Monday, 22 October 2018

మారేడు చెట్టు.

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.
అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను
‘శ్రీఫలము’  అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి , దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.
 అందుకే
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం "
అని తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.
మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.
అందులో మారేడు దళము ఒకటి.
మారేడు దళంతో పూజ చేసినప్పుడు
బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.

 ‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.
కాబట్టి
ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.

శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.

 మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే  దానికి "శ్రీసూక్తం"లో
 ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)  అని  చెప్తాము.
మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.
 నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.
తురీయమే జ్ఞానావస్థ.
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే.
ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
 శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.
మారేడు చెట్టు అంత గొప్పది.
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.
 ‘మా-రేడు’
తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి.
మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు.
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.
 ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
అందులో
1మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

3 మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

Thursday, 11 October 2018

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి నడకదారులు

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి  నడకదారులు

లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు.
చాలా మందికి తెలిసిన దారి అలిపిరి.  అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం

తిరుమలలో ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు.

తాళ్ళపాక అన్నమాచార్యులు
 గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో  వేంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

*అన్నమాచార్య*

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

*మొదటి మెట్టు*

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే *'ఆదిపడి*' అనగా మొదటిమెట్టు అని అర్థం.

*అలిపిరి*

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. *దూరం 11-12 KM* లు ఉంటుంది.

*రెండవ దారి*

*తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.* అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
*చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది.* చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

*మూడవ దారి*

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

*నాల్గవ దారి*

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

*నాల్గవ దారి*

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య *దూరం : 15 KM.*

*ఐదవ దారి*

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి
తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు.

 తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య *దూరం 12 KM.*

*ఆరవ దారి*

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

*ఏనుగుల దారి*

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

*తలకోన*

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

*తిరుమల గురించి మరికొన్ని విషయాలు*

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..

అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

*ఆంజనేయస్వామి*

గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

*మోకాళ్ళ మిట్ట*

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

*శ్రీవారి మెట్టు*

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

*శ్రీవారి మెట్టు*

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

*కౌంటర్*

శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.

*మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి*

1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. మీరు బస్సును అందుకోలేకపోతే జీప్/ కార్ మాట్లాడుకొని వెళ్ళవచ్చు

2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.

3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.

*వసతి*

వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి.

గైడ్ తప్పనిసరి

ఈసారి తిరుమలకు వెళ్ళే యాత్రికులు పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి. అయితే వెళ్ళేటప్పుడు గైడ్ లేదా స్థానికుల సహకారం తప్పనిసరి. కొత్త రూట్లు కదా

చేరుకోవడం ఎలా ?

అన్ని మార్గాలకు కేంద్ర బిందువు తిరుపతి. కనుక యాత్రికులు తిరుపతి చేరుకొని అక్కడి నుండి ఈ మార్గాలకు చేరుకొని శ్రీవారి ఆలయాన్ని దర్శించండి.

తిరుమల తిరుపతి దేవస్థానం 

Tuesday, 9 October 2018

మిరియాల అన్నం


మిరియాల  అన్నం

మిరియాలు లో
పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.

మిరియాల అన్నం

కావల్సిన పదార్థాలు

1. పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు,
2. సెనగపప్పు – అరకప్పు
3. మిరియాలపొడి –
రెండు చెంచాలు,
4. పల్లీలు -అరకప్పు,
5. పచ్చిమిర్చి – ఆరు,
6. తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా,
 7. కరవేపాకు రెబ్బలు – రెండు,
8. కొబ్బరి తురుము – పావుకప్పు
9. నూనె – అయిదు చెంచాలు,
10. పసుపు – చిటికెడు,
11.ఉప్పు – తగినంత.

తయారీ విధానం

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ,
పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి.
తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి.

ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరికొంచెం ఉప్పూ, కొబ్బరి తురుమూ,
మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి.
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.

మిరియాల అన్నంతో ప్రయోజనాలు

1. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి.
2. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి.
  శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే
  కాకుండా మలినాలు అన్నీ బయటికి  పోతాయి.

3. మిరియాల లో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

4. మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూరుస్తుంది.

5. జీవక్రియ సజావుగా, సాధారణ
స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

6. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ

మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

7. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.

8. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కుదిబ్బడ ,గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు  లో మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.

9. మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది.
క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

10.   మిరియాలలో ఉండే పెపైన్
        యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.
11. మిరియాలలో
     యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా
     ఉండుట వలన లైన్స్,ముడతలు,
     నల్లని మచ్చలు,కు
     వ్యతిరేకంగా పోరాటం చేసి
     చర్మాన్ని రక్షిస్తుంది.

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.




Monday, 8 October 2018

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా శ్లోకము


      శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా శ్లోకము

దుర్గా  దుర్గార్తి  శమనీ  దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ
ఓం దుర్గ  మోహాదుర్గ  మాదుర్గమార్ధ  స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహంర్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః

ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో
 వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు.


Wednesday, 26 September 2018

శ్రీతులసి మహిమ

శ్రీతులసి మహిమ
1.తులసి,
2.బృంద,
3.బృందారిణి,
4.విశ్వపూజిత,
5.విశ్వపావని,
6.పుష్పసార,
7.నందినీతులసి,
8.కృష్ణసేవిత

అను 8 నామములతో తులసిని పూజించినవారికి అశ్వమేధయాగమును చేసినట్టి ఫలితము కలుగును.

1. శ్రీతులసికి నిత్యము భక్తితో ప్రదక్షిణముచేసి నమస్కరించుటవలన , అనంతమైన పుణ్యఫలము కలుగును సర్వాభీష్టములు నెరవేరును.
2. ఆంజనేయస్వామిని తులసిదళములతో పూజించుట సర్వాభీష్టసిద్ధి.

3.ప్రతి ద్వాదశియందును తులసివన మధ్యమున శ్రీమహావిష్ణు సహస్రనామ పఠనము చేయువారికి సర్వాభీష్టములు సిద్ధించును.

4. ఒకసారికోసిన తులసిదళములు ఆరు రోజులవరకు పూజార్చనలకు ఉపయోగించవచ్చును.

5.ద్వాదశి రోజులలోనూ,శ్రవణా నక్షత్రమందును,అమావాస్య,పూర్ణిమ తిధులయందును,శుక్ర,మంగళ వారములలోనూ,మధ్యాహ్నము, సాయంసంధ్యలయందును,రాత్రులయందునూ తులసిదళములనుకోయుట మహాపాపము.
6. కృష్ణతులసి  పూజకు
    అత్యంతయోగ్యమైనది.

తులసిమాల
1. దీనిని ధరించుటవలన
    సర్వపాపములు నశించును.
    ఆరోగ్యరీత్యా రక్తపోటును రానీయదు
   విష్ణుసంబంధములగు మంత్రజపములకు     అత్యంత ప్రశస్తమైనది.

Sunday, 2 September 2018

వారానికి 7 రోజులు ఎందుకు ?

వారానికి 7 రోజులు ఎందుకు ?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది
ఆదివారం_తర్వాత_సోమవారం_ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా ?

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది . ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము . ఇవి ఏడు . ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది . నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు . ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి .

భారత కాలమానంలో #హోరా అనగా ఒక గంట అని అర్థం .దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు .
 ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి .
ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి .అవి వరుసగా  ..
 (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి .

ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి .
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది . అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి .

ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది .  23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది . 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది .

ఆతర్వాత హోరా 25వ హోరా,  అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా .
అనగా సోమవారము, అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది . ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది .

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము . ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి .

రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే ...సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి .

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ?  మంగళ వారమ్ రాకూడదా ? రాదు .
ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి ...
ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే.

గణపతి తాళం (Ganapthi Thalam) ganapathy Thalam

గణపతి తాళం (Ganapthi Thalam)
ganapathy Thalam

అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై |
రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో
గణపతి రభ మత మీహ దిశ తనుః
లంభోధర వర కుంజా వస్తిత కుంకుమ వర్ణ ధరం
శ్వేత శృంగం బీనసుహస్తం ప్రీతిత సఫల ఫలం
నాగత్రయ యుత నాగ విభూషణ నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం

తత్ పురుషాయ విద్మహే వక్రాతుండాయ ధీమహి తనో దంతి ప్రచొదయాథ్

వికటోత్కట సుందర దంతి ముఖం | భుజగేంద్రసుసర్ప గదాభరణం ||
గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ | ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||
సుర సుర గణపతి సుందర కేశమ్ | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానమ్ ||
భవ భవ గణపతి పద్మ శరీరమ్ | జయ జయ గణపతి దివ్య నమస్తే ||
గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రమ్ | గణ గుణ మిత్రం గణపతిమీశప్రియమ్ ||

కరద్రుత పరశుమ్ కంకణ పాణిం కబలిత పద్మ రుచిం | సురపతి వంద్యం సుందర వక్త్రం సుందరచిత మణి మకుటమ్ ||
ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం, తత్ తత్ షడ్గిరి తాళమిదం తత్ తత్ షడ్గిరి తాళమిదమ్ |
లంబోదర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరమ్ | శ్వేతసశృంగం మోదక హస్తం ప్రీతి సపనసఫలమ్||
నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం, తత్తం నయన త్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదమ్ ||

ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయమ్||

కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదమ్ | కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తత్ గణపతి వాద్యమ్ ఇదమ్, తత్ తత్ గణపతి వాద్యమిదమ్||

తక తకిట తక తకిట తక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |
తక తకిట తక తకిట తక తకిట తత్తోం, విమల శుభ కమల జల పాదుకం పాణినమ్ |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోం, ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్|
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మృదుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కదలి ఫల మోదనం మోదకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమథగురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!

Thursday, 16 August 2018

వరలక్ష్మి వ్రతం /// పూజా విధానం


వరలక్ష్మి వ్రతం

(పూజా విధానం )

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1 dazans
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటో.....................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

పూజా సామాగ్రి :-

దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,
లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.
వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది.
ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి.

Monday, 30 July 2018

ఏలకులు ఆరోగ్య ప్రయోజనాలు

ఏలకులు  ఆరోగ్య ప్రయోజనాలు

1. సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి..
అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి,  ప్రయోజనాలెన్నో ఉన్నాయి.
2. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు.
 3. బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
4. నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి.
5.  రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
6. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది.
7. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.
8.  రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి తే
ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోతుంది.
9.  నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది.
10.  రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది.
11. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది.
12. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.

Saturday, 21 July 2018

ఆలూ రోల్స్



కావాలసిన పదార్థాలు 

1. బంగాళదుంపలు(ఆలూ) - 2
2. బ్రెడ్ పౌడర్ - 1 కప్పు 
3. ఉడికించిన పచ్చిబఠాణీ -  1 కప్పు 
4. సేమియా - 1/4 కప్పు 
5. పచ్చిమిర్చి - 3
6. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
7. అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
8. గరం మసాలా - 1 స్పూన్ 
9. నెయ్యి - 1 స్పూన్ 
10. కొత్తిమీర తరుగు - 1/2 కప్పు 
11. మైదా (లేకపోతె వరిపిండి) - 1/2 కప్పు 
12. మొక్కజొన్న పిండి - 1/2 కప్పు 
13. ఉప్పు - రుచికి సరిపడినంత 
14. పసుపు - చిటికెడు 
15. కారం - 1/2 స్పూన్ 

తయారుచేయు విధానం 

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి , అందులో బంగాళదుంపల్నివేసి ఉడికించి ,
పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత పై తొక్కుతీసి ,
మెత్తగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా నూనె పోసి ,
ఉడికించిన పచ్చిబఠాణీని వేయించాలి, 
వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, 
మెత్తగా చేసుకున్న బంగాళాదుంప ముద్ద, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
 కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర, నెయ్యిని కూడా వేసి
బాగా అన్నీ కలిసేటట్టుగా చేసి 
కిందకి దింపి పక్కన ఉంచుకోవాలి. 
ఈ మిశ్రమం చల్లారిన తరవాత 
కోలగా రోల్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, మొక్కజొన్నపిండిని వేసి ,
అందులో కొద్దిగా ఉప్పుని వేసి ,
ఇడ్లీ పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. 
పక్కనే ఒక ప్లేట్ లో సేమియాని వేసి ఉంచుకోవాలి. 
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
అందులో రోల్స్ మునిగేటట్టుగా Deep Fry కి సరిపడినంత నూనెను పోసి,
 ఆ నూనె బాగా కాగిన తరవాత,
పక్కన ఉంచుకున్న రోల్స్ ని మైదా మిశ్రమంలో ముంచి ,
పక్కనే ఉన్న సేమియాలో అద్ది , నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.
అంతే కరకరలాడే వేడివేడి కమ్మని ఆలూ రోల్స్ 
రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి.     

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi