలుసు.

కొందరు అవి 21 అని చెబుతారు.
వాటిలో ఒకటి హయగ్రీవ రూపం.. శ్రవణానక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ స్వామి అవతరించినట్లు చెబుతారు.

మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం. లక్ష్మీదేవి పుట్టిన తిధి శ్రావణ పౌర్ణమి.
వారిద్దరి జన్మ నక్షత్ర తిధులతో కలిసి ఉంటుంది కాబట్టి ఆనాడు
లక్ష్మీసహిత హయగ్రీవ ఆరాధన మంచిదని చెబుతారు.

హయగ్రీవ అవతరణ వివరాలు మహాభారతం, దేవీ భాగవతంలో ఉన్నాయి.
సకల చరాచర సృష్టికి కర్తయిన బ్రహ్మకు శక్తినిచ్చేవి వేదాలు.
ధర్మమూలాలైన వేదాల సంరక్షణ బాధ్యత శ్రీ మహావిష్ణువుది.
మధుకైటభులనే రాక్షసులు సృష్టి ప్రారంభ పనిలో నిమగ్నమై ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించి, రసాతలానికి చేరుకున్నారు.
దాంతో బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలియకుండా పోయింది.
అప్పుడు మహావిష్ణువు వేద సంరక్షణ కోసం హయగ్రీవుని అవతారం ధరించాడు.
గుర్రం ముఖం, మానవ శరీరంతో ఈ అవతారం ఉంది.
అది విశ్వమంతా నిండి మహోన్నతంగా కనిపించింది.
నక్షత్రాలతో నిండిన ఆకాశం తల భాగంగా, సూర్యకిరణాలు కేశాలుగా, సముద్రాలు కనుబొమలుగా, సూర్యచంద్రులు కళ్లుగా, ఓంకారం అలంకారంగా, మెరుపులు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం, బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి మెడ భాగంగా కనిపించాయి.
ఈ దివ్యరూపంలోని హయగ్రీవుడు క్షణకాలంలో బ్రహ్మముందు అంతర్థానమై రసాతలాన్ని చేరాడు.
అక్కడ ప్రణవనాదం చేశాడు.
ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా సామ వేదాన్ని గానం చేశాడు.
ఆ మధుర గానవాహిని రసాతలమంతా మార్మోగింది.
అది విన్న మధుకైటభులిద్దరూ వేదాలను వదిలి ఆ నాదం వినిపిస్తున్న వైపు పరుగులు పెట్టారు.
అప్పుడు హయగ్రీవుడు రాక్షసులు, వేదాలను దాచి ఉంచిన చోటికి వెళ్లి వాటిని తీసుకుని వచ్చి బ్రహ్మకు ఇచ్చాడు.
అక్కడ రాక్షసులకు వేదనాదం చేసిన వాళ్లెవరూ కనిపించలేదు.
వెనక్కి తిరిగి వచ్చి చూస్తే వేదాలు లేవు. వాటిని తీసుకెళ్లింది శ్రీమహావిష్ణువేనని గ్రహించిన వాళ్లిద్దరూ ఆయనతో యుద్ధానికి దిగారు.
ఆ స్వామి రాక్షసులిద్దరినీ సంహరించి మధుకైటభారిగా అందరి స్తుతులందుకున్నాడు.
వేదాలు జ్ఞానానికి చిహ్నాలు, అలాంటి జ్ఞానాన్ని రక్షించి తిరిగి బ్రహ్మకు ప్రసాదించిన అవతారం కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞానానందావతారంగా చెబుతారు.

హయం అంటే గుర్రం.
గర్రుపు తలతో కనిపించే హయగ్రీవుడి రూపాన్ని
ఓ జ్ఞానదీపంగా భావిస్తారు సాధకులు.
గుర్రపు సకిలింతలో ఉన్న
క్లీం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరధ్వని
అశ్వ వేగంలోని యోగ రహస్యంగా గుర్తించారు.
ఇందులో క్లీం అనే అక్షరాన్ని కామరాజ బీజమని కూడా పిలుస్తారు.
యోగమార్గంలో త్వరగా కోర్కెల సాధనకు ఇది గొప్ప సాధకం.
క్లీంలో వినిపించే ‘ఈ’ కారానికి కూడా విశేషముంది.
దీన్ని ‘కేవలా’ అంటారు. కేవలా అంటే మాత్రమే అని అర్థం.
లలితా సహస్రనామంలోని ‘కేవలా’ ఇదేనని చెబుతారు.
సృష్టి మొత్తానికి మూలం ఆమె శక్తి మాత్రమే అని భావం.

అగస్త్య మహర్షి హయగ్రీవుడిని గురించి తపస్సు చేశాడు.
అప్పుడా స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అగస్త్యుడు
లలితా పరమేశ్వరి గురించి వివరించమని అడిగాడు.
అప్పుడు హయగ్రీవుడు అమ్మ సహస్రనామాలను అంగన్యాస కరన్యాస పూర్వకంగా మహర్షికి ఉపదేశించాడు. లోకక్షేమం కోసం లలితా పరమేశ్వరి సంకల్పంతో వీటిని చెప్పినట్లు వివరిస్తాడు.

హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల,
గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు.

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చుదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట.
హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని
వింటే చాలు వైకుంఠంయొక్క
తలుపులు తెరుచుకుంటాయి.

హయగ్రీవుని పూజించడంవల్ల
విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.
పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి.
ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.

హయగ్రీవస్తోత్రం

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||


Friday, 9 August 2019

కనకధారా స్తోత్రం మహాత్మ్యం


శ్రీ వెరంబదూరు...

కేరళలోని కాలడి సమీపంలో, పూర్ణానదీ తీరంలో శ్రోత్రియులు ఎక్కువగా నివసించే చిన్న గ్రామం...

కార్తీకమాసం, శుక్లపక్ష ద్వాదశి, మధ్యాహ్న సమయం...

ఓ ఇంటి ముందు నిల్చుని
‘భవతీ భిక్షాందేహి...’
అడిగాడు ఎనిమిదేళ్ల బాలుడు...

ఈ మాట వినిపిస్తూనే బయటకు వచ్చి తొంగిచూసిందా ఇల్లాలు...

బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఆ పిల్లాడి ముఖం చూసి ఇంట్లోకి వెళ్లిందామె.

మధ్యాహ్నం... భోజన సమయం...

అందులోనూ ద్వాదశినాడు అతిథి వచ్చాడు.

తన చీర చిరుగులు కనబడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ..

ఏమీ ఇవ్వలేని తన దురదృష్టానికి, పేదరికానికి దుఃఖిస్తూ..
ఇంట్లో ఉన్న ఒక ఎండిపోయిన ఉసిరికాయను తెచ్చి ఆ పిల్లవాడికి భిక్షగా
సమర్పించిందా ఇల్లాలు..

తనకు భిక్ష వేసిన ఆ ఇల్లాలి ముఖం చూస్తూనే ఆమె దుఃఖం, పేదరికం
ఆ పిల్లవాడికి అర్థమయ్యాయి.

అంతే... ఆ ఇంటి ముందే నిల్చుని

‘అంగం హరేః పులక భూషణ మాశ్రయంతే
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః’


‘మొగ్గలతో నిండి ఉన్న చీకటి చెట్టుకు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్లుగా,

పులకాంకురాలతో శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించి ఉన్న సకల శుభాలకు స్థానమైన లక్ష్మీదేవి చల్లని చూపు శుభాలను ప్రసాదించుగాక..’

అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ
ఆశువుగాశ్లోకాలు గానం చేశాడు.

అంతే... ఆ ఇంటి ముందు

బంగారు ఉసిరికల వర్షం కురిసింది.

ఆ ఇల్లాలి పేదరికం తొలగిపోయి సకల శుభాలు కలిగాయి.

ఇలా జాతికి లక్ష్మీ దయను వర్షింపజేసిన ఆ బాలుడే
అద్వైత సిద్ధాంతకర్తగా,
జగద్గురువుగా అవతరించిన
ఆది శంకరాచార్యులు.

ఆయన చేసిన స్తోత్రమే కనకధారా స్తోత్రం.

ఆది శంకరులు అనేక స్తోత్రాలు రచించి
జాతికి అందించారు.
వాటి ద్వారా జీవన మార్గాన్నీ నిర్దేశించారు.

వాటిలో కనకధారా స్తోత్రం ఒకటి.
జగద్గురు ప్రవచించిన వాటిలో ఇది మొదటి స్తోత్రంగా చెబుతారు.

ఇందులో మొత్తం 21 శ్లోకాలు ఉన్నాయి.

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తట్పిదంగనేవ
మాతాస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః’

ఆకాశంలో మబ్బులు కమ్మిన సమయంలో వచ్చే మెరుపు ఎలా కాంతిమంతంగా కనిపిస్తుందో...
అలా విష్ణు వక్ష స్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తుంది.

‘గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయ కేళిఘ సంస్థితాయై
తస్మై నమస్త్రిభువనైన గురోస్తరుణ్యై’

ముల్లోకాలకూ గురువైన విష్ణువు పట్టమహిషి...
వాగ్దేవి, గరుడ ధ్వజసుందరి, శాకంబరి, శశిశేఖర వల్లభ అనే పేర్లతో పూజలందుకుంటున్న లక్ష్మీదేవికి నమస్కారం.

మరో శ్లోకంలో వక్షస్థలాన్ని అలంకరించిన మాలలోని ఇంద్రనీలపతకం మెరుస్తున్నట్లుగా లక్ష్మీదేవి ఉందని చెబుతారు.
ఇలా ఏ శ్లోకానికా శ్లోకం ప్రత్యేకంగా ఉండడంతో పాటు అమ్మరూపాన్ని, దయను ఒక దృశ్యంగా కళ్లముందు ఉంచుతుంది.

ఆది శంకరులు ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి ఆశువుగా స్తోత్రం చేశాడు కానీ అందులో ఎక్కడా కనకధార అనే మాట వినిపించదు. అయితే అందులోని

‘దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశే విషణ్ణే!
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయదూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!’

శ్రీమన్నారాయణుని దేవేరి అయిన లక్ష్మీదేవి దృష్టి అనే మేఘం దయావాయు ప్రేరితమై, నాలో చాలాకాలం నుంచి ఉన్న దుష్కర్మ తాపాలను తొలగించి, పేదవాడిని అనే విచారంలో ఉన్న చాతక పక్షి వంటి నాపై ధనవర్ష ధారను కురిసేలా చేయును గాక’

అనే శ్లోకాన్ని బట్టి కనకధార అనే పేరు ఈ స్తోత్రానికి వచ్చినట్లు చెబుతారు.

ఇందులోని ‘ద్రవిణాంబుధార’ అనే పద భాగమే కనకధార అనే పేరుకు కారణంగా భావించాలి.

తనను నమ్మి నిరంతరం స్తోత్రం చేసేవారిపై లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో తన దయను వర్షింపజేస్తుంది. 

ఈ విషయాన్ని నిరూపించేదే కనకధారా స్తోత్రం.



శ్రీమహాలక్ష్మి సంపదల తల్లి.

ధనధాన్యాలకు అధినేత.

శ్రీహరి హృదయ రాణి.

కనకధారా స్తోత్రంలో విష్ణువును ప్రార్థించడం,
విష్ణువుతో లక్ష్మీదేవిని అనుసంధానం చేస్తూ స్తోత్రం చేయడం కనిపిస్తుంది.

‘నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్మై్య
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై’

పద్మాలను పోలిన ముఖంతో వర్ధిల్లే దేవికి నమస్కారం.
క్షీర సముద్రం నుంచి జన్మించిన తల్లికి నమస్కారం,
అమృతం, చంద్రుడుల సోదరికి నమస్కారం. నారాయణుని వల్లభ అయిన లక్ష్మీదేవికి నమస్కారం...


శ్రీ కనకధారా స్తోత్రం


వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం
కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః
బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః


సువర్ణ ధారా స్తోత్రం
యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్


ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం

Monday, 15 July 2019

శాకంబరి దేవి ఉత్సవం


ఆకైనా, అలమైనా, కాయయినా, పండయినా వాటిలోని జవం, జీవం ఆమె చైతన్యమే...
అందుకే ఆ మూల ప్రకృతికి ప్రణమిల్లుతాం. ప్రణతులు అర్పిస్తాం.
పంటలు తొలిదశలో ఉన్న సమయంలో వివిధ కూరగాయలను సమర్పించి,
 వాటితో అలంకరించి అమ్మవారిని పూజించడం సంప్రదాయం.
ఆషాఢమాసంలో
శుక్లపక్ష పౌర్ణమిరోజు జరిగే
 "  శాకంబరీ ఉత్సవం. "
ఇహపర సందేశాలను అందిస్తుంది.
దుర్గాదేవి ఒక్కో రూపానిది ఒక్కో ప్రత్యేకత. ఆ స్వరూపాలన్నీ అమ్మకు అలంకరణలే కాదు,
అవన్నీ భక్తులు తనను వివిధ రూపాల్లో ఉపాసించేందుకు ఆమె సూచించిన మార్గాలు.
ఆ పరంపరలో శాకంబరీదేవిగా
ఆ జగజ్జనని శోభాయమాన ఆహార్యంతో అలరారుతుంది.
అఖండమైన శక్తితో ఆశీస్సులు అందిస్తుంది. దుర్గాసప్తశతిలోని
 ఆఖరి అధ్యాయమైన
 ‘మూర్తి రహస్యం’ ఆ లోకపావని రూపాన్ని అద్భుతంగా వర్ణించింది.
శాకంబరి దేవి నీలవర్ణ దేహంతో, మహావిద్యకు ప్రతీక అయిన రత్నమణిమయ కిరీటాన్ని ధరించి, తన బిడ్డలను దయాదృక్కులతో వీక్షిస్తూ కొలువై ఉంటుందని చెప్పింది.
ఈ శాకంబరి రూపంపై ధ్యానం చేయడం ఆధ్యాత్మికసాధనలో భాగం.
స్కాంద పురాణంలో, దేవీ భాగవతంలో శాకంబరీదేవి గురించి ఉంది.
అమ్మ వైభవాన్నే కాకుండా, ఉపాసనా విధానాలు కూడా వీటిలో విస్పష్టంగా ఉన్నాయి.

అసలీ తల్లి అవతరించడానికి కారణంగా చెప్పే కథ :

ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందాడు.
దేవతలు సహా అందరూ వేద విజ్ఞానాన్ని మరచిపోవాలని, నిగమ జ్ఞానమంతా తనకే దక్కాలని వరాన్ని కోరుకున్నాడు.
అందరూ వేద విజ్ఞానాన్ని మర్చిపోవడంతో చాతుర్వర్ణాల వారు తమ విధులను విస్మరించారు.
వృత్తి నిపుణులు నైపుణ్యాలను మరచిపోయారు.
దీంతో పరిస్థితులు అస్తవ్యస్తమయ్యాయి. భూరక్షణ, వ్యాపారం, యజ్ఞయాగాదులు స్తంభించాయి.
ఎక్కడ చూసినా కరవు.
ప్రజలు ఆకలితో అలమటించారు.
అప్పుడు రుషులు సుమేరు పర్వత గుహల్లోకి వెళ్లి తపస్సు చేశారు.
దీంతో నీలవర్ణంతో, చతుర్భుజాలతో, ధనుర్భాణాలతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు.
తన బిడ్డల దుస్థితిని చూసి ఆమె తొమ్మిది రోజులపాటు కంటికీమింటికీ
 ఏకధారగా రోదించారు.
 ఆ కరుణామృతసాగరి కన్నీటికి ఈ భూమిపై నదులన్నీ నిండిపోయాయి.
 అంతేకాకుండా అశేష జనవాహిని ఆకలికేకల్ని విని ఆమె శాకంబరిగా మారిపోయింది.
పండ్లు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలుగా  అన్నిటినీ తన బిడ్డలకు పంచి తక్షణమే అందరి ఆకలి తీర్చింది.
కరవుకాటకాలను అంతం చేసింది.

ఆ తర్వాత దుర్గమాసురుణ్ణి సంహరించింది.  అమ్మను అనేక రకాల కూరగాయలు, ఆకులతో అలంకరించడం వెనక అంతరార్థం ప్రకృతిని అమ్మగా గ్రహించమని చెప్పడమే.

ఆషాఢ మాసం :

చంద్రమానం ప్రకారం
తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై ఫాల్గుణంతో ముగుస్తుంది.
తెలుగు నెలల క్రమంలో ఆషాడం నాలుగోది.
ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు విరామం ఇస్తారు.

పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాడ నక్షత్రంలో సంచరించే మాసం
 ‘ఆషాఢ మాసం’.
దీనిని శూన్యమాసమంటారు.
ఆషాఢం నుంచే దక్షిణాయణం, వర్షరుతువు ఆరంభమవుతాయి.
కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం తిరిగి మకర రాశిలోకి వెళ్లే వరకు ఆరు మాసాలు ఉంటుంది. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉంటుంది.
ఆషాఢంలో అందరూ  గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయం ....


గోరింటాకు పుట్టుక  :

అసలు పేరు గౌరింటాకు
(గౌరి ఇంటి ఆకు)

గౌరీదేవి బాల్యంలో చెలులతో
వనంలో ఆటలాడే సమయాన
రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓమొక్క పుడుతుంది.
ఈ వింతను చెలులు పర్వతరాజుకు
చెప్పగా సతీసమేతంగా చూసేందుకు
వస్తాడు.
అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను
నావలన లోకానికి ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది.
అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది.
ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.
అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే ,పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు.
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా
ఈ గౌరింటాకు మానవలోకంలో
ప్రసిధ్ధమవుతుంద ని ,రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది.
అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తనవర్ణం వలన చేతులకు కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది
అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా అప్పటినుంచి , గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చి దిద్దుకుంటు ఉంటారు.
ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది.నుదుటన కూడా‌ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో
ఆసందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది. గోరింటాకు నుదుటన పండదు.

శాస్త్రపరంగా
1.గర్భాశయదోషాలు తీసేస్తుంది.
2. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి.
 వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి
ప్రశాంతపరుస్తుందిగోరింటాకు.
3. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి అంటారు పెద్దలు.

గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అన్నది నానుడి.

స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా
అందంగా సున్నితంగా ఉంటుంది.
అలా లేతగా ఉన్నచేత పెట్టుకున్న గోరింటాకు
మరింత అందంగా పండి కనిపిస్తుంది.
ఆ పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని
సూచిస్తుంది.
ఈ గోరింటాకు  సంవత్సరానికోమారు పుట్టింటికి వెళుతుంది.
అంటే పార్వతి దగ్గరికి.
ఆషాఢమాసంలో
అక్కడున్నపుడు కూడా తనను
మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.  ఆషాఢంలో అందరూ పెట్టుకోవడం సంప్రదాయం అయ్యింది.





Saturday, 26 January 2019

వెండి కుందులలో " దీపారాధన "


వెండి కుందులలో
నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ,
నువ్వుల నూనెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే
వారికి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును.
గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి
 లలితా త్రిపుర సుందరీదేవీకి,
రాజరాజేశ్వరీ అమ్మవారికి ,
సాలగ్రామాలకు
శ్రీగాయత్రీ మాతకు గానీ,
వెండి కుందులలో  వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో
పూర్తి ఆవుతాయి అని పెద్దలు చెపుతారు.

వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి కుందులలో  దీపాలతో ఆరాధన చేస్తే
కలిగే ఫలితాల వివరాలు :

1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12  మహాలక్ష్మీ - దారిద్య్రం
      తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు
      కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...

1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)

జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...

1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2)

సేకరణ

Tuesday, 22 January 2019

సంతోషం సగం బలం


మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు నాలుగు ఉన్నాయి ట.

1.ఎండార్ఫిన్స్
2.డోపమైన్
3.సెరొటోనిన్
4.ఆక్సిటోసిన్

1. ఎండార్ఫిన్స్ :

* వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది ..

* ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది...అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి.

* నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి..

రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి.హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి.

2. డోపమైన్..

మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము.ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది..

మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది.అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే .
ఒకసారి మనకు ఉద్యోగం దొరికాక..
కారు
ఇల్లు లాంటి  కొత్త కొత్త అధునాతన వస్తువులు కొన్నప్పుడు
ఆయా సందర్భాలలో ఈ డోపమైన్ విడుదల అవుతుంటుంది.

షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా అందుకే అనిపిస్తుంది.

3. సెరెటోనిన్
మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు విడుదల అవుతుంది.

మనం సాటివారకి గానీ ప్రకృతికి గానీ సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది.

4. ఆక్సిటోసిన్
మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు విడుదల అవుతుంది..
మన స్నేహితులనో కుటుంబసభ్యులనో ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.

 ఒక ఆత్మీయఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది.
అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ ని విడుదల చేయగలదు.

5. రోజూ వ్యాయామం
   ఎండార్ఫిన్స్ కోసం
6. చిన్ని చిన్ని లక్ష్యాలను సాధిస్తూ
    డోపమైన్ కోసం..
7. తోటివారితో స్నేహంగా ఉంటూ
    సెరొటోనిన్ కోసం...
8. మన పిల్లలను ఆలింగనం
    చేసుకుంటూ ఆత్మీయులను
    దగ్గరకు తీసుకుంటూ
    ఆక్సిటోసిన్ కోసం.

జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలము.
మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను సవాళ్ళను బాగా
పరిష్కరించుకోగలము.

1.ఆరుబయట ఆడుకునేలా  ప్రోత్సహించాలి...ఎండార్ఫిన్స్

2. బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించాలి...డోపమైన్

3.సాటివారిని కలుపుకుంటూ వారితో సంతోషాలు పంచుకుంటూ జీవించే అలవాటుని మీరు పాటిస్తూ పిల్లలకూ అలవాటు చెయ్యాలి...సెరొటోనిన్

4. మీ బిడ్డ ను
   దగ్గరకు హత్తుకోండి...ఆక్సిటోసిన్.




సేకరణ.

Monday, 21 January 2019

శ్యామలా దండకం


శ్యామలా దేవి

అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేనివారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు.
అలా అనుగ్రహిస్తే "అశ్రుత గ్రంధ భోధః" అనే సిద్ధిని ఇస్తుంది.
అంటే ఎప్పుడు విని కూడా ఉండని గ్రంధంలోని విఙ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుంది.
కనుక చిన్నతనం నుండి పిల్లల చేత శ్యామాలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి.
పదాలు పలుకుతున్నప్పుడు  ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల ప్రాణాయామములు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది అని పెద్దలు చెపుతారు.
శ్యామలా దండకం
ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||
వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||
స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||
దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,
సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,
తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,
పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,
సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,
పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,
సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

Saturday, 1 December 2018

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు





1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో బా గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు  బొప్పాయి తీసుకోవడం మంచిది.


4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి,  తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.



Friday, 30 November 2018

రవ్వ పులిహోర





రవ్వ పులిహోర
కావలసిన పదార్థాలు

1. రవ్వ - ఒక కప్పు,
2. పచ్చిమిరపకాయలు - 5,
3. పల్లీలు - పావు కప్పు,
4. కరివేపాకు - నాలుగు రెమ్మలు,
5. నిమ్మకాయలు - 2,
6. ఎండు మిరపకాయలు - 2,
7. శనగపప్పు - 2 చెంచాలు,
8. మినపప్పు - ఒక చెంచా,
9.ఆవాలు - అర చెంచా,
10. జీలకర్ర - అర చెంచా,
11. పసుపు - పావు చెంచా,
12. ఉప్పు- తగినంత
13 . నూనె - తగినంత

తయారీ విధానం
ఒక గిన్నె లో
రెండు కప్పుల నీళ్ళు మరిగించి
అందులో ఉప్పు, పసుపు వేయాలి.
దీంట్లో రవ్వ పోసి
ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసి
పక్కన పెట్టాలి.
మూకుడు లో నూనె పోసి
ఆవాలు, జీలకర్ర  వేసి ,
వేగాక ,
పల్లీలు వేసి బాగా  వేయించాలి.
ఆ తర్వాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేగనివ్వాలి.
దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.
కాస్త చల్లారాక
వేయించుకున్న రవ్వలో కలపాలి.
ఆ పైన
ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
రవ్వ పులిహోర రెడీ.
బాగా చల్లారిన తరువాత  తింటే బాగుంటుంది

Thursday, 29 November 2018

పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు



శ్రీవారి 
తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు  జరిగితే

అమ్మవారికి కార్తిక మాసంలో జరుగుతాయి.

అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి డిసెంబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. తిరుమలలో మాదిరిగానే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

* ప్రారంభానికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ప్రారంభం నాటి ఉదయం తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి అమ్మవారు తిరు వీధుల్లో ఊరేగి ఆలయం చేరుకున్నాక ద్వజారోహణం జరుగుతుంది. ఆ నాటి రాత్రి నుంచి వాహన సేవలు జరుగుతాయి.

* బ్రహ్మోత్సవాల్లో తొలినాటి రాత్రి చిన్న శేషవాహనంపై, రెండోరోజు ఉదయం పెద్ద శేషవాహనంపై అమ్మవారు ఊరేగుతారు.

* అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు అత్యంత ముఖ్యమైన గజ వాహన సేవ జరుగుతుంది. లక్ష్మీదేవి ఏనుగు కుంభ స్థలంలో నివసిస్తూ ఉంటుందని చెబుతారు. తాను నిత్యం నివసించే ఏనుగునే వాహనంగా చేసుకుని ఊరేగే అమ్మవారిని దర్శించడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.

తిరుమల నుంచి సారె...
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.
తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
అయ్యవారు - వేంకటేశ్వరుడు
అమ్మవారు -  పద్మావతీదేవి

ఆమె వ్యూహలక్ష్మి...
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు.

 శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది.

వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం.

శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి.
ఆ సరోవరంలో...
లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు.

మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు.

అలమేలు మంగ అమ్మవారు
పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు.

పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్‌మేల్‌ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి.

తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం.

పంచమీ తీర్థం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్‌ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు..

రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Friday, 23 November 2018

తెలుగు సామెతలు.

 తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా